ప్రపంచ సూపర్‌స్టార్ జాకీచాన్
ప్రపంచ సూపర్‌స్టార్ జాకీ చాన్ అని యువ నటుడు భరత్ పేర్కొన్నారు. కుంగ్‌ఫూ, కరాటే వంటి విద్యలతో కూడిన అబ్బుర పరిచే యాక్షన్ చిత్రాల కథా నాయకుడు జాకీచాన్ నటించిన పోలీసు కథా చిత్రాల్లో ఆరవ సీక్వెల్ పోలీసు స్టోరీ 2013. జాకీచాన్ సొంత నిర్మాణంలో 3డి ఫార్మెట్‌లో రూపొందిన తాజా చిత్రం ఇది. ఎస్.మోహన్ సమర్పణలో సురభి ఫిలింస్, ఇండో ఓవర్‌సీస్ సంస్థలు తమిళనాట ఇంగ్లీష్, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు భరత్ మాట్లాడుతూ తమిళనాడు మహానటుడు శివాజీ గణేశన్ నటించిన తంగపతకం, రజనీకాంత్ మూండ్రుముగం, కమలహాసన్ కాకిసట్టై, సూర్య నటించిన కాక్క కాక్క వంటి చిత్రాలు పోలీసు కథలతో రూపొంది విజయం సాధించాయన్నారు.
అదే విధంగా జాకీచాన్ పోలీసు కథల్లో నటించిన పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విజయ ఢంకా మోగించాయన్నారు. జాకీచాన్ చిత్రాలు అద్భుత యాక్షన్‌తో పాటు హ్యూమర్ మిళితమై జనరంజకంగా ఉంటాయన్నారు. ఈ 3డి పోలీ సు స్టోరీ-2013 చిత్రం ప్రజాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని భరత్ అన్నారు. చిత్ర సమర్పకుడు ఎస్.మోహన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో జాకీచాన్ తొలిసారిగా పాడిన ఒరిజినల్ ట్రాక్ పాట ఉంటుందని తెలిపారు. పోలీసు స్టోరీ - 2013 అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. చిత్రం గత వారం హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా భాషలలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పుష్పా కందస్వామి, దర్శకుడు పేరరసు, ఇండో ఓవర్‌సీస్ ఫిరోజ్ ఎలిస్ తదితరులు పాల్గొన్నారు.