రోళ్లు పగిలే రోల్ | jr.ntr newmovie janatha garage shooting special story | Sakshi
Sakshi News home page

రోళ్లు పగిలే రోల్

Published Sat, Apr 16 2016 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

రోళ్లు పగిలే రోల్

రోళ్లు పగిలే రోల్

రోహిణీ కార్తె ఇంకా రాలేదు.. 
కానీ, ఎన్టీఆర్ వచ్చేశాడు... 
వట్టి సన్ కాదు కదా! గ్రాండ్ సన్... 
మంచి వేడి మీద ఉన్నాడు.. 
కాక పుట్టించేస్తాడు...

సమ్మర్ ధమాకా

‘‘సినిమా స్టార్స్‌కేంటి బావా.. ఏసీ గదుల్లో ఉంటారు. పడవలాంటి కారుల్లో తిరుగుతారు. గంట గంటకీ పండ్ల రసాలు తాగుతారు. అడుగులకు మడుగులొత్తే సేవకులు ఉంటారు. మొత్తం మీద సినిమావోళ్ల జీవితం యమా సుఖంగా ఉంటుందనుకో.. ఏదోటి చేసేసి సినిమా స్టార్ అయిపోతే వైభవంగా బతికేయచ్చనుకో.’’

 ‘‘భలే చెప్పావ్ బామ్మర్దీ. అయితే నీకు వాళ్లు పడే కష్టం తెలియనట్లుంది. ఇప్పుడు మనిద్దరం ఇలా చెట్టు నీడన కూర్చుని మాట్లాడుకుంటున్నామా? సినిమా స్టార్స్ ఏం చేస్తున్నారో తెలుసా? ఎర్రటి ఎండలో షూటింగులు చేసేస్తున్నారు.’’

 ‘‘గొప్పేలే... ఇట్టా ఓ సీన్ చేస్తారు.. అట్టా ఎల్లి హాయిగా ‘కార్‌వాన్’లో కూర్చుంటారు. సీన్ సీన్‌కి మధ్యలో గొడుగులు పట్టేవాళ్లూ ఉంటారు.. ముందది తెలుసుకో బావా.’’

 ‘‘ఓరి నా ఎర్రి బామ్మర్దీ. నువ్వు ఓ యాంగిల్‌లోనే చూస్తున్నట్లున్నావ్. ఇంకో యాంగిల్‌లో వాళ్లు పడే కష్టం నీకు తెలియనట్లుంది. చెప్తా తెలుసుకో. ఎన్టీఆర్ ఉన్నాడే.. ‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం ఇప్పుడు ఎర్రటి ఎండలో ఎగాదిగా షూటింగ్ చేసేస్తున్నాడు. హైదరాబాద్ శివార్లలో ఓ పేద్ద క్వారీ ఉంది. చుట్టూ కొండలు, ఇసుక, దుమ్ము, ధూళీ తప్ప ఒక్క చెట్టు కూడా కనబడదు. చెట్టే లేనప్పుడు ఇంక నీడెక్కడ ఉంటుంది? గొడుగు కూడా ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేక తనకు కూడా ఎవరైనా గొడుగు పడితే బావుండుననుకుంటుంది. ఫ్యానూ ఏసీలూ కూడా కూలింగ్ ప్రొడ్యూస్ చేయలేక కకావికలమైపోతున్నాయి. దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎండ ఏ రేంజ్‌లో ఉందో. మామూలుగానే హీట్ ఎక్కువంటే, దానికి తోడు ఈ కొండల రిఫ్లెక్షన్ తోడై త్రిబుల్ హీట్ ఉంది.

అలాంటి చోట ‘జనతా గ్యారేజ్’ షూటింగ్. సమ్మర్ మరీ ఇంతలా బరి తెగిస్తుందని తెలియక, మూడు నెలల ముందే ఇలా షెడ్యూల్ ప్లాన్ చేసేశారు. ఏ మాత్రం మార్చలేని పరిస్థితి. పోనీ నైట్ షూటింగ్ చేద్దామంటే, సెక్యూర్టీ ప్రాబ్లమ్స్. చచ్చినట్టు ఈ ఎండలో షూటింగ్ చేయాల్సిందే. పోనీ.. ఇలా సీన్ చేసేసి అలా కార్‌వాన్‌లోకి దూరిపోదామంటే.. అది కంటికి కనిపించనంత దూరంలో ఉంది. షూటింగ్ లొకేషన్ దగ్గరే దాన్ని పెడదామంటే కుదరదట. అందుకే చిన్న టెంటు ఏర్పాటు చేశారు. సూరీడు భగభగల ముందు ఆ టెంటు ఎంత? ఇంకో విషయం చెప్పనా? అసలా క్వారీకి వెళ్లే రోడ్డు ఉందే.. అది చాలా దారుణం. ఎంత పడవలాంటి కారుకి అయినా కుదుపులు తప్పవు. ఒళ్లు హూనం అయిపోవాల్సిందే. ఒక్కసారి వెళ్లినవాళ్లు ఇంకోసారి వెళ్లకూడదనుకుంటారు. అలాంటిది ఏకంగా ఐదు రోజులు ఆ క్వారీలోనే షూటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పు.. సినిమావోళ్లకి సుఖం, కష్టం సమానంగా ఉంటాయా? కాదా?’’

 ‘‘కరెక్టే బావా.. పైకి సుఖాలే కనిపిస్తాయి కానీ, ఇలాంటి కష్టాలు మాలాంటోళ్లకి తెలీవు కదా. అది సరే.. ఇప్పుడు క్వారీలో ఏ సీన్స్ తీస్తున్నారో తెలిస్తే కొంచెం చెప్పరాదేంటి..?’’

 ‘‘చెప్తా.. చెప్తా... ఓ గంట గంటన్నర సినిమా చూశాక మనం సమోసాలు తినడానికి వెళ్లే ముందు ఒక్కసారిగా ఏదో కుదుపులాంటి సీన్‌ని తెరపై వదులుతారే.. దాన్ని ఇంటర్వెల్ అంటారు కదా.. ఇప్పుడు దానికి సంబంధించిన సీన్లే తీస్తున్నారు. చూసే కొద్దీ చూడబుద్ధేసేలా ఉంది షూటింగ్. ఎన్టీఆర్ రెచ్చిపోయి యాక్ట్ చేసేస్తున్నాడు. ఎవరో మలయాళ నటుడంట. ఉన్ని ముకుందన్ అతను కూడా ఉన్నాడు. ఇంకా రెండు వందల మంది దాకా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలతో మనలాంటి మాస్‌గాళ్లకు విందు భోజనం పెట్టిన డెరైక్టర్ కొరటాల శివ ఈ సీన్లు భలే బ్రహ్మాండంగా తీస్తున్నాడు. కానీ, చాలా బాధగా ఉంది బామ్మర్దీ.’’

 ‘‘బాధా... ఎందుకు బావా?.. అదే ఐదు రోజులూ ఈ షూటింగ్ చూడాలనుకున్నా. కానీ, ఒక్కరోజుకే ఎండలో నావల్ల కాలేదు. ఇక నాలుగు రోజులు అక్కడికెళ్లాలంటే కష్టమే. అవును బావా... ఎండలు మామూలుగా లేవు. అయినా చల్లబడ్డాక తీసుకోవచ్చు కదా. ఇంకో రెండు నెలలాగితే సూరీడు ఎలాగూ శాంతిస్తాడుగా..’’

 ‘‘నా బుర్ర తక్కువ బామ్మర్దీ.. ఆగస్ట్ 12న సినిమాని రిలీజ్ చేసేస్తామని చెప్పేశారు కదా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే షూటింగ్ చేయాల్సిందే. సినిమావోళ్లకి ఎండా, వానా, చలి లెక్కుండదు. రాత్రీ పగలూ కూడా ఉండదు. చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేసేయాలి. అందుకే ఏవీ పట్టించుకోకుండా షూటింగ్‌లు చేసేస్తారు. అంత కష్టపడతారు కాబట్టే కోట్లు సంపాదిస్తారు.’’

‘‘ఇన్ని విషయాలు చెప్పావు కదా బావా.. ఇంతకీ ఎన్టీఆర్ ఎన్ని కోట్లు తీసుకుంటాడంటావ్..’’
‘‘ఆ సంగతి చెబ్తే నీడలో ఉన్న నువ్వు వడదెబ్బ తగిలినట్లు పడిపోతావ్... ఇక పోదాం పద...’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement