ఈ గ్యారేజ్‌కి స్పృహ ఎక్కువ
కొత్త సినిమా గురూ!
పర్యావరణ పరిరక్షణకి భంగం కలిగితే ఉద్యమించే ఒక కథానాయకుణ్ణి రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమాలో ఊహించగలమా? ధర్మం కోసం కన్న కొడుకునైనా కడ తేర్చే తండ్రిని దాదాపు హీరో తర్వాత హీరో అంతటి పాత్రలో చూడగలమా? సిద్ధాంతం కోసం ప్రేమని వదులుకొనే హీరో, ప్రేమించిన మనిషి మానసిక ఘర్షణని అర్థం చేసుకొని అతణ్ణే వదులుకొనే హీరోయిన్ - ఇలా ఎన్నో ఊహకందని పాత్రల సమాహారం - ‘జనతా గ్యారేజ్’.
పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి, జనతా గ్యారేజ్ అనే ఆటోమొబైల్ రిపేర్ షాపును పెట్టి నడుపుతుంటాడు సత్యం (మోహన్‌లాల్). గ్యారేజ్‌లోని మిగతా మెకానిక్‌లతో కలసి, కష్టం చెప్పుకున్నవాళ్ళకు అండగా నిలిచి, అన్యాయాన్ని అడ్డుకుంటూ వాళ్ళను కాపాడుతుంటాడు. ఆ క్రమంలో ఆఖరికి సొంత తమ్ముణ్ణీ, అతని భార్యను ప్రత్యర్థులు హతమారుస్తారు. పసిగుడ్డయిన ఆ తమ్ముడి బిడ్డ ఆనంద్ (జూనియర్ ఎన్టీఆర్) ఆ సంగతులేవీ తెలియకుండా, ఆ కుటుంబానికి దూరంగా ముంబయ్‌లో మేనమామ (సురేశ్) దగ్గర పెరుగుతాడు.
పర్యావరణ పరిశోధక విద్యార్థి అయిన హీరోకి మొక్కలంటే ప్రేమ. ప్లాస్టిక్ బ్యాగ్‌ల దుర్వినియోగం సహా అన్నింటిపై ధ్వజమెత్తే రకం. మేనమామ కూతురు (సమంత)తో అతనిదో ప్రేమ ప్రయాణం. పని మీద హీరో హైదరా బాద్ వెళతాడు. అక్కడ సత్యం కొడుకు రాఘవ(ఉన్ని ముకుందన్), వ్యాపారవేత్త ముఖేశ్ రాణా (మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్)కి అల్లుడై, కన్నతండ్రికే ఎదురుతిరిగి, పర్యావరణానికి చేటు చేస్తుంటాడు. హీరో అక్కడ కూడా పర్యావరణ పరిరక్షణ ఎజెండాతో గొడవకు దిగుతాడు. హత్యాయత్నంతో వెనక్కు తగ్గిన వయసు మీరిన సత్యం పక్షాన జనతా గ్యారేజ్‌కి వారసుడవుతాడు. ఆయనే తన పెద నాన్న అని తెలుసుకుంటాడు. తర్వాత సమాజానికి వారేం చేశారన్నది మిగతా సిన్మా.
శరీరాకృతిలో భారీ మార్పులతో సంబంధం లేకుండా చిన్న ఎన్టీఆర్‌లో డ్యాన్సింగ్ ట్యాలెంట్ అలాగే ఉందని ఈ సినిమాలో పాటలు మరోసారి గుర్తు చేస్తాయి. సినిమా అంతా కనిపించే ఉబ్బిన కళ్ళ సాక్షిగానే అయినా, ఉబికి వచ్చే కన్నీళ్ళతో సెకండాఫ్‌లో హీరో చేసిన సెంటిమెంటల్ సీన్, ప్రభుత్వాఫీస్ సీన్ సూపర్. హీరోయిన్లిద్దరూ కథ సగంలో వచ్చి, కథనం మధ్యలోనే కనుమరుగై పోతారు. మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ది ఫస్టాఫ్‌లో యాక్టివ్‌గా, సెకండాఫ్‌లో కేవలం విగ్రహపుష్టితో సాగే పాత్ర. ఆ పరిధిలో ఆయన, దీటుగా హీరో నటించారు. నటనకు అవకాశమెలా ఉన్నా, తెర నిండా ఆర్టిస్టులకు అవకాశమిచ్చిన కథ ఇది.
దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ప్రకృతి గీతం ‘ప్రణామం’ మాత్రం కొద్దిరోజుల పాటు పదే పదే వినిపిస్తుంది. హీరోయిన్లతో హీరో చేసే నేచర్‌టూర్ పాటలో, ప్రకృతిని తెరకెక్కించే షాట్స్‌లో తిరు కెమేరా పనితనం కనిపిస్తుంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ తరహాలో సామాజిక స్పృహ చాలా ఎక్కువే ఉన్న ఈ సినిమా సుదీర్ఘంగా, వీలైనంత తాపీగా నడుస్తుంటుంది. కథ అక్కడక్కడే తిరుగుతుంటుంది. సమాజంలోని ప్రతి విలన్‌కీ రిపేర్ చేయాలనుకోవడం, రకరకాల ఘటనలతో విలన్ ట్రాక్ ఎఫెక్టివ్‌గా అనిపించదు.
తమ్ముడి కుటుంబాన్ని చంపినవారిపై మోహన్‌లాల్ కానీ, చివరకు వారి పిల్లాడైన హీరో కానీ ఆఖరి దాకా ప్రతీకారం తీర్చుకోకపోవడం, ఊళ్ళో అందరితోనే గడిపేయడం కూడా రెగ్యులర్ సిన్మాకు భిన్నమైన రూటనుకోవాలి. మొత్తానికి ‘ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’ అని వచ్చిన ‘జనతా గ్యారేజ్’లోనూ చాలా రిపేర్లకి ఛాన్‌స ఉంది. అదే క్షణంలో ప్రకృతికీ, ప్రజలకీ మధ్య బ్యారేజ్‌గా ఈ గ్యారేజ్ కథకి చిన్న గుర్తింపూ మిగులుతుంది.
చిత్రం: ‘జనతా గ్యారేజ్’, తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమేరా: ఎస్. తిరునావుక్కరసు, యాక్షన్: అనల్ అరసు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్, రచన, దర్శకత్వం: కొరటాల శివ
- రెంటాల జయదేవ