నాచియార్ సినిమాలో జ్యోతిక
తమిళసినిమా: రీఎంట్రీలోనూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి జ్యోతిక. ఇంతకుముందు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల నుంచి అజిత్, విజయ్, సూర్య,శింబు వరకూ జతకట్టి కథానాయకిగా రాణించిన ఈ నటి, నటుడు సూర్యను ప్రేమ వివాహం చేసుకుని నటనకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సంసార జీవితంలో సెటిల్ అవుతారనుకున్న వారికి షాక్ ఇచ్చే విధంగా ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత 36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్ర విజయానందంతో వరుసగా నటించడం మొదలెట్టిన జ్యోతిక ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుని నటిస్తున్నారు. అలా నటించిన తాజా చిత్రం నాచియార్ మంచి సక్సెస్‌నే అందుకుంది.
రీఎంట్రీ తరువాత జ్యోతిక బయట చిత్ర నిర్మాణ సంస్థలో నటించిన తొలి చిత్రం ఇదే. అదేవిధంగా తాజాగా మణిరత్నం దర్శకత్వంలో సెక్క సెవంద వానం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మల్టీస్టారర్ చిత్ర. అంతే కాదు తమిళం, తెలుగు, మలయాళం అంటూ బహుభాషా చిత్రం కూడా. మణిరత్నం తన మద్రాస్ టాకీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో నటుడు అరవిందస్వామి రాజకీయనాయకుడిగానూ, శింబు ఇంజినీర్‌గా, విజయ్‌సేతుపతి పోలీస్‌ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు.
ఇక జ్యోతిక పురుషాధిక్యతను వ్యతిరేకించే ఒక శక్తి వంతమైన స్త్రీ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి ఈమె నట విశ్వరూపన్ని చూడవచ్చు అనేది కోలీవుడ్ వర్గాల టాక్. మరో ముఖ్య పాత్రలో నటి ఐశ్యర్యరాజేశ్ నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, మణిరత్నం ఆస్థాన సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలను కడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెక్క సెవంద వానం చిత్రం ఈ ఏడాదిలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం తరువాత మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment