మేము సిద్ధమే అంటున్న హీరోయిన్స్‌ | sakshi special story about heroin challenging roles | Sakshi
Sakshi News home page

సవాల్‌కి సై

Published Mon, Sep 14 2020 4:56 AM | Last Updated on Mon, Sep 14 2020 8:58 AM

sakshi special story about heroin challenging roles - Sakshi

కథానాయికలంటే గ్లామర్‌కి మాత్రమే.. పాటల్లో కలర్‌ఫుల్‌గా కనిపించడానికే... సినిమాల్లో నాయికలకు సీన్లు ఉన్నా కథలో పెద్దంత సీన్‌ ఉండదు. అందుకే... కథతో పాటుగా ప్రయాణించే పాత్రలు ఇవ్వండి.  ఛాలెంజింగ్‌ పాత్రలు రాయండి.. చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే అంటున్నారు కథానాయికలు. ఛాలెంజింగ్‌ పాత్రలు ఎంచుకుంటున్నారు. ఆ పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ల స్టోరీ ఏంటో చూద్దాం.

కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటివరకూ చాలా రకాల పాత్రలు చేశారు. కానీ తొలిసారి వయసుకు మించిన పాత్రను చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్‌ 80 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళరిపయట్టు అనే మార్షల్‌ ఆర్ట్‌ కూడా నేర్చుకున్నారు. కాజల్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా పాల్గొంటారని సమాచారం. అంటే.. యంగ్‌ ఏజ్, ఓల్డేజ్‌ ఏజ్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు.

క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం పల్లెటూరి అమ్మాయిగా మారిపోయారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ సినిమాలో రకుల్‌ పాత్ర డీ గ్లామరైజ్డ్‌గా ఉంటుంది కూడా. అంటే మేకప్‌ లేకుండా కనిపించనున్నారు. ఈ సినిమాలో రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక శ్రియను మనందరం ఇప్పటి వరకూ అన్నీ పాజిటివ్‌ పాత్రల్లోనే చూశాం. తనలోని విలన్‌ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నెగటివ్‌ యాంగిల్‌ను చూపించడానికి రెడీ అవుతున్నారు. హిందీ చిత్రం ‘అంధాధూన్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతోంది. ఇందులో నితిన్‌ హీరో.

ఈ సినిమాలో విలన్‌ పాత్రలో శ్రియ నటించనున్నారని టాక్‌. ‘సీటీ మార్‌’ చిత్రం కోసం కబడ్డీ కోచ్‌గా మారారు తమన్నా. కోచ్‌ ఎలా ఉండాలి? ఫిట్‌నెస్, బాడీ లాంగ్వేజ్‌ వంటి విషయాల మీద శ్రద్ధ పెట్టి ఈ పాత్ర చేస్తున్నారు తమన్నా. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్‌ హీరో. ‘మూకుత్తి అమ్మన్‌’ అనే తమిళ చిత్రంలో అమ్మవారిగా కనిపించనున్నారు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార. ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు నియమ నిష్టలతో ఉన్నారట. మాంసాహారం ముట్టుకోలేదు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. పరుగుల రాణిగా మారబోతున్నారు తాప్సీ.

‘రాకెట్‌ రష్మి’ అనే చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారామె. త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. ఈ పాత్ర కోసం డైట్‌ మార్చేశారు. వ్యాయామాలు చేస్తూ, రన్నింగ్‌ మీద దృష్టి పెట్టారు. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా గ్రామీణ యువతిగా కనిపిస్తారట. అలానే చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఆల్రెడీ చిత్తూరు యాసను ప్రాక్టీస్‌ చేయడంతోపాటు గ్రామీణ యువతి హావభావాలను నేర్చుకుంటున్నారట. సమంత ఇటీవలే ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటించడానికి అంగీకరించారట.

ఈ సినిమాలో ఆమె మూగ మరియు చెవిటి అమ్మాయిగా కనిపించనున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ అని టాక్‌. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’లో ఆయనకు జోడీగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పూజా హెగ్డే. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర చేస్తున్నారు కంగనా రనౌత్‌. ‘తలైవి’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇలా కొత్త పాత్రలు విసురుతున్న సవాల్‌ను స్వీకరించి శారీరకంగా లేదా మానసిక శ్రమను ఇష్టంగా తీసుకుంటున్నారు నాయికలు. ఇలాంటి చాన్స్‌లు అరుదుగా వస్తాయి కాబట్టి నిరూపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. శభాష్‌ అనిపించుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement