ధైర్యం... బలం అవే ఆయుధం
ఓ యువకుడి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కుటుంబం, మరొకటి దేశం! రెండిటిలో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సిన టైమ్‌లో అతను ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీవీయస్ రవి దర్శకుడు. ఈరోజు దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ చిత్రమిది.
ఓ మధ్య తరగతి యువకుడు తనకెదురైన కష్టాలను మనోధైర్యంతో, బుద్ధిబలంతో ఎదుర్కొని కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది చిత్రకథ’’ అన్నారు.‘‘సాయిధరమ్ తేజ్‌కి తగ్గ కథ. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు ‘దిల్’ రాజు. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ – ‘‘మా ధైర్యం ‘దిల్’ రాజు గారే. ఆయన ముందుండి మా సినిమాను నడిపిస్తున్నారు. ఇటీవల ఇటలీలో రెండు పాటలు చిత్రీకరించాం. రేపటి నుంచి హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ తీస్తాం. జూలై కల్లా చిత్రీకరణ పూర్తిచేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. తమిళ హీరో ప్రసన్న విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్.