వచ్చే ఏడాది హిందీ సినిమా చేస్తా!
ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్‌స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రారా కృష్ణయ్య.. ఇలా సినిమా సినిమాకీ నటునిగా పరిణతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన కథానాయకునిగా ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘జోరు’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించారు.
‘గుండెల్లో గోదారి’ టైమ్‌లోనే కుమార్ నాగేంద్ర, నేనూ ఓ సినిమా చేయాలనుకున్నాం. ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై ఎన్నో రకాలుగా ఆలోచించాం. పూర్తి స్థాయి కామెడీ సినిమా చేద్దామని చివరకు నాగేంద్రే అన్నాడు. నాక్కూడా ఆ ఆలోచన నచ్చింది. ప్రయోగాల జోలికి వెళ్లకుండా, ప్రేక్షకుల్ని నవ్వించడమే పరమావధిగా ఈ సినిమా చేశాం. కామెడీ కథల పరంగా ఇప్పటి వరకూ రాని కథాంశంతో ఈ సినిమా చేశాం.
చెబితే వింతగా అనిపిస్తుంది కానీ...
ఈ సినిమాలో రాశి ఖన్నా, సుష్మ, ప్రియా బెనర్జీ కథానాయికలు. ఈ ముగ్గురూ ఒకే పాత్ర పోషించడం విశేషం. ఆ పాత్ర పేరు అన్నపూర్ణ. చెబితే వింతగా అనిపిస్తుంది కానీ, చూస్తేనే మజా ఉంటుంది. అలాగే... ఇందులో నాకు ఇద్దరు అమ్మానాన్నలుంటారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ చిత్రాల శైలిలో కన్‌ఫ్యూజన్‌తో కూడిన కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు.
అక్కడ మంచి పేరు తెచ్చింది
‘షోర్ ఇన్ ది సిటీ’ చిత్రం బాలీవుడ్‌లో నాకు మంచి పేరు తెచ్చింది. అయితే... తెలుగులో బిజీగా ఉండటం వల్ల మళ్లీ బాలీవుడ్‌లో సినిమా చేయలేకపోయాను. వచ్చే ఏడాది ఓ హిందీ సినిమా చేస్తా. ఇక ఇక్కడి విషయానికొస్తే - కన్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. అలాగే ఎ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఆనంద్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న చిత్రం చేస్తున్నా. మరో తమిళ సినిమా కూడా ‘ఓకే’ చేశా.