Jaanu Movie Review, in Telugu | Rating {4/5}| ‘జాను’ మూవీ రివ్యూ | Samantha Akkineni, Sharwanand - Sakshi
Sakshi News home page

‘జాను’ మూవీ రివ్యూ

Published Fri, Feb 7 2020 3:09 PM | Last Updated on Tue, Jul 27 2021 3:32 PM

Jaanu Telugu Movie Review And Rating - Sakshi

సినిమా : జాను
నటీనటులు : శర్వానంద్‌, సమంత, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, శరణ్య
దర్శకత్వం : సి.ప్రేమ్‌ కుమార్‌
నిర్మాత : దిల్‌ రాజు, శిరీష్‌
సంగీతం : గోవింద వసంత
జానర్‌ : రొమాంటిక్‌ డ్రామా
బ్యానర్‌ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

తమిళ తెరపై సంచలనం సృష్టించిన క్లాసిక్‌ సినిమా ‘96’. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో కన్నడలో ‘99’ గా రీమేక్ అయింది. గణేష్‌, భావన జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను రీమేక్‌ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శర్వానంద్‌, సమంత హీరో హీరోయిన్లుగా మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమారే ఈ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ 7వ తేదీన సినిమా థియేటర్ల తలుపు తట్టింది. మరి ‘96‘ మ్యాజిక్‌ను ‘జాను’  తెలుగు తెరపై కొనసాగించిందా? శర్వానంద్‌, సమంతల జంట భగ్న ప్రేమికులుగా ప్రేక్షకులను మెప్పించారా?.. లేదా?.

కథ : కే.రామచంద్రన్‌(శర్వానంద్‌) ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌. ఓ జర్నీలో చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ఊరికి వెళతాడు. అక్కడ ఒక్కొక్కటిగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. అలా తను చదువుకున్న స్కూల్‌ దగ్గరకు చేరుకుంటాడు. ఆ సమయంలోనే తొలిప్రేమ జ్ఞాపకాలు అతడి కళ్లముందు మెదులుతాయి. జానకీ దేవీ(సమంత)తో ప్రేమలో పడటం.. ఆమెతో గడిపిన మధుర క్షణాలు.. విడిపోవటం! అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత చోటుచేసుకునే కొన్ని పరిణామాలతో దాదాపు 17 సంవత్సరాల తర్వాత స్కూల్‌ ఫ్రెండ్స్‌ ఏర్పాటు చేసిన గెట్‌ టు గెదర్‌ పార్టీలో ఇద్దరూ కలుస్తారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారు? సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న ఓ ప్రేమ జంట మదిలో మెదిలే భావాలేంటి? అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ : ఓ మంచి కథకి భాషతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ‘ జాను’ సినిమాను ఓ రీమేక్‌లా కాకుండా తెలుగు నేటివిటీతో తెరకెక్కించాడు దర్శకుడు సి. ప్రేమ్‌ కుమార్‌. 96 సినిమా మ్యాజిక్‌ తెలుగు తెరపై కొనసాగిందని చెప్పొచ్చు. ప్రేమ కథలకు సోల్‌ అయిన ఎమోషన్స్‌ ఎక్కడా తక్కువ కాలేదు. తొలిప్రేమతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరి జీవితానికి ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది. కొన్నిసార్లు మనల్ని మనం తెరపైన చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇద్దరి మధ్యా చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. 96కు సంగీతం అందించిన గోవింద వసంత ఈ సినిమాకు కూడా పనిచేశారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ గిలిగింతలు పెడుతుంది. మాతృకతో పోల్చినపుడు కొన్ని పాటలు కొద్దిగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఫస్ట్‌ హాఫ్‌ కొన్ని కామెడీ సీన్లతో నవ్వులు పూయిస్తే.. సెకండ్‌ హాఫ్‌ భగ్న ప్రేమికుల మధ్య బాధతో మన గుండెని బరువెక్కిస్తుంది. అశ్లీలతకు తావులేని ఓ బ్యూటిఫుల్‌ ప్రేమకథా చిత్రమ్‌ ‘జాను’ అని ఒక్కమాటలో చెప్పొచ్చు. 



నటీనటులు : ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్‌ సమంత తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భగ్న ప్రేమికుడిగా శర్వానంద్‌ నటన యాజ్‌ యూజువల్‌. ఉన్నది కొద్దిసేపే అయినా వెన్నెల కిషోర్‌, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, శరణ్య నటన బాగుంది. శర్వానంద్‌, సమంతల చిన్నప్పటి పాత్రలుగా కనిపించిన సాయికుమార్‌, గౌరీ కిషన్‌ల నటనకూడా మనల్ని ఆకట్టుకుంటుంది.

ప్లస్‌ పాయింట్స్‌
శర్వానంద్‌, సమంతల నటన
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్ ‌
కొన్ని పాటలు 

- బండారు వెంకటేశ్వర్లు, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement