కోలీవుడ్‌లో హీరో సూర్యకు భారీగానే అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టినరోజు వస్తుదంటే చాలు వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ క్రెడిట్‌ను సూర్యకు ఇచ్చేస్తారు. తమిళనాడులో ఏమైన విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా కట్టకట్టుకుని నిలబడతారు. కోలీవుడ్‌లో సూర్యకు ఎంత గుర్తింపు ఉందో ఆయన అభిమానులకు కూడా సామన్యప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జులై 23న సూర్య పుట్టినరోజు రానుంది. ఈ క్రమంలో వారు పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చారు.
సూర్య పుట్టినరోజు సందర్భంగా గతేడాది 2000 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సూర్య చలించిపోయారు. అప్పుడు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని అభిమానులకు సూర్య మాటిచ్చారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అభిమానులతో పాటుగా సూర్య కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు సుమారు 500 మందికి పైగా అభిమానులు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమం మరో పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతామని ఆయన ఫ్యాన్స్ తెలిపారు.
సుమారు ఏడేళ్ల క్రితం హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ...చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన పిల్లలకు బంగారపు ఉంగరాలను అందించారు. అప్పట్లోనే అన్నదానాలు, రక్తదానాలతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. అలా ఆయన అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా ఫ్యాన్స్ నిలిచారు. పరిస్థితులు చక్కపడ్డాక వారందరినీ భోజనానికి సూర్య ఆహ్వానించారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగ గడిపారు. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment