ఇది నీ బలం అని బన్నీ అన్నాడు!
‘‘నా బెస్ట్ క్రిటిక్ బన్నీ (అల్లు అర్జున్)నే. ‘కొత్త జంట’ చూశాక ‘రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే పాత్రలు సెలెక్ట్ చేసుకో. నువ్ కానిది చూపించా లంటే నటుడిగా కొంచం మెచ్యూర్టీ కావాలి. ఇంట్లో చాలా సరదాగా ఉంటావ్. ముందు అలాంటి క్యారెక్టర్లు చేస్తే, ఆ తర్వాత ఏ పాత్ర చేసినా బాగుంటుందన్నాడు. ఈ సినిమా చూసి ‘ఇది నీ బలం’ అన్నాడు’’ అని అల్లు శిరీష్ చె.ప్పారు. పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా అల్లు అరవింద్ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ శుక్రవారం విడుదల కానుంది. అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు...
అందమైన ప్రేమకథతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. బాగా డబ్బున్న అబ్బాయి ఓ సాధారణ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమకు అడ్డంకి ఎవరు? ఏమైంది? అనే సింపుల్ కథతో సినిమా ఉంటుంది. ట్రీట్మెంట్, స్క్రీన్‌ప్లే ఫ్రెష్‌గా ఉంటాయి. అమ్మాయి ప్రేమ కోసం సినిమా అంతా తాపత్రయ పడే పాత్ర నాది. అలాగని డల్‌గా ఉండడు. షూటింగ్ మొదలైన ఓ వారం రోజుల వరకూ దర్శకుడు పరశురామ్ స్టైల్ అర్థం కాలేదు. లావణ్యకూ అంతే. ‘ఏం చేసినా ఇలా కాదండీ’ అనేవారు. నటనలో సహజత్వం కోరుకుంటున్నారని ఇతర ఆర్టిస్టులతో సన్నివేశాలు తీస్తున్నప్పుడు అర్థమైంది. ఆ తర్వాత చకచకా చేసుకుంటూ వెళ్లాం. బాగా నటిస్తే, షాట్ ఓకే అనకుండా.. ‘దొరికేసింది. సూపర్బ్’ అనేవారు. ఓ టీచర్‌లా చాలా విషయాలు నేర్పించారు. లావణ్య చాలా జోవియల్. సెట్స్‌లో జోకులేస్తూ నవ్విస్తుంది. ఒక్కోసారి సీన్‌లో నేనెలా నటిస్తున్నానో ముందు చెప్పేవాణ్ణి కాదు. సర్‌ప్రైజ్ ఇచ్చేవాణ్ణి. తను స్పాంటేనియస్‌గా భలే నటించేది. ఆ సీన్స్ బ్యూటిఫుల్‌గా వచ్చాయి.
స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్ వంటి క్రియేటివ్ జాబ్స్ ఓకే. ప్రొడక్షన్ బోరింగ్. ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అంతకు ముందు ప్రొడక్షన్ చేశాను. ఇప్పుడా పనులు చూసు కునే టైమ్ లేదు. పెళ్లికి అప్పుడే తొందరేముంది. ‘ఎవరైనా అడిగితే (సంబంధాలు వస్తే) ఏం చెప్పమంటావ్?’ అని నాన్నగారు అడిగారు. నాలుగేళ్ల తర్వాత చేసుకుంటానని చెప్పా. గాళ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. స్వీట్ అండ్ సింపుల్ గాళ్స్ నచ్చుతారు.