ఇద్దరు హీరోల ముద్దుల డైరెక్టర్
హైదరాబాద్... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాటి పైకి వెళితే... పూరీ జగన్నాథ్ ఆఫీస్... ‘కేవ్’... వాతావరణం చలి చలిగా ఉంది. ఏసీ గాలులు సన్నగా వీస్తూనే ఉన్నా, ఆ గదిలో వాతావరణం మటుకు వేడెక్కిపోతోంది. టేబుల్‌కు అటు వైపు దర్శక - రచయిత పూరి. ఇటువైపు హీరో కల్యాణ్‌రామ్, అతని తమ్ముడు - యంగ్ టైగర్ చిన్న ఎన్టీయార్. అందరూ ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్లున్నారు. సిగరెట్ వెంట సిగరెట్ కాలుస్తూ, పూరి ఉద్విగ్నంగా కథ చెప్పుకుంటూ పోతున్నారు. కల్యాణ్‌రామ్, ఎన్టీయార్ అంతకన్నా ఉద్విగ్నంగా, మంత్రముగ్ధులై వింటున్నారు. నిమిషాలు క్షణాల్లా గడిచిపోయాయి. కథ నేరేషన్ పూర్తయింది. చటుక్కున ఎన్టీయార్ కుర్చీలో నుంచి లేచారు. పూరిని హత్తుకొని, ‘అదిరిపోయింది! ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా!’ అన్నారు. పెదాల మధ్య సిగరెట్ వెలుగుతున్న పూరి ముఖంలో ఒక చిరునవ్వు వెలిగింది.
కానీ, ఆయన అంతటితో ఆగలేదు... ఇప్పుడిక అన్నయ్య వంతు. వేడి వేడి కాఫీ సిప్ చేస్తూ, కల్యాణ్‌రామ్ కోసం మరో కథ మొదలుపెట్టారు. ఎలా గడుస్తోందో, తెలియకుండానే మరో గంట గడిచిపోయింది. ఊహించని స్క్రిప్ట్‌కు ఉక్కిరిబిక్కిరైన కల్యాణ్‌రామ్ దాదాపు అరిచినంత పని చేశాడు... ‘ఇదీ మనమే చేస్తున్నాం పూరీ సార్!’ ఇద్దరు హీరోలు... ఒక దర్శకుడు... సింగిల్ సిట్టింగ్... రెండు స్క్రిప్ట్‌ల నేరేషన్... రెండు ప్రాజెక్ట్‌లకూ గ్రీన్ సిగ్నల్.
కట్ చేస్తే... కల్యాణ్‌రామ్ సొంత బ్యానర్‌లో కల్యాణ్‌రామ్ - పూరి కాంబినేషన్ సినిమా ఎనౌన్స్ అయింది. ఏప్రిల్ నుంచి పిక్చర్ పట్టాలెక్కనుంది. కొరటాల శివ కాంబినేషన్‌లో చిన్న ఎన్టీయార్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ పూర్తి కాగానే, పూరీతో ఎన్టీయార్ సినిమా షురూ అవుతుంది. సో... ఎన్టీయార్ సోదర ద్వయం ఈ ఏడాదంతా బిజీ అన్న మాట! మరి, ఒకేసారి ఇద్దరు హీరోలకు, రెండు స్క్రిప్ట్‌లు చెప్పి, సింగిల్ సిట్టింగ్‌లో ఓకే అనిపించుకున్న పూరీ సంగతి వేరే చెప్పాలా?