విలక్షణ నటనతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఇర్ఫాన్ ఖాన్ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడున్న సమయంలో క్యాన్సర్ రక్కసి కోరలకు చిక్కి ఈ మహా నటుడు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న సహచరిని, తన ఇద్దరు కుమారులను శోక సంద్రంలో ముంచి శాశ్వత సెలవు తీసుకున్నాడు. ముంబైలోని వెర్సోవా శ్మశాన వాటికలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎటువంటి హడావుడి లేకుండా అంత్యక్రియలు ముగిశాయి.
ఇర్ఫాన్ ఖాన్ తోడునీడగా ఉన్న అతడి భార్య సుతాప సిక్దర్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఎప్పుడు అతడి పక్కనే ఉండేవారు. కానీ కెమెరా కంటికి చిక్కకుండా కాస్త ఎడంగా ఇర్ఫాన్ వెంట నడిచేవారు. ఇర్ఫాన్ గొప్ప నటుడిగా ఎదిగాడంటే అందులో మాటల రచయిత అయిన సుతాప పాత్ర కూడా ఉంది. గత ఫిబ్రవరిలోనే తమ వైవాహిక జీవిత రజోత్సవాన్ని జరుపుకుంది ఈ జంట. (మృత్యువుతో పోరాడి ఓడిన ఇర్ఫాన్)
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డీ)లో వీరిద్దరి ప్రేమకు బీజం పడింది. సహ విద్యార్థులైన వీరిద్దరికీ సినిమా, కళలు అంటే ఎంతో ఇష్టం. వీటిపై లోతైన చర్చలు జరిపేవారు. కొన్నిసార్లు వాదులాడుకునే వారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో కొన్నాళ్లకు ప్రేమ ప్రక్షులుగా మారిపోయారు. 1986లో దర్శకురాలు మీరా నాయర్ ‘సలాం బాంబే’ సినిమా కోసం ఇర్ఫాన్‌ను ఎంపిక చేయడం అతడి జీవితంలో కీలక మలుపు. అయితే ముందు వీధి బాలుడు సలీం పాత్రకు అతడిని ఎంపిక చేసిన మీరా నాయర్ తర్వాత మనసు మార్చుకుని టైపిస్ట్ పాత్ర ఇచ్చారు. ఆ సమయంలో ఇర్ఫాన్ నిరాశపడినా సుతాప అండగా నిలబడటంతో కుదుటపడ్డాడు.
ఇర్ఫాన్, సుతాప్ ఫిబ్రవరి 23, 1995లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదితో వీరి వివాహ బంధానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన మఖ్‌బూల్(2003), మీరా నాయర్ సినిమా ది నేమ్‌సేక్(2006) ముందు వరకు ఇర్ఫాన్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అద్భుత నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అతడు అత్యుత్తమ నటుడిగా అందరి మన్ననలు పొందాడు. అటు సుతాప కూడా మాటల రచయితగా ఖమోషీ, శబ్ద్, కహాని వంటి సినిమాలకు పనిచేశారు. తర్వాత నిర్మాతగా మారి తన భర్తను హీరోగా పెట్టి మదారి(2016), ఖరీబ్ ఖరీబ్ సింగిల్(2017) సినిమాలు నిర్మించారు.
2018లో క్యాన్సర్ బారినప్పుడు ఇర్ఫాన్ జీవితంలో మరోసారి కల్లోలం రేగింది. చికిత్స కోసం అతడు లండన్ వెళ్లినప్పుడు కుటుంబం అండగా నిలిచింది. తన భర్త పోరాట యోధుడని ప్రతి అడ్డంకిని విపరీతమైన దయ, అందంతో పోరాడుతున్నాడని ఆ సమయంలో సుతాప తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు. ఏడాది తర్వాత క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చిన ఇర్ఫాన్ ‘అంగ్రేజీ మీడియం’ సినిమాతో అందరినీ అలరించాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో తొలిసారిగా తన భార్యా పిల్లల గురించి ఇర్ఫాన్ బహిరంగంగా మాట్లాడాడు. ‘నేను జీవించాలి అనుకుంటే అది కేవలం నా భార్య కోసమే. నేను ఇంకా బతికి ఉండటానికి ఆమె కారణం’ అంటూ భార్యపై తనకున్న ప్రేమను వ్యక్త పరిచాడు. ఇద్దరు కొడుకులు బాబిల్, అయాన్ కూడా తనకు ఎంతో అండగా నిలిచారని పుత్సోత్సాహం ప్రదర్శించాడు. మార్చి 20న ‘అంగ్రేజీ మీడియం’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఇర్ఫాన్ ఆఖరి చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అందరూ అంటున్నట్టుగా భౌతికంగా ఇర్ఫాన్ లేకపోయిపోయినప్పటికీ వెండితెరపై అతడు ప్రాణం పోసిన పాత్రలతో కళ్లముందు మెదులుతూనే ఉంటాడు! (ఇంత తొందరగా వెళ్లిపోతారనుకోలేదు)
Comments
Please login to add a commentAdd a comment