మూడు తరాల కథతో...
‘‘మా ‘జగన్నాయకుడు’ చిత్రం ఎప్పుడో విడుదల కావాలి. కానీ, సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఇప్పుడు విడుదలకు నోచుకుంటోంది’’ అని వి.ఎ. పద్మనాభరెడ్డి చెప్పారు. గతంలో పీసీ రెడ్డితో ‘భోగ భాగ్యాలు’వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరెడ్డి మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం నిర్మించారు. రాజా, పరిణిక, మమతా రావత్, శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్‌లు ముఖ్య తారలు. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ -‘‘ఢిల్లీలో ట్రిబ్యునల్ ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ దక్కించుకున్నాం.
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రజాసంక్షేమానికై తపించిన తాత... ఆ బాటలోనే పయనిస్తూ ఒక వైద్యునిగా, జన హృదయనేతగా ప్రజల హృదయాల్లో చెరగని సంతకాన్ని లిఖించిన తనయుడు... తాతనూ, తండ్రినే ఆదర్శంగా తీసుకొని నవ శకానికి నాంది పలికిన మనవడు... ఈ ముగ్గురి జీవితమే ‘జగన్నాయకుడు’ చిత్రం. ఏ నేతకూ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కథ కాదిది. ఎవర్నీ బాధపెట్టే విధంగా ఉండదు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమైన నేపథ్యంలో విలువైన రాజకీయా లెలా ఉండాలి? అని సందేశ మిచ్చే చిత్రం’’ అని తెలిపారు.