
ఘాటైన ముద్దు సన్నివేశాలకు కోత!
భారత్‌కు వచ్చేసరికి జేమ్స్‌బాండ్ కాస్త బుద్ధిమంతుడిగా కనిపించనున్నాడు. తన బ్రాండ్ అయిన ముద్దు సన్నివేశాల ఘాటును తగ్గించుకొని భారత్‌లో విడుదల అవుతున్నాడు. జేమ్స్‌బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్' శుక్రవారం భారత ప్రేక్షకులను పలుకరించనుంది. దేశంలో విడుదలకు అనుగుణంగా 'స్పెక్టర్'కు కేంద్ర సెన్సార్ బోర్డు కొన్ని కత్తెరలు వేసింది. ముఖ్యంగా రెండు ముద్దు సన్నివేశాల నిడివిని గణనీయంగా తగ్గించింది. అదేవిధంగా రెండుచోట్ల డైలాగ్‌లను మ్యూట్ చేసి.. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
సహజంగానే బాండ్ సినిమాలు అంటే ఘాటైన ముద్దు సన్నివేశాలు, బాండ్ గర్ల్స్‌తో సాగించే ప్రణయ సల్లాపాలు ఉంటాయి. అయితే, తాజా సినిమాలో హీరోయిన్లతో బాండ్ స్టార్ డానియెల్ క్రెయిగ్ సాగించే ముద్దు సన్నివేశాల నిడివిని దాదాపు 50శాతం వరకు తగ్గించి భారత్‌లో విడుదల చేస్తున్నట్టు తెలుస్తున్నది. తెరపై బాండ్ ముద్దులు పెట్టుకోవడంలో సెన్సార్ బోర్డుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, ఆ సన్నివేశాలు మరీ పొడవుగా ఉన్నాయని మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసిందని సెన్సార్ వర్గాలు తెలిపాయి.
బాండ్ సినిమాకు కత్తెరల విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహాలనీ తెలిపారు. మొత్తానికి బాండ్ సినిమాకు కత్తెరలు వేసి భారత్‌లో విడుదల చేయడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు కత్తెరలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాండ్ తాజా సినిమా 'స్పెక్టర్' భారీ కలెక్షన్లతో అదరగొట్టింది.