'ఎన్టీఆర్, మోహన్‌లాల్.. మ్యాజిక్ చేశారు'
రెండంటే రెండే సినిమాలు తీసి.. వాటితోనే తారాపథంలోకి వెళ్లిపోయిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్, మహేశ్ బాబులతో మిర్చి, శ్రీమంతుడు తీసి రెండింటినీ బంపర్ హిట్ చేసిన శివ.. ఇప్పుడు ఎన్టీఆర్, మోహన్‌లాల్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి 'జనతా గ్యారేజ్' చే
శాడు. నిజానికి ఇంత పెద్ద స్టార్లను ఒకే ఫ్రేములో చూపించడం, వాళ్లతో కలిసి పనిచేయడం తనకు చాలా అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, వాళ్లు మ్యాజిక్ చేశారని అన్నాడు. వాళ్లిద్దరితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి అనిపిస్తుందని, కేవలం ఆ ఇద్దరు కలిసి ఉండటంతోనే జనతా గ్యారేజి సినిమాకు ఎక్కడలేని హైప్ వచ్చేసిందని చెప్పాడు. పెర్ఫామెన్సు విషయానికి వస్తే, ఇద్దరు పెద్ద నటులు ఒకే సినిమాలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవచ్చో ఇందులో చక్కగా చూపించారని అన్నాడు. గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా కథను కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే రాశానని కొరటాల శివ తెలిపాడు.
కథ గురించిన ఐడియా వచ్చిన సమయంలోనే.. దీనికి కేవలం ఎన్టీఆర్ అయితేనే సరిపోతాడని తాను అనుకున్నానన్నాడు. స్క్రిప్టు విన్నప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరుతో ఇక పూర్తిగా ఫిక్సయిపోయానని తెలిపాడు. ఒక నటుడు ప్రాజెక్టును గురించి ఎంతగా ఎగ్జైట్ అవుతాడన్నది దర్శకుడికి చాలా ముఖ్యమని, ఇక తనను ఎలా ఎగ్జైట్ చేయాలో కూడా ఎన్టీఆర్‌కు చాలా బాగా తెలుసని అన్నాడు. హీరోలు ప్రతి ఒక్కరికీ విభిన్నమైన శైలి ఉంటుందని, ఎన్టీఆర్ శైలిని ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో చూపిస్తున్నానని ధీమా వ్యక్తం చేశాడు.
తెలుగులో చాలామంది పెద్ద నటులున్నా, వారిని కాదని మోహన్‌లాల్‌ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న చాలామంది నుంచి వచ్చిందని, కానీ ఆ పాత్రకు ఆ స్థాయి నటుడైతేనే సరిపోతుందని శివ చెప్పాడు. వాళ్లిద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని తాను భావించానని, అలాగే ఉందని అన్నాడు. మోహన్‌లాల్ కూడా కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారన్నారు. ఇంతకుముందు సాధించిన విజయాల నేపథ్యంలో ఈ సినిమా ఎంత హిట్టవుతుందనే ఆలోచన కంటే, ప్రేక్షకులు దీన్ని ఎలా తీసుకుంటారోననే తనకు ఆసక్తిగా ఉందని కొరటాల అన్నారు. పరీక్ష రాసిన పిల్లాడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లే తనకూ ఉందన్నాడు. సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా చేస్తున్న విషయం తెలిసిందే.