బాహుబలికి అంబాని సాయం నిజమేనా..?
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 ట్రైలర్ చరిత్రకు తిరగరాస్తూ రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. మరే భారతీయ సినిమాకు సాధ్యం కానీ స్థాయిలో 24 గంటల్లో 50 మిలియన్ల( 5 కోట్ల)కు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు లైక్స్ విషయంలో అంతర్జాతీయ చిత్రాలకు బిగ్ టార్గెట్ను సెట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన 'అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్' మించి పోయింది బాహుబలి. అవెంజర్స్కు 5 లక్షల 16 వేల లైక్స్ వచ్చాయి. బాహుబలి 2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డ్ను బ్రేక్ చేసింది. వ్యూస్ పరంగా అవెంజర్స్ను బీట్ చేయలేకపోయినా.. 5 లక్షల 57 వేలకు పైగా లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సవాల్ విసిరింది.
అయితే బాహుబలి ఇంతటి భారీ రికార్డ్లు సాధించటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మొబైల్ నెట్వర్క్ సంస్థ జియో, ఫ్రీ ఆఫర్ కారణంగానే బాహుబలికి ఈ రికార్డ్ సాధ్యమయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్రీ ఆఫర్ ఈ నెలాఖరున ముగుస్తుండటంతో ఇక పై రాబోయే చిత్రాల టీజర్లు. ట్రైలర్లకు ఈ రికార్డ్లు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి తెలుగు ట్రైలర్ ను ఇప్పటి వరకు రెండున్నర కోట్ల మందికి పైగా వీక్షించారు.