ఎప్పుడు రిటైరవ్వాలో నా శరీరం డిసైడ్ చేస్తుంది!
ఎప్పుడు రిటైరవ్వాలో నా శరీరం డిసైడ్ చేస్తుంది!
Published Thu, Oct 24 2013 1:04 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
జాకీచాన్ రిటైర్‌మెంట్‌కి దగ్గరపడ్డారా?... ఇది దాదాపు ఐదారేళ్లుగా ఈ యాక్షన్ స్టార్ అభిమానుల్లో మెదులుతున్న సందేహం. ఒకవేళ రిటైర్ అయితే, మళ్లీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ స్టార్‌ని సిల్వర్ స్క్రీన్‌పై చూడటం కష్టమే. అందుకే, జాకీ అభిమానులు ఆయన రిటైర్ అవ్వకూడదని కోరుకుంటున్నారు. కానీ, ఇంకెంత కాలం ఫైట్లు చెయ్యమంటారు? అంటున్నారు జాకీ. ఆయన ఆర్టిస్ట్ అయ్యి దాదాపు 50ఏళ్లు పైనే అయ్యింది. 1962లో ఎనిమిదేళ్ల వయసులోనే నటుడిగా రంగప్రవేశం చేసిన జాకీచాన్ ఇప్పటివరకు దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు.
యాక్షన్ హీరోగా, కామెడీ హీరోగా, దర్శక, నిర్మాతగా, గాయకునిగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు జాకీచాన్. ప్రస్తుతం ఆయన నటించిన ‘పోలీస్ స్టోరీ 2013’ ఈ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఇవి కాకుండా మరో మూడు చిత్రాల్లో నటించనున్నారు జాకీ. ఇటీవల ఓ కార్యక్రమంలో జాకీచాన్ మాట్లాడుతూ - ‘‘మరో ఆరు నెలల్లో నాకు అరవయ్యేళ్లొస్తాయి. గతంలో ఎనర్జిటిక్‌గా ఉండేవాణ్ణి. అయితే ఇప్పుడు కొంచెం అలసటగా అనిపిస్తోంది. ఫైట్ సీన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటోంది.
గత కొంత కాలంగా మీ ‘రిటైర్‌మెంట్’ ఎప్పుడు అని మీడియావారు అడుగుతున్నారు. మరో ఐదేళ్ల తర్వాత అని సమాధానం చెబుతుండేవాణ్ణి. కానీ, ఈసారి వేరే సమాధానం చెబుతా. నేనెప్పుడు రిటైర్ అవ్వాలో నా శరీరం డిసైడ్ చేస్తుంది. అది ఎప్పుడు మొరాయిస్తే, అప్పుడు ఫుల్‌స్టాప్ పెట్టేస్తా’’ అని చెప్పారు. ఎంత పెద్ద రిస్కీ ఫైట్స్ అయినా డూప్ లేకుండా చేయడం జాకీ స్టయిల్. అయితే, భవిష్యత్తులో డూప్‌ని పెట్టుకోవచ్చేమో అని చెబుతూ -‘‘ఒకవేళ నేనెప్పటిలా ‘యాక్రోబాటిక్’ సీన్స్‌లో నటించాలంటే డూప్ సహాయం తీసుకోవాల్సిందే. ప్రేక్షకులు ఆమోదించి, క్షమిస్తే నేను డూప్‌ల సహాయం తీసుకుంటా’ అని సరదాగా పేర్కొన్నారు జాకీచాన్.
Advertisement
Advertisement