చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు – చిరంజీవి
‘‘ఎవరైనా సినిమాల్లోకి లవర్‌బాయ్‌గా రావాలనుకుంటారు. రవి అలా కాకుండా స్టార్టింగ్‌లోనే తన పర్సనాలిటీ, లుక్స్‌కి తగ్గట్టు టఫ్ పోలీసాఫీసర్ క్యారెక్టర్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. ఎవరేంటనేది వాళ్లు వేసిన తొలి అడుగును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ అడుగును రవి చక్కగా వేశాడని నమ్ముతున్నా. అతని భవిష్యత్తుకి ఇది మంచి ప్రారంభం అవుతుంది’’ అన్నారు నటుడు చిరంజీవి.
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవిని హీరోగా పరిచయం చేస్తూ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్‌కుమార్ నిర్మించిన సినిమా ‘జయదేవ్’. మణిశర్మ స్వరకర్త. మంగళవారం జరిగిన కార్యక్రమంలో నటుడు మోహన్‌బాబు పాటల సీడీలను విడుదల చేసి, తొలి సీడీని దర్శకుడు కె. రాఘవేంద్రరావుకి అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గంటా శ్రీనివాసరావుతో రాజకీయాలకు అతీతమైన స్నేహం నాది. వాళ్లబ్బాయి కంటే ఆయనకే సినిమాలపై మక్కువ ఎక్కువ. అప్పట్లో తనకున్న పరిస్థితుల వల్ల రిస్క్ తీసుకుని సినిమాల్లోకి రాలేదేమో! తనకు తీరని కోరిక కొడుకు ద్వారా తీర్చుకుంటున్న ఆనందం ఆయనలో కనపడుతోంది.
యాక్షన్, ఫ్యాక్షన్, రొమాంటిక్, కామెడీ.. అన్నిటినీ బాగా తెరకెక్కించగల సమర్థుడు జయంత్. అతని దర్శకత్వంలో నటించడం రవి అదృష్టం. ‘సినిమా రంగానికి దూరంగా ఉంటూ నా పనేదో నేను చేసుకుంటుంటే... మళ్లీ తీసుకొచ్చారు’ అన్నారు నిర్మాత అశోక్‌కుమార్. సినిమా ఇండస్ట్రీని వదిలేద్దామన్నా... అది మనల్ని వదలదు అశోక్. దీనికి దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. ఈ సినిమా సక్సెస్‌తో నిర్మాతగా మీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘స్వర్గం–నరకం’ టైమ్‌లో నేను గంటా రవిలా లేను.
అతను చాలా అందంగా ఉన్నాడు. హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘చిరంజీవి, మోహన్‌బాబుల అభిమాని అయిన రవి ‘నేను కూడా వాళ్లలా హీరో అవుతాను’ అని సినిమాల్లోకి వచ్చాడు. యాక్షన్ సినిమాలతో హీరోలుగా పరిచయమైనోళ్లు బాగా సక్సెస్ అయ్యారు. రవి కూడా సక్సెస్ అవుతాడు’’ అన్నారు టీయస్సార్. ‘‘గంటా రవి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ‘‘నా దేవుళ్లైన అమ్మానాన్నలు, ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులందరికీ థ్యాంక్స్’’ అన్నారు గంటా రవి. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, చిత్ర బృందం పాల్గొన్నారు.