టైటిల్ : ఝాన్సీ
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
తారాగణం : జ్యోతిక, జీవి ప్రకాష్ కుమార్, ఇవానా, రాక్‌లైన్ వెంకటేష్
సంగీతం : ఇళయరాజా
దర్శకత్వం : బాలా
నిర్మాత : కోనేరు కల్పన
శివపుత్రుడు, నేను దేవుణ్ని, వాడు వీడు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాలా. రియలిస్టిక్ టేకింగ్, డార్క్ ఎమోషన్స్‌తో సినిమాలను తెరకెక్కించే బాలా.. జ్యోతిక ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ్‌లో ఫిబ్రవరిలోనే రిలీజ్ అయిన నాచియార్ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో ఈ రోజు(శుక్రవారం) విడుదల చేశారు. మరి బాలా మార్క్ టేకింగ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? రఫ్ అండ్ టఫ్ పోలీస్ పాత్రలో జ్యోతిక ఏ మేరకు ఆకట్టుకున్నారు..?
కథ ;
మైనర్లయిన గాలి రాజు (జీవి ప్రకాష్ కుమార్), రాశి (ఇవానా) ప్రేమించుకుంటారు. రాశి గర్భవతి అవుతుంది. దీంతో గాలి రాజు మీద రేప్ కేసు నమోదు చేస్తారు. ఈ కేసును సిన్సియర్ ఆఫీసర్ ఝాన్సీ ( జ్యోతిక) డీల్ చేస్తుంది. రాశిని తన సంరక్షణలోనే ఉంచుకొని కేసు ఎంక్వయిరీ చేస్తుంటుంది. గాలిరాజును అరెస్ట్ చేసిన పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. రాశికి పుట్టిన పిల్లాడి డీఎన్‌ఏ, రాజు డీఎన్‌ఏ మ్యాచ్ కాకపోవటంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు రాశి ఎవరి వల్ల గర్భవతి అయ్యింది..? ఈ కేసులో గాలి రాజు ఎలా ఇరుక్కున్నాడు..? కేసును ఝాన్సీ ఎలా సాల్వ్ చేసింది..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ ;
ఇప్పటి వరకు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో కాస్త లైటర్‌వేలో తెరకెక్కిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. బాలా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్, రా నెస్ కాస్త తక్కువగానే కనిపిస్తాయి. పాత్రల ఎంపిక, నటీనటుల నుంచి తనకు కావాల్సినది రాబట్టంలో తనకు తిరుగులేదని బాలా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు తెరమీద కనిపించిన జ్యోతిక డిఫరెంట్ రోల్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ గర్ల్‌గానే తెలిసిన జ్యోతికను రఫ్ అండ్ టఫ్ రోల్‌లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. యువ నటుడు జీవి ప్రకాష్ తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రాశి పాత్రతో వెండితెరకు పరిచయం అయిన ఇవాన నటన సూపర్బ్. ఇది ఆమెకు తొలి సినిమా అంటే నమ్మలేం.
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమా నిడివి. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమాను ఎక్కువగా సాగతీయకుండా ఒకటి రెండు సన్నివేశాల్లోనే అసలు కథ మొదలు పెట్టాడు బాలా. తొలి భాగంలో వచ్చే ఒకటి రెండు కామెడీ సీన్స్ తప్ప కథకు అవసరం లేని సన్నివేశాలు పెద్దగా కనిపించవు. ఇళయరాజా సంగీతం పరవాలేదనిపిస్తుంది. పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తెలుగు రిలీజ్ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలేవి తీసుకున్నట్టుగా అనిపించదు. తమిళ బోర్డులు, నేమ్ ప్లేట్లు తమిళ్‌లోనే కనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
లీడ్ యాక్టర్స్ నటన
కథా కథనం
మైనస్ పాయింట్స్ ;
తమిళ నేటివిటి
డబ్బింగ్
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment