చిరంజీవిగారితో కుదరకపోతే పవన్‌తో..!
‘మంచి కథ, పాత్రలు లభిస్తే... చిరంజీవిగారితో కలసి తెలుగులో మల్టీస్టారర్ సినిమా చేస్తా! ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ చిరంజీవిగారితో కుదరపోతే... పవన్‌కల్యాణ్‌తో మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమే’’ అన్నారు ఆమిర్‌ఖాన్. మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఆమిర్ చేసిన హిందీ సినిమా ‘దంగల్’ తెలుగులో ‘యుద్ధం’గా అనువాదమైంది. ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారం నిమిత్తం ఆదివారం ఆమిర్ హైదరాబాద్ వచ్చారు.
స్ట్రయిట్ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా... ‘‘భాష రాకుండా సినిమా చేస్తే పాత్రలో భావోద్వేగాలు ఆవిష్కరించ డం కష్టమని నా అభిప్రాయం. ఒకవేళ మంచి కథతో ఎవరైనా వస్తే నటిస్తా. తెలుగులో నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. మరి, మల్టీస్టారర్ చేయవలసి వస్తే ఎవరితో నటిస్తారు? అని అడగ్గా.. ‘‘తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్.. తమిళంలో రజనీకాంత్‌లతో చేస్తా. కథలో ఇద్దరు హీరోల పాత్రలూ అద్భుతంగా ఉండాలి’’ అన్నారు. ఆమిర్ హీరోగా సినిమా చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘అవన్నీ పుకార్లు మాత్రమే. ‘బాహుబలి’ తర్వాత ఆయన్ను ఓసారి కలిశానుl. కానీ, సినిమా గురించి ఏం మాట్లాడుకోలేదు’’ అన్నారు. రాజమౌళి కలల సినిమా ‘మహాభారతం’లో ఛాన్స్ వస్తే నటిస్తారా? అనడిగితే... ‘‘మహాభారతంలో కర్ణుడు, కృష్ణుడు పాత్రలు ఇష్టం. కర్ణుడు ఆరడుగుల ఆజాను బాహుడు. ఆ పాత్రకు సూటవను కనుక కృష్ణుడిగా నటించడానికి ఇష్టపడతా’’ అన్నారు.