
ఇంటర్వూ డా.డి. రామానాయుడు
మా ఫ్యామిలీ అంతా కలిసి ఓ సినిమాలో నటిస్తాం!
‘సినిమాకు సంబంధించిన 24 శాఖల్లో దేన్నయినా ఎంచుకో... నిర్మాత మాత్రం కావద్దు’... పరిశ్రమలో కొంతమంది పెద్దలు చెప్పే సూక్తి ఇది. నేటి పరిస్థితుల్లో ఇది నిజమే కావచ్చు. కానీ ఇదే వాస్తవం కాదు. నిబద్ధత, పట్టుదల, అభిరుచి, క్రమశిక్షణ, కార్యదీక్ష ఈ అయిదింటినీ ఆభరణాలుగా చేసుకొని ముందుకెళితే... నిర్మాణ రంగంలో కూడా విజయం తథ్యం. అందుకు నిలువెత్తు సాక్ష్యమే డా.డి.రామానాయుడు. ఒక నిర్మాతగా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలను సాధించి ‘మూవీమొగల్’ అనే బిరుదుకి సార్థకతను తెచ్చారాయన. త్వరలో నాయుడుగారు నిర్మాతగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ అయిదు పదుల ప్రస్థానంలో వందకు పైచిలుకు చిత్రాలను నిర్మించడం ఓ రికార్డ్ అయితే, దేశంలో ఎన్ని భాషల్లో అయితే చిత్ర నిర్మాణాలు జరుగుతున్నాయో, వాటన్నింటిలోనూ సినిమాలు నిర్మించడం మరో రికార్డ్. పి.సునిల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన
‘నేనేం చిన్నపిల్లనా’ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నాయుడుగారితో కాసేపు.
‘నేనేం చిన్నపిల్లనా’ ఎలా ఉంటుంది?
కాసేపు నవ్విస్తుంది. ఇంకాసేపు భావోద్వేగాల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళల్ని విపరీతంగా ఆకట్టుకునే సినిమా ఇది. ఇటీవలే శ్రేయోభిలాషులకు ఈ సినిమా వేశాం. మాకు తెలీకుండానే కన్నీరొచ్చేసిందండీ... అన్నారు. అంతటి ఉద్వేగం ఉంటుందీ సినిమాలో. ‘అందాలరాక్షసి’ ఫేం రాహుల్ ఇందులో బాగా చేశాడు. కొత్తమ్మాయి తన్వీవ్యాస్‌ని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. సాంకేతికంగా కూడా గొప్పగా ఉంటుందీ సినిమా. సునిల్‌కుమార్‌రెడ్డితో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.
మీరు కొత్తవాళ్లతో పనిచేయడానికి ఎక్కువగా ఆసక్తిచూపుతుంటారు. కారణమేంటి?
ప్రతిభను ప్రోత్సహించడం నాకు తొలినాళ్లనుంచీ ఉన్న అలవాటు. అవకాశం ఇచ్చి వదిలేయడం కూడా కాదు. వారి అభ్యున్నతికి కూడా నేనే బాటలు వేసేవాణ్ణి. తెలుగులో నాకు వాళ్లు సక్సెస్ ఇస్తే... ఇతర భాషల్లో ఆ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా వారినే
దర్శకులుగా ఎంచుకునేవాణ్ణి. మా సంస్థ ద్వారా ఇప్పటివరకూ 21 మంది కొత్త దర్శకులు పరిచయం అయ్యారు. 12 మంది హీరోయిన్లు, నలుగురు హీరోలు పరిచయం అయ్యారు. జేవీ రాఘవులు నుంచి ఎం.ఎం.శ్రీలేఖ వరకూ సంగీత దర్శకులు కూడా చాలామంది సురేష్ సంస్థ ద్వారానే వెలుగులోకొచ్చారు. ఒక నిర్మాతగా నాకెంతో సంతృప్తిని మిగిల్చే విషయం ఇది.
ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన మీ నుంచి ఇటీవలి కాలంలో ఆ స్థాయి సినిమాలు రావడం లేదనే అభిప్రాయం ఉంది?
ఇప్పుడు పరిస్థితులు ఇదివరకులా లేవు. హీరోల దగర్గకెళ్లి డేట్లు అడగలేను. ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఇంతకంటే మాట్లాడటం నాకిష్టం లేదు.
సినిమాల నిర్మాణం కూడా తగ్గించినట్టున్నారు. ఎందుకని?
అలాంటిదేం లేదే. ‘మసాలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘దసరాబుల్లోడు’ చేస్తున్నాం. పంజాబీలో నేను నిర్మించిన ‘సింగ్ వర్సెస్ కౌర్’ చిత్రాన్ని నాగచైతన్యతో నిర్మించబోతున్నాను. అలాగే... రానా కథానాయకునిగా కూడా ఓ చిత్రం మొదలు కానుంది. ఇక వేగం ఎక్కడ తగ్గినట్టు?
మీ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఓ చిత్రం చేయబోతున్నారట కదా?
అది నా జీవితాకాంక్ష. అక్కినేనివారి కుటుంబం అంతా ‘మనం’ చేస్తున్నట్లుగా, నా కుటుంబం అంతా కలిసి కూడా ఓ చిత్రం చేయాలని ఉంది. నేను, వెంకటేష్, రానా, నాగచైతన్య అందులో నటిస్తాం. నా చిన్నమనవడు అభిరామ్‌తో కూడా అందులో ఓ పాత్ర చేయించాలి. నా సినిమాల్లో చిన్ని చిన్న పాత్రలు చేసిన అనుభవం నాకుంది. అలాగే... ‘హోప్’ సినిమాలో పూర్తి స్థాయిలో నటించా. అన్నీ కుదిరితే మా ఫ్యామిలీ సినిమాలో కూడా పూర్తిస్థాయి పాత్ర చేస్తా. కథ దొరికితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్‌కి వెళ్లిపోతాం.
నిర్మాతగా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు కదా... ఎలా ఉంది?
చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మా అబ్బాయిలు గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
చివరిగా ఓప్రశ్న. రాష్ట్రం రెండుగా విడిపోతోంది కదా. మరి వైజాగ్‌లో కూడా ఓ సినీ కేంద్రం ఏర్పాటవుతుందంటారా?
సినిమా కేంద్రం మాత్రం హైదరాబాదే.