మలుపు ఖాయం!
‘‘ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుని ‘బీరువా’ సినిమా చేశాను. నా మీద ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఏమాత్రం వమ్ము చేయదు’’ అని సందీప్‌కిషన్ నమ్మకంగా చెబుతున్నారు. కణ్మణి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘బీరువా’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సందీప్ ముచ్చటించారు.
కేవలం కథను నమ్మి ఈ సినిమా చేశా. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయం తర్వాత నేను ఒప్పుకున్న కథ ఇది. అగ్రనిర్మాణ సంస్థలైన ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కూడా కథ నచ్చే సంయుక్తంగా ఈ సినిమా నిర్మించాయి. హేమాహేమీలైన ఛోటా కె. నాయుడు, థమన్, గౌతంరాజులు ఈ సినిమాను పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. నాక్కూడా సినిమా మీద నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా.
కథలోని కొత్తదనం తెలియాలనే ‘బీరువా’ టైటిల్ పెట్టాం. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేని ఇల్లు అయినా ఉంటుందేమో కానీ, బీరువా లేని ఇల్లు ఏదీ ఉండదు. ఈ సినిమాలో బీరువా కూడా ఓ కీలకపాత్ర పోషించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో రైలు ఎలా కీలకమైందో, ఇందులోని ప్రేమకథకు బీరువా కీలకమన్నమాట.
ప్రస్తుతం ‘టైగర్’ సినిమా చేస్తున్నా. ‘బీరువా’, ‘టైగర్’ చిత్రాలు నా కెరీర్‌ని కచ్చితంగా మలుపు తిప్పడం ఖాయం. ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి నా భవిష్యత్ కెరీర్‌ను ఎలా డిజైన్ చేసుకోవాలో నిర్ణయించుకుంటా.