
చిరు చిత్రంలో నటించడం అదృష్టం
మిమిక్రీ లో మూడు బంగారు పతకాలు సాధించా
బొబ్బిలి: నవ్వించగలిగే నైపుణ్యముండే ప్రతి ఒక్కరినీ చిత్ర పరిశ్రమ గుర్తిస్తుందని ప్రముఖ హస్య నటుడు అద్దంకి శేషుకుమార్ ( షేకింగు శేషు) అన్నారు. బొబ్బిలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. 20 ఏళ్లుగా తాను మిమిక్రీ, వెంట్రి లాక్విజం చేశానన్నారు. రాజమండ్రిలో రాజ్యలక్ష్మి కళాసమితి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అఖిల భారత స్థాయి మిమిక్రీ పోటీల్లో తనకు వరుసగా మూడేళ్లు బంగారు పతకాలు వచ్చాయని చెప్పారు.మిమిక్రీలో ఎవరికీ గురువు ఉండరని, ఏకలవ్య విద్యేనన్నారు. తాను మిమిక్రీలో 2500 ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ఇప్పటివరకూ సినిమా చూపిస్తామామ, కుమారి 21ఎఫ్, సుప్రీం, సెల్ఫీరాజా, బాబు బంగారం, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాల్లో నటించానని చెప్పారు. ఇంకా 8 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైశాఖం, హైపర్, మిస్టర్ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు.
మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలి
బొబ్బిలి: సినీ పరిశ్రమలో మంచి కమెడియన్‌గా నిలదొక్కుకొని గుర్తింపు తెచ్చుకోవాలన్నదే లక్ష్యమని హాస్యనటుడు రాకెట్ రాఘవన్నారు.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా బుధవారం ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. పూర్వనటులు అల్లు రామలింగయ్య, రేలంగి, బ్రహ్మానందంలు ప్రజలకు ఎలా గుర్తుండి పోయారో ఆ విధంగా హాస్యనటుడిగా మిగిలిపోవాలన్నదే తన ఆశయమని చెప్పారు. తాను మొదట్లో ఆలిండియా రేడియాలో పనిచేశానని చెప్పారు. సండే సినిమా ద్వారా చలనచిత్రానికి పరిచయమయ్యానన్నారు. ఇప్పటివరకూ 150 సినిమాలు వరకూ చేశానని, బాద్‌షా, డార్లింగ్, అత్తారింటికి దారేది, కందిరీగ వంటి పెద్ద సినిమాల ద్వారా తనకు గుర్తింపు వచ్చిందన్నారు. కళాశాల రోజుల్లో తాను మిమిక్రీ ఆర్టిస్టుగా చేశానన్నారు. సీనియర్ కళాకారుల సలహాలు తీసకొని నటనను మరింత మెరుగు పరుచుకుంటానని చెప్పారు.
చిరు చిత్రంలో నటించడం ధన్యం
బొబ్బిలి: తాను ఏ హీరోకైతే అభిమానిగా ఉన్నానో, ఆయన 150వ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని నటుడు బొడ్డపల్లి శ్రీను ( గెటప్ శ్రీను) అన్నారు.. చిరంజీవి 150వ సినిమా అయిన ఖైదీ నెంబరు 150లో కోల్‌కత్తా పోలీసుగా నటించే అవకాశం వచ్చిందన్నారు.. బొబ్బిలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను నటించే హాస్య సన్నివేశాలను చిరంజీవి సతీమణి సురేఖ చూసి, వాటిని చిరంజీవికి చూపించారని చెప్పారు. తన నటన బాగుందని చిరంజీవి మెచ్చుకోవడం తన లైఫ్ టైం అచీవ్‌మెంట్ వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురంలో తాతలు ఉండేవారని, వ్యవసాయం కోసం తండ్రితో పాటు భీమవరం వద్ద ఆకివీడు వెళ్లిపోయామన్నారు.
తాను ఇంటర్ వరకూ ఆకివీడులో చదివి, హైదరాబాద్‌లో బీఏ చదవడానికి వెళ్లానన్నారు. అయిదో తరగతి నుంచి నటుడిగా చిన్న చిన్న వేషాలు వేసేవాడినన్నారు. తెలుగబ్బాయ్, మనసడిగాక, ప్రేమ నిజం సినిమాలకు అసిస్టెంటు డెరైక్టరుగా చేశానని చెప్పారు. అక్కడ కొంత మంది స్నేహితులు నటన వైపు వెళ్లాలని సూచించడంతో సినిమా రంగం వైపు వచ్చానన్నారు. చుట్టాలబ్బాయ్, తుంగభద్ర వంటి సినిమాల్లో నటించానని చెప్పారు. బొబ్బిలి గురించి సినిమాల్లో చూడడం తప్ప ఇప్పటివరకూ చూడలేదని, ఇప్పుడు ఇక్కడకు రావడం, చూడడం ఆనందంగా ఉందన్నారు..