హాలీవుడ్‌లో వందడుగుల ప్రయాణం
జూహీ చావ్లా పేరు చెప్పగానే... ఖయామత్ సే ఖయామత్, ప్రతిబంధ్, డర్, ప్రేమలోకం, విక్కీదాదాలాంటి సినిమాలన్నీ గుర్తుకొస్తాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళం, పంజాబీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన జూహి చావ్లా ప్రస్తుతం ఓ హాలీవుడ్‌లో చిత్రంలో ఓంపురి భార్యగా నటిస్తున్నారు. గతంలో ఓమ్‌పురి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. జూహీకి మాత్రం ఇదే తొలిచిత్రం కావడం విశేషం. ‘ది హండ్రెడ్ ఫుట్ జర్నీ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘జురాసిక్ పార్క్’ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రిచర్డ్ సి మారిస్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు లాస్సె హాల్‌స్టామ్ తెరకెక్కిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని ఓ గ్రామంలో స్థిరపడటం కోసం ఓ ఇండియన్ ఫ్యామిలీ ఎలాంటి ప్రయత్నం చేసిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన భార్యాభర్తలుగా ఓమ్‌పురి, జూహి నటిస్తున్నారు. ఫ్రాన్స్‌లో రెస్టారెంట్ నిర్వహించే వీరికి ఫ్రెంచ్ రెస్టారెంట్ నిర్వహించే మరో కుటుంబానికీ జరిగే ఘర్షణ, పోటీయే ఈ చిత్రం ప్రధానాంశం. ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన పాత్రల్లో ఓ పాత్రను మేడమ్ మల్లొరి పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.