ఐటం సాంగ్స్ కు సిద్ధమవుతున్న మరో హీరోయిన్!
ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకోవటానికి సినిమాల్లో ఐటం సాంగ్స్ తో ప్రయోగాలు చేస్తుంటారు. సినిమాల్లో ఐటం సాంగ్ కు ఉన్న ప్రత్యేకతను విడమరిచి చెప్పక్కర్లేకపోయినా.. దానికున్న క్రేజ్ మాత్రం తక్కువేం కాదు. సినిమాలు హిట్-ప్లాప్ లతో సంబంధం లేకుండా ఐటం సాంగ్స్ అత్యధికంగా జనాల నోటిలో నానుతూనే ఉండటం మనం తరుచు చూస్తూ ఉంటాం. ఆ పాటల గత చరిత్రను చూస్తే అందుకోసం ప్రత్యేకంగా కొంతమంది మాత్రమే అందుబాటులో ఉండేవారు. గతాన్ని వదిలి వర్తమానానికి వస్తే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సినీ రంగంలో టాప్ హీరోయిన్స్ గా పేరు అందుకున్న వారు కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆ బాటలో పయనించగా.. మరో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఆ మార్గాన్నే అన్వేషించుకునే పనిలో పడ్డారు.
ఎప్పుడో 2004 లో క్యూ హో గయానా చిత్రంలో హీరోయిన్ కు స్నేహితురాలి పాత్రతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..2007 లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. అనంతరం ఆమె ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. అదే సంవత్సరం కృష్ణ వంశీ తెరకెక్కించిన 'చందమామ' చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో చక్కగా ఇమిడిపోయి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ కు తిరుగులేకుండా పోయింది.అలా ఏడు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో హీరోయిన్ గా అలరించిన కాజల్ కు ఈ మధ్య పెద్దగా అవకాశం రావడం లేదు. దీంతో ఆమె సరికొత్త అన్వేషణలో పడింది. ఐటం సాంగ్స్ చేయడానికి సిద్ధమవుతోంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంజలి హీరోయిన్ గా తెరకెక్కుతున్న గీతాంజలి చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి ఒక ఆఫర్ కూడా వచ్చిందట. అందులో భాగంగా కలిసిన చిత్ర నిర్మాతలకు కాజల్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పాటకు భారీ పారితోషకాన్ని కాజల్ ఆఫర్ చేయడంతో వారు వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది.
గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఇదే మార్గంలో పయనించి ఆకట్టుకునే యత్నం చేశారు. ఇప్పటికే ఐటం సాంగ్స్ చేసిన హీరోయిన్లలో ఛార్మి, ప్రియమణిలో ముందు వరుసలోఉన్నారు. తాజాగా శృతిహాసన్ కూడా 'ఆగడు' చిత్రంలో ఐటం సాంగ్ ను చేయడానికి సిద్ధమైంది. ఇక తాను ఏమీ తక్కువ తినలేదకున్న కాజల్.. ఆ తరహా సాంగ్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని యత్నాలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం.