హీరో శివరాజ్‌కుమార్, కిచ్చ సుదీప్ ,పునీత్ రాజ్‌కుమార్,యశ్
శాండల్‌వుడ్‌ను శాసిస్తున్న నలుగురు హీరోలు, అందులో ఇద్దరు అన్నదమ్ములు, మరో ముగ్గురు నిర్మాతలు.. గురువారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐటీ అధికారులు ఉరుములేని పిడుగులా ఊడిపడే వరకు ఏం జరగబోతోందో అర్థం కానంత గుట్టుగా ఐటీ శాఖ ఆపరేషన్ చేపట్టింది. హీరోల ఇళ్లల్లో రాత్రి పొద్దుపోయేవరకు సోదాలు సాగాయి. తదుపరి పరిణామాలేమిటో అని శాండల్‌వుడ్ హీరోల
అభిమానుల్లో కలవరం నెలకొంది.
సాక్షి,బెంగళూరు: రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన ఐటీ శాఖ రూటు మార్చి శాండల్‌వుడ్‌పై భారీ దాడులకు నాంది పలికింది. ప్రముఖ హీరోలు శివరాజ్‌కుమార్, ఆయన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, తాజా హిట్ మూవీ కేజీఎఫ్ హీరో యశ్, మరో సీనియర్ హీరో కిచ్చ సుదీప్‌ల నివాసాలు, వారి బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచే దాడులు చేపట్టారు. శాండల్‌వుడ్ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు, డిస్ట్రిబ్యూటర్ జయణ్ణ ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం, వాటి కలెక్షన్‌లు, పన్ను ఎగవేత అనుమానాల వల్లే ఐటీ అధికారులు సోదాలకు పాల్పడినట్లు శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు.
బుధవారమే సెర్చ్ వారంట్
సోదాల నిమిత్తం బుధవారమే కోర్టు నుంచి ఐటీ అధికారులు సెర్చ్ వారంట్ తెచ్చుకున్నారు. 15 రోజుల క్రితమే బెంగళూరు, పణజి, చెన్నై, హైదరాబాద్, అమరావతితదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మంది ఐటీ అధికారులు ఈ దాడులకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎక్కడా కూడా ఈ విషయం లీక్ కాకుండా పక్బందీ ప్రణాళికలు రచించారు. అనూహ్య దాడులతో సినీరంగంలో గుబులు నెలకొంది.
పునీత్ రాజ్‌కుమార్ నివాసంలో
సదాశివనగరలోని పునీత్ రాజ్‌కుమార్ నివాసంపై సోదాలు జరిపి కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలిసింది. ఇటీవల పునీత్ రాజ్‌కుమార్ నటించిన అన్ని చిత్రాలు దాదాపుగా విజయవంతం అయ్యాయి. దీనికితోడు ఆయన పీఆర్‌కే అనే ఆడియో కంపెనీ కూడా ప్రారంభించారు. కొద్ది రోజుల్లో నటసార్వభౌమ అనే చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోదాల సమయంలో భారీగా వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు లభించినట్లు ఈ నేపథ్యంలో వాటిని లెక్క గట్టేందుకు ముగ్గురు బంగారు పరిశోధకులను పిలిపించారు. సుమారు నలుగురు అధికారులు బృందం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పునీత్ సమాధానాలిచ్చారు.
శివరాజ్‌కుమార్ నివాసంలో
మాన్యత టెక్‌పార్కు సమీపంలోని శివరాజ్‌కుమార్ ఇంటిలో సోదాలు జరిపారు. ఒక మహిళా అధికారి చేత శివరాజ్‌కుమార్ సతీమణి గీతను కూడా విచారించినట్లు తెలిసింది. ఉదయం 8 గంటలకు సోదాలు ప్రారంభమయ్యాయి. ఆరుగురు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సంభావనే, విలన్ చిత్రాలకు సంబంధించిన వివరాలు అధికారులు తెలుసుకున్నారు.
యశ్, భార్య, బంధువుల ఇళ్లలో
కేజీఎఫ్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన యశ్‌కు చెందిన నాగరభావిలోని నివాసంపై, కత్రిగుప్పేలో ఉన్న మరో ఇంటిపై కూడా సోదాలు చేశారు. ఆయన సోదరి, మామ ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించారు. యశ్ మామను అధికారులు రహస్య ప్రాంతానికి కారులో తీసుకెళ్లి మరీ విచారణ చేపట్టారు. యశ్ సతీమణి రాధిక పండిత్‌కు చెందిన గాయత్రి నగర్ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఎన్‌జీఈఎఫ్‌లోని ఆ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ ఇళ్లలోనూ గాలింపు జరిపారు.
ముంబయి నుంచి యశ్ రాక
తాను నటించిన కేజీఎఫ్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ముంబై వెళ్లిన యశ్.. ఐటీ సోదాల విషయం తెలుసుకుని హుటాహుటినా బెంగళూరుకు చేరుకున్నారు. సోదాలు వల్ల తన ఇంట్లో ఫోన్లు అన్నింటిని అధికారులు స్విచ్ఛాఫ్ చేశారు. ఇంట్లో పరిస్థితి ఏంటో ఎలా ఉందో కూడా తనకు తెలియదని చెప్పారు. టీవీల ద్వారానే తన ఇంట్లో ఐటీ అధికారులు దాడి చేసినట్లు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ చట్టానికి తలొంచాల్సిందేనని తెలిపారు.
మైసూరు నుంచి సుదీప్
మైసూరు నుంచి షూటింగ్‌ను రద్దు చేసుకుని వచ్చి న సుదీప్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాం టి తప్పు చేయలేదని తెలిపారు. తనపై వ్యక్తిగత కక్షతో ఎవరూ దాడులు చేయడం లేదని, కేవలం మూడు సినిమాలకు సంబంధించి మాత్రమే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.
నిర్మాతల నివాసాల్లో
= నగరంలోని మహాలక్ష్మి లేఔట్‌లో ఉన్న బడా నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంటిని, కారును కూడా క్షుణ్ణంగా వెతికారు. 8 మంది అధికారుల బృందం ఆయనను ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన ఇంట్లో లభించిన బంగారాన్ని కొలిచేందుకు ప్రత్యేకంగా తూక పరికరాన్ని తెప్పించారు. ఆయన సతీమణి, కుమారుడు, కోడలు, మనమవళ్లను కూడా ప్రశ్నించారు.
= చిత్ర నిర్మాత, జేడీఎస్ ఎమ్మెల్సీ సీఆర్ మనో హర్ ఇళ్లు, ఆఫీసులపై సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
=జేపీ నగరలోని సుదీప్ ఇంట్లో అధికారులు ఉదయం 8 గంటల నుంచి సోదాలు చేశారు. ఆ సమయంలో సుదీప్ మైసూరులో సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అధికారులు సూచనల మేరకు హుటాహుటిన మైసూరు నుంచి తిరిగి వచ్చారు. ఆయన నివాసంలో పలు రికార్డులు, బ్యాంకు స్టేట్‌మెంట్ల వివరాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment