నాని అభిమానులు గర్వంగా ఫీలవ్వాలి | Jersey Pre Release Event Victory Venkatesh Special Guest | Sakshi
Sakshi News home page

నాని అభిమానులు గర్వంగా ఫీలవ్వాలి

Published Tue, Apr 16 2019 3:29 AM | Last Updated on Tue, Apr 16 2019 4:35 AM

Jersey Pre Release Event Victory Venkatesh Special Guest - Sakshi

రాధాకృష్ణ, వెంకటేశ్, నాని, శ్రద్ధా శ్రీనాథ్‌

‘‘జెర్సీ’ వంటి మంచి సినిమా చేసినందుకు నానికి అభినందనలు. తన తొలి చిత్రం ‘అష్టా చమ్మా’ నుంచి నాని అద్భుతంగా నటిస్తున్నాడు. తను వన్నాఫ్‌ ది ఫైనెస్ట్‌ యాక్టర్స్‌ ఇన్‌ తెలుగు ఇండస్ట్రీ. నాని అభిమానులు చాలా గర్వంగా ఫీలవ్వాలి. మన తెలుగు ఇండస్ట్రీలో వన్నాఫ్‌ ది మోస్ట్‌ నేచురల్‌ యాక్టర్స్‌ తను.. నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని వెంకటేశ్‌ అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు.

ముఖ్య అతిథి వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘నాకు క్రికెట్‌ ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చానని కాదు.. వాస్తవం ఏంటంటే ‘జెర్సీ’ కోసమే వచ్చాను. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ చూసినప్పటి నుంచే చాలా ఇంప్రెస్‌ అయ్యా. ఈ సినిమాలో నేనూ భాగస్వామ్యం అయితే బాగుంటుందనుకున్నా.  డైరెక్టర్‌ గౌతమ్‌ చాలా క్లియర్‌గా ఉన్నాడు.. సినిమాలో ఏం చూపించాలనే అంశంపై. ట్రైలర్‌ చూశాక ఒకే ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది.. మైండ్‌ బ్లోయింగ్‌. ఇలాంటి నిజాయతీ ఉన్న సినిమాలు అరుదుగా వస్తాయి. ఇటువంటి చిత్రాలు నాని ఎంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్లలేం. ‘జెర్సీ’లాంటి సినిమాల్లోని పాత్రల్లో ఇన్‌వాల్వ్‌ అయినప్పుడు చాలా ఎమోషన్‌ అయిపోతాం. ఇలాంటి సినిమాలు చాలా ఇన్‌స్పిరేషన్‌గా, మోటివేషన్‌గా నిలుస్తాయని ట్రైలర్‌ చూడగానే అర్థమైంది.

ప్రతి ఒక్కరూ లైఫ్‌లో స్ట్రగుల్‌ అవుతూనే ఉంటారు. కానీ, వెనక్కి రాకుండా నిలదొక్కుకుని విజయాలు సాధించినప్పుడే థ్రిల్‌ ఉంటుంది. అదే ఈ సినిమాలో నాని చూపించబోతున్నాడు. ఈ చిత్రం చూశాక ఇది సినిమా కాదు, మన జీవితం అని అందరూ భావిస్తారు. కొన్ని సినిమాలు అందరికీ పాఠాలు నేర్పిస్తాయి. మీరు కన్న కలలు, మీ లక్ష్యం గుర్తొస్తాయి. ఇది మైండ్‌లో పెట్టుకుని మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఇదే విషయాన్ని నాని చూపించబోతున్నాడు.. ఈ సినిమా ఔట్‌ స్టాండింగ్‌గా ఉంటుందనే నాకు నమ్మకం ఉంది. టీమ్‌ అందరికీ అభినందనలు. ఈ చిత్రనిర్మాతలు నాకు మంచి మిత్రులు. మంచి సినిమా చేశారని గర్వంగా భావిస్తున్నా. మంచి సినిమా తీసిన గౌతమ్‌కి అభినందనలు. శ్రద్ధా శ్రీనాథ్‌ చాలా అందంగా కనిపిస్తున్నారు’’ అన్నారు.

నాని మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారు ఆవకాయలాంటివారు. ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆయన్ను చూస్తే ఏదో తెలియని ఓ పాజిటివిటీ. పెద్ద తెరపై చూసిన ఓ స్టార్‌ని పర్సనల్‌గా కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్‌ వెంకటేశ్‌గారు. ఆయన ఫంక్షన్‌కి వెళ్లాలనే కోరిక ‘బాబు బంగారం’ సినిమాతో తీరిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఆయన నా సినిమా ఫంక్షన్‌కి వస్తే బాగుండేదనే కోరిక ‘జెర్సీ’తో తీరింది. ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఓ సినిమా చేసి స్టేజ్‌ని షేర్‌ చేసుకోవాలనే కోరిక ఇంకా బలంగా ఉంది. మీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను సార్‌. ఏదైనా మల్టీస్టారర్‌ సినిమా గురించి డిస్కషన్స్‌ వస్తే వెంకటేశ్‌గారు, నేను కలిసి చేస్తే బాగుంటుందని చాలా మంది నాతో అన్నారు.

దాని కోసం వేచి చూస్తున్నా. ‘జెర్సీ’ ఆల్రెడీ నాకు చాలా చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ ఫంక్షన్‌కి ఆయన రావడంతో ఇంకా ఇంకా ప్రత్యేకం అయిపోయింది. ‘జెర్సీ’ టీమ్‌ తరఫున ధన్యవాదాలు సార్‌. ఇక ‘జెర్సీ’ విషయానికొస్తే.. నిజంగా మొదటిసారి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే ఏప్రిల్‌ 19న మీరంతా చాలా గర్వపడతారు. ఈ సినిమాకి పనిచేసిన టీమ్‌ అందర్నీ చూసి గర్వపడతారు. మీరందరూ గర్వించదగ్గ ఓ సినిమాలో నేనూ భాగం అయినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. కన్‌ఫార్మ్‌.. ఫిక్స్‌ అయిపోండి. బ్లాక్‌ బస్టర్‌ అనే మాటలు అనటం లేదు. ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు పెట్టకూడదనిపిస్తోంది. అంత గొప్ప సినిమా చేశాననే పూర్తి సంతృప్తి ఉంది నాకు. ఎందుకింత సంతృప్తి అనేది 19న చూస్తారు. గౌతమ్‌ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు.

తను ఈరోజు ఇక్కడ లేడు.. మాట్లాడలేకపోవచ్చు. కానీ 19న తన సినిమా మాట్లాడుతుంది. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కథ చెప్పడంలోనే ఒక భాగమయ్యారు. ఇంత అందమైన సినిమా చేశాననే భావనను ఏదైనా మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పినాసరే నాకు తక్కువ అయిపోతుంది. గౌతమ్‌ కొడుక్కి చెబుతున్నా.. మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతాడు. ‘జెర్సీ’ సినిమాని పూర్తిగా అర్థం చేసుకునే వయస్సు నీకుందో లేదో తెలియదు కానీ, నువ్వు పెద్దయ్యాక మీ నాన్నకి బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ అవుతావని కచ్చితంగా చెప్పగలను. ‘జెర్సీ’ ట్రైలర్‌ మీ అందరికీ (అభిమానులు) నచ్చిందా? ‘జెర్సీ’ ట్రైలర్‌ స్టైల్‌లో చెప్పాలంటే ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్‌ చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే.. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను’’ అన్నారు.


డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ– ‘‘నానిగారికి నేను బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌. వంశీ పంపిన ‘జెర్సీ’ ట్రైలర్‌ చూసి షాక్‌ అయ్యా. గౌతమ్‌ ఎంతో ఎఫర్ట్‌ పెట్టి బాగా తీశారు. వేసవిలో రెగ్యులర్‌ క్రికెట్‌కి మించి ఈ సినిమాలో క్రికెట్‌ ఉంటుంది. ఇది చాలా మంచి సినిమా. ఎవరూ మిస్‌ అవ్వొద్దు.. తప్పకుండా చూడాలి. మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి మంచి హిట్‌ ఇవ్వాలి’’ అన్నారు.

డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏది ఏమైనా నాని నాకు ప్రత్యేకం.. కారణం మీ అందరికీ తెలుసు. ఆర్జేగా పనిచేస్తున్న ఓ కుర్రాడు(నాని) 2008లో మా ఆఫీసుకి వచ్చి ‘అష్టా చమ్మా’కి ఆడిషన్స్‌ ఇవ్వడం గుర్తుంది. నాని.. నువ్వు స్టార్‌ మెటీరియల్‌ అని మెయిల్‌ చేశా. దశాబ్దం తర్వాత ఇప్పుడు ఆ మాట గుర్తుకొస్తోంది. నా మాట నిజమైనందుకు గర్వపడుతున్నా. ‘జెర్సీ’ సినిమా నాకు క్లోజ్‌. క్రికెట్‌ నేపథ్యంలో ‘గోల్కొండ హైస్కూల్‌’ సినిమా చేశా. ‘జెర్సీ’ సినిమా ట్రైలర్‌  చాలా బాగుంది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది.. అందులో ఎటువంటి డౌట్‌ లేదు. గౌతమ్‌ ‘మళ్ళీ రావా’ సినిమా చూసి ఎంజాయ్‌ చేశా. ఈ సినిమాతో తనకు మరో హిట్‌ రావాలి’’ అన్నారు.

శ్రద్ధా శ్రీనాథ్‌ మాట్లాడుతూ– ‘‘కన్నడ, తమిళ్, హిందీ సినిమాలు చేశా. ‘జెర్సీ’ లాంటి మంచి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అవుతుండటం నా అదృష్టం. నాలుగేళ్ల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాక్టింగ్‌ చేయడం తప్ప వేరే దేని గురించి తెలీదు. మంచి పాత్రలు చేయాలనుకునేదాన్ని.. ఇప్పుడు చాలా హ్యాపీ. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన గౌతమ్‌గారు నా హీరో. నిర్మాతలకు థ్యాంక్స్‌. నానీకి బిగ్‌ థ్యాంక్స్‌. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇంత పెద్ద సినిమాలో నేనూ ఓ చిన్న భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

 నిర్మాతలు రాధాకృష్ణ, మోహన్, రామ్‌ ఆచంట, డైరెక్టర్స్‌ సుధీర్‌ వర్మ, విక్రమ్‌ కె.కుమార్, వెంకీ కుడుముల, నటులు సత్యరాజ్, ప్రవీణ్, జశ్వంత్, కెమెరామేన్‌ సాను జాన్‌ వర్గీస్, పాటల రచయిత కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement