అలా అనుకుంటే పొరపాటు!
‘‘కడుపు మాడ్చుకుని, నోటికి రుచించని పదార్ధాలను బలవంతంగా తినడం, గంటల తరబడి వ్యాయామం చేయడం.. ఇలాంటి ప్రక్రియల వల్ల అందం మరింత ఇనుమడిస్తుంది అనుకుంటే... పొరపాటు’’ అంటున్నారు అందాల భామ కాజల్ అగర్వాల్. ‘‘మీ గ్లామర్ రహస్యమేంటి?’’ అని ఇటీవల ఈ ముద్దుగుమ్మను అడిగితే... తన అందం వెనకున్న చిట్కాను చెబుతూ, ఆరోగ్యం విషయంలో కొన్ని ఆసక్తికమైన విషయాలు చెప్పారామె. ‘‘ఫలానా ఫుడ్ తీసుకుంటే... ఇందులో ఇన్ని కేలరీలు ఉంటాయి.
ఇన్ని గంటలు వ్యాయామం చేస్తే కానీ వాటిని కరిగించుకోలేం... ఇలాంటి మాటలు నాకు అస్సలు నచ్చవ్. నా వరకూ నాకు నచ్చిన పదార్థాలను కడుపునిండా లాగించేస్తాను. పైగా రోజుకి 8 గంటలు నిద్ర పోతాను. ఇంట్లో నిద్ర పోవడం కుదరకపోతే... లొకేషన్లో కేరవాన్‌లోకెళ్లి అయినా సరే... సమయం దొరికినప్పుడల్లా కునుకు తీస్తుంటాను. కానీ... ఇప్పటివరకూ నేను బరువు పెరగలేదు. దానికి కారణం క్రమం తప్పని వ్యాయామం. నా అందానికి కారణం ఏంటని అడిగితే... నేను చెప్పే సమాధానం ఒక్కటే. రుచికరమైన ఆహారాన్ని కడుపునిండా లాగించడం... ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవడం... క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ఇలా చేసి చూడండి, మీ అందం అంతకంత పెరగకపోతే అప్పుడు అడగండి’’ అంటూ కాజల్ చిన్న సైజ్ ఉపన్యాసం ఇచ్చారు.