
దేవుడిపై కేసు వేసేది వచ్చే నెలలోనే!
ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించి మెప్పించగల సత్తా ఉన్న కథానాయకుడు వెంకటేశ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న మలయాళ రీమేక్ ‘దృశ్యం’ కానీ, చేయనున్న బాలీవుడ్ రీమేక్ ‘ఓ మైగాడ్’ కానీ... రెండూ ప్రయోగాత్మక కథాంశాలే కావడం విశేషం. మలయాళంలో మోహన్‌లాల్, బాలీవుడ్‌లో పరేశ్‌రావెల్ చేసిన పాత్రల్ని తెలుగులో వెంకటేశ్ చేయడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమాలు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘దృశ్యం’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా ‘ఓ మైగాడ్’ చిత్రాన్ని మే నెలలో మొదలుపెట్టనున్నారు వెంకీ.
విధి కారణంగా సర్వం కోల్పోయిన ఓ వ్యక్తి... సూటిగా దేవునిపైనే న్యాయస్థానంలో కేసు దాఖలు చేయడం ఈ సినిమా కథాంశం. ఆసక్తికరమైన మలుపులతో వినోదంగా ఈ సినిమా సాగుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు కూడా ఈ చిత్రానికి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో పవన్‌కల్యాణ్ కృష్ణుడిగా ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. ఆయన కూడా మే నుంచి ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే వెంకటేశ్‌తో రెండు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఓ కథానాయిక ఇందులో వెంకీతో జతకట్టనున్నారు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్‌లతో పాటు... మరో స్టార్ కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘తడాఖా’ చిత్రాల ఫేం కిషోర్‌కుమార్(డాలీ) దర్శకుడు