ప్రేమకు, అట్రాక్షన్‌కు తేడా తెలియని వయసులో ప్రేమించుకున్నారు. కానీ వారికి తెలియకుండానే పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. మరీ ముఖ్యంగా షారుక్ ఖాన్! ఇదంతా అయ్యే పని కాదనుకుందో.. మరేంటో కానీ గౌరీ సడన్‌గా అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఊపిరాడట్లనైంది షారుక్‌కు. తనకోసం ముంబై అంతా గాలించాడు. ప్రేయసి కళ్లముందుకు రాగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది. తనను హత్తుకున్నాడు. జీవితంలో చేయి వదలనన్నాడు. అదే మాట మీద నిలబడ్డాడు కూడా! త్వరలో (అక్టోబర్ 25న) షారుక్- గౌరీల పెళ్లి రోజు రాబోతోంది. ఈ సందర్భంగా వారి ప్రేమకహానీని ఓసారి గుర్తు చేసుకుందాం..
18 ఏళ్లకే లవ్..
అది 1984.. అక్కడ పార్టీ జరుగుతోంది. మేం వయసుకు వచ్చాం అంటూ కుర్రాళ్లు హంగామా చేస్తున్నారు. అందులో షారుక్ కూడా ఉన్నాడు. అప్పుడతడి వయసు 18 ఏళ్లు. ఆ పార్టీలో అతడి కళ్లంతా ఒక అమ్మాయి మీదే ఉన్నాయి. ఎవరా అమ్మాయి? అని తన స్నేహితుడిని అడిగాడు. అతడు కనుక్కుని వస్తానని చెప్పి ఏకంగా ఆ అమ్మాయితో డ్యాన్స్ కూడా చేసి వచ్చాడు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోందని షారుక్ ఆశలపై నీళ్లు చల్లాడు.
వేరే అబ్బాయిలతో మాట్లాడితే తట్టుకోలేని షారుక్
ఇంతకీ అక్కడున్న అమ్మాయి ఎవరో కాదు గౌరీ ఖాన్. తన వయసు 14 ఏళ్లు. తను ఎదురుచూస్తోంది బాయ్‌ఫ్రెండ్ కోసం కాదు, తన సోదరుడి కోసం.. కాకపోతే అప్పట్లో అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడేది. ఎవరు పలకరించినా నవ్వుతూనే మాట్లాడేది. తొలి చూపులోనే షారుక్‌కు తెగ నచ్చేసింది. అక్కడ మొదలైంది వారి పరిచయం. షారుక్ మాటతీరు, నడవడిక గౌరీకి కూడా నచ్చేసింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ షారుక్‌కు పొజెసివ్‌నెస్ ఎక్కువ. గౌరీ వేరే అబ్బాయిలతో చనువుగా మాట్లాడితే తట్టుకోలేకపోయేవాడు. వద్దని వారించేవాడు.
పిచ్చోడిలా బీచ్‌ల వెంట తిరిగిన హీరో
ఈ ప్రవర్తన తట్టుకోలేకపోయిన గౌరీ ఖాన్ ఈ రిలేషన్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది. షారుక్‌కు చెప్పకుండా ముంబై వెళ్లిపోయింది. ప్రియురాలు కనిపించకపోయేసరికి పిచ్చోడయ్యాడు. తన కెమెరా అమ్మేసి ఆ డబ్బులతో ముంబై వెళ్లాడు. గౌరీకి బీచ్‌లంటే ఇష్టం కాబట్టి అక్కడే ఎక్కడో ఉండొచ్చని ఆలోచించాడు. ఆటో డ్రైవర్ చేతిలో రూ.400 పెట్టి ఈ డబ్బుతో ఎన్ని బీచ్‌లు తిరగొచ్చో అన్ని బీచ్‌ల దగ్గరకు తీసుకెళ్లమన్నాడు. అలా కొన్ని బీచ్‌లు తిరిగిన తర్వాత ఓ సముద్ర తీరంలో గౌరీ గౌంతు వినబడింది. తనలో తనకే తెలియని సంతోషం మొదలైంది. షారుక్‌ను చూడగానే షాకైన గౌరీ ఇక్కడేం చేస్తున్నావ్? అని అడిగింది.
పెళ్లి చేసుకుంటే పనైపోతుంది..
తనకోసమే పిచ్చోడిలా తిరుగుతున్నాడని తెలిసిన గౌరీ మనసు కరిగిపోయింది. వారి ప్రేమ మరింత బలపడింది. అదే బీచ్‌లో పెళ్లి చేసుకుందాం అని అడిగాడు షారుక్. అయినా తను ఒప్పుకోలేదు. ఏడాది తర్వాత షారుక్ తల్లి మరణించింది. అప్పుడు ఎంతో బాధపడిన గౌరీ.. పెళ్లి చేసుకునే సమయం వచ్చిందని చెప్పింది. కానీ అప్పుడే హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు షారుక్. బ్యాచిలర్‌గా ఉంటేనే ఫాలోయింగ్ మెండుగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే నీ పనైపోతుంది అని నిర్మాతలు హెచ్చరించారు. షారుక్ వాటిని లెక్క చేయలేదు. ఇద్దరిదీ ఒకే మతం కాకపోవడంతో గౌరీ తల్లిదండ్రులూ పెళ్లికి ఒప్పుకోలేదు.
షారుక్ ఫ్రెండ్ ఇంటిపై రాళ్లు..
మనసు మారితే ఇక్కడికి రండంటూ ఓ అడ్రస్ ఇచ్చాడు. తనకంటూ ఓ ఇల్లు లేకపోవడంతో స్నేహితుడి ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఇంకేముంది, అప్పటికే కోపం మీదున్న గౌరీ తల్లిదండ్రులు ఆ ఇంటిపై రాళ్లదాడి చేయించారు. ఇలా ఎన్నో గొడవలు, వివాదాలు దాటుకుని 1991 అక్టోబర్ 25న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఆర్యన్, సుహానా, అభ్రమ్ అని ముగ్గురు పిల్లలు సంతానం. షారుక్ ఇప్పటికీ స్టార్ హీరోగా తన చరిష్మాను ఏమాత్రం తగ్గకుండా అలాగే కాపాడుకుంటూ వస్తుండగా గౌరీ ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తోంది. వీరిద్దరూ చిత్రసీమలో ఆదర్శ దంపతులుగా రాణిస్తున్నారు.
చదవండి: ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment