
సినిమావాళ్ళను చేసుకోను!
తొమ్మిదేళ్ల క్రితం ‘లక్ష్మీకల్యాణం’ మొదలు ‘చందమామ’, ‘మగధీర’లతో అభిమానులకు స్వీట్ స్ట్రోక్ ఇచ్చిన కాజల్‌కి పెళ్లంటే... ఫ్యాన్స్‌కు హార్ట్ స్ట్రోక్ రావడం ఖాయం. ఆ విషయమే కాజల్‌ను అడిగితే- ‘‘అప్పుడే కాదులెండి...అంత తొందరెందుకు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చేశారు. కాజల్ లాంటి అందాల రాశి ‘ఐ లవ్ యూ’ అంటే కాదనేవారు ఉంటారా? ‘‘మూడేళ్ల నుంచి నేను సింగిల్. మళ్లీ నా మనసుకు ఇష్టమైన వ్యక్తి కనబడినప్పుడు మాత్రం అతనితో ప్రేమలో మునిగిపోతాను.
ఆ టైమ్‌లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. మీరనుకుంటున్నట్టు నేను ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినీ మాత్రం పెళ్లి చేసుకోను. భార్యభర్తలిద్దరిదీ వేర్వేరు వృత్తులైతే వారి మధ్య అనుబంధం మరింత బలంగా ఉంటుంది’’ అని పెళ్ళి గురించి, ఎదురుచూస్తున్న వరుడి గురించి చెప్పుకొచ్చారు కాజల్. రీల్ లైఫ్‌లో కాజల్ రొమాంటిక్ లుక్స్‌తో అభిమానులను హృదయాలను హీటెక్కించేస్తారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ‘‘నేను అంత రొమాంటిక్ కాదు. నేను సినిమాల్లో హీరోలతో రొమాన్స్ చేయను. నాకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి.
ఇక, నిజజీవితంలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి అతనికి ‘ఐ లవ్ యూ’ చెబుతూ కూర్చోలేను. అలాగని ఏదో స్ట్రిక్ట్‌గా కూడా ఉండను. ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉంటే మనం ఎలా ఉన్నా సరే ఎదుటివారు అర్థం చేసుకుంటారు’’ అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఈ సంగతలా పక్కన ఉంచితే, ‘మూడేళ్ల నుంచి సింగిల్’ అని కదా చెప్పారు కాజల్... మరి అంతకు ముందు ఎవరితో కాజల్ స్నేహం చేశారంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.