ఆ కథకే గ్రీన్ సిగ్నల్?
ఎన్టీఆర్ కొత్త సినిమా కబురు ఎప్పుడు చెబుతారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులు అరవై రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అరవై ఏంటనుకుంటున్నారా? ఎన్టీఆర్ ఇటీవల నటించిన ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబర్ 1న విడుదలైంది. అంటే.. అప్పుడే అరవై రోజులు దాటింది. దాంతో ఈ హీరోగారు చేయబోయే తదుపరి సినిమా ఏంటి? అనే చర్చ జరుగుతోంది.
అగ్ర దర్శకులు పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల నుంచి యువ దర్శకులు ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి, ‘ప్రేమమ్’తో హిట్ అందుకున్న చందూ మొండేటిల వరకూ పలువురి పేర్లు ఎన్టీఆర్‌తో సినిమా చేయబోయే దర్శకుల జాబితాలో వినిపించాయి. మొత్తానికి ప్రచారంలో చాలా కాంబినేషన్‌లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లలో సెట్స్‌పై వెళ్లేది ఏది? సైడ్ రూట్‌లోకి వెళ్లేది ఏది?
ప్రశ్నలు ఎన్నో...
ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ రెండు నెలల్లో ఈ యంగ్ హీరో పలు కథలు విన్నారు. అందులో ఎన్టీఆర్‌కి నచ్చినవి కొన్ని ఉన్నాయట. కానీ, ప్రస్తుతం సెట్స్‌పైకి వెళ్లేది మాత్రం అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌కు ‘పటాస్’ వంటి కమర్షియల్ హిట్ అందించిన అనిల్ రావిపూడి కథేనట. ఓ వారం రోజులుగా ఈ కథపైనే ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడిలు డిస్కషన్స్ చేస్తున్నారట. ‘దిల్’ రాజు ఈ సినిమా నిర్మిస్తారని టాక్. ఇందులో అంధుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది.
కమర్షియల్ హంగులతో కూడిన వైవిధ్యమైన సినిమాగా తెరకెక్కించనున్నారట. ఇదిలా ఉంటే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అదుర్స్-2’ చేయనున్నారనీ... ఎన్టీఆర్ ఖాళీగా ఉన్న ప్రతిసారీ ఈ రెండు వార్తలూ వినిపిస్తుంటాయి. ఇవి పక్కన పెడితే.. దర్శకుడు చందూ మొండేటి చెప్పిన లైన్ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి.. వినాయక్, త్రివిక్రమ్‌లతో ఎప్పుడు? చందూ సినిమా ఎప్పుడు? అనేది వేచి చూడాలి.