ఒకటీ.. రెండు.. మూడు... ఐదు వరకూ లెక్కపెట్టాల్సిందే. ఎందుకంటే అందాల తారలు వరుసగా ఐదు సినిమాల్లో కనిపించనున్నారు. ప్లాన్ చేసినట్లుగా సినిమాలు విడుదలయ్యుంటే.. లెక్క ఐదు వరకూ వచ్చేది కాదు. వాయిదా పడిన సినిమాలు విడుదలయ్యే నాటికి చేతిలో ఉన్న సినిమాలు రెడీ అవుతాయి. అలా ఇప్పటికే పూర్తి చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలతో కలిపి కొందరి నాయికల డైరీలో ఐదు సినిమాలు కచ్చితంగా ఉన్నాయి. ఆ ‘పాంచ్ పటాకా’ సినిమాల గురించి తెలుసుకుందాం.
క్రేజీ బుట్ట బొమ్మ
బుట్టబొమ్మ పూజాహెగ్డే జోరు మామూలుగా లేదు. ఉత్తరాదిలోనైనా, దక్షిణాదిలోనైనా పూజ క్రేజ్ వేరు. ఈ క్రేజే ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన పూజ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తయ్యాయి. ఇక నిర్మాణంలో ఉన్న చిత్రాల విషయానికొస్తే.. ఇటీవల తమిళ హీరో విజయ్ సరసన ఓ సినిమా కమిట్ అయ్యారు పూజ. అటు హిందీలో రణ్‌వీర్ సింగ్ చేస్తున్న ‘సర్కస్’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న పూజ.. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’ సినిమాలోనూ హీరోయిన్‌గా కమిట్ అయ్యారు. థియేటర్స్ ఓపెన్ అయితే.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, సర్కస్.. ఇలా వరుసగా వెండితెరపై ప్రేక్షకులకు దర్శనం ఇస్తారు పూజ.
కాజల్ తగ్గేదే లే !
ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. కెరీర్‌లో యాభై చిత్రాల మైలురాయిని చేరుకున్నారు. అయినా సరే.. కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమెకు వస్తున్న అవకాశాలే ఇందుకు నిదర్శనం. తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా (ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో..), తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో సినిమా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’ (ఒక హీరోయిన్‌గా.. మరో హీరోయిన్ అదితీరావ్ హైదరీ) చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తున్నారు కాజల్.
అలాగే కమల్‌హాసన్‌తో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేయాల్సిన ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్ (హిందీ ‘క్వీన్’కు తమిళ రీమేక్) విడుదల కావాల్సి ఉంది. మిగతా హీరోయిన్లకు హిందీతో కలిపి ఐదు ప్రాజెక్ట్స్ అయితే కాజల్ మాత్రం సౌత్‌లోనే ఐదు సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇటు వెబ్ సిరీస్‌లు (కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ ఇటీవల విడుదలైంది) కూడా చేస్తూ ‘తగ్గేదే లే’ అంటున్నారు కాజల్.
తాప్సీ దూకుడు
బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయారు తాప్సీ. గడచిన మూడేళ్ళుగా తాప్సీ ఏడాదికి నాలుగు సినిమాలకు సైన్ చేస్తున్నారు. అంతే వేగంగా ఆ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే దూకుడును చూపించారు. ‘హసీన్ దిల్‌రుబా’, ‘రష్మీ: ది రాకెట్’, ‘లూప్ లపేటా’ (జర్మన్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కు హిందీ రీమేక్) ‘దో బార’ సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసి, విడుదలకు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ‘శభాష్ మీతూ’ (క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్), సౌత్‌లో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నారు తాప్సీ. ‘హసీన్ దిల్‌రుబా’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మిగతా చిత్రాలు థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశమే ఉంది.
తమన్నా హవా
మిల్కీ బ్యూటీ తమన్నా తన డైరీని ఖాళీగా ఉంచేందుకు ఇష్టపడటం లేదు. వెంకటేష్ – వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, సత్యదేవ్ ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రాల్లో తమన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు. నితిన్ ‘మ్యాస్ట్రో’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తమన్నా హీరోయిన్‌గా నటించిన ‘సీటీమార్’ సినిమా ఈ ఏడాది ఈపాటికే విడుదల కావాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించారు.
ఇక బాలీవుడ్‌లో తమన్నా నటించిన ‘భోలే చూడియాన్’ చిత్రీకరణ పూర్తయింది. హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు తమన్నా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ విడుదల కాలేదు. ఇంకో విశేషం ఏంటంటే... ‘సీటీమార్’ (ఏప్రిల్ 2), ‘మ్యాస్రో’్ట (జూన్ 11), ‘ఎఫ్ 3’ (ఆగస్టు 27).. ఈ ఏడాది విడుదల కావాల్సిన చిత్రాలు. కానీ కరోనా వల్ల కాలేదు. వచ్చే ఏడాది తెలుగు తెరపై తమన్నా హవా తప్పక కనిపిస్తుందని అర్థం అవుతోంది.
రాకెట్ వేగంతో రష్మిక
దక్షిణాది అగ్రకథానాయికల్లో రష్మికా మందన్నా పేరు కూడా ఉంది. ఇదే సీన్‌ను ఉత్తరాదిలోనూ రిపీట్ చేయాలనే ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ హిందీలో ఏకంగా మూడు చిత్రాలు చేజిక్కించుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో ‘గుడ్ బై’ చిత్రాలు చేస్తున్నారు రష్మిక. అలాగే మరో హిందీ సినిమా కూడా సైన్ చేశానని, త్వరలో ఆ వివరాలు చెబుతానని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ చాట్ సెషన్‌లో రష్మికా మందన్నా వెల్లడించారు.
ఈ మూడు ప్రాజెక్ట్స్ కాకుండా తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో ఈ రెండు చిత్రాలే కాకుండా మరో చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు కూడా రష్మికా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇలా దక్షిణ, ఉత్తరాదిలో రాకెట్ వేగంతో కెరీర్‌లో దూసుకెళ్తున్నారు రష్మికా మందన్నా.
రకుల్.. డైరీ ఫుల్
సౌత్‌లో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసిన రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే జాన్ అబ్రహాం ‘ఎటాక్’ అజయ్ దేవగణ్ ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తున్న రకుల్ తాజాగా తేజస్ డియోస్కర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇందులో కండోమ్ టెస్టర్‌గా రకుల్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. హిందీలో ఈ నాలుగు చిత్రాలతో పాటు తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా (ఇందులో వైష్ణవ్‌తేజ్ హీరో), తమిళంలో శివ కార్తికేయన్ ‘ఆయలాన్’ చిత్రాల్లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా కనిపిస్తారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో రకుల్ డైరీ ఫుల్.
డిఫరెంట్ కృతీ
మహేశ్‌బాబు ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతీ సనన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు కృతీ హవా బాలీవుడ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఇట్స్ మై టైమ్’ అంటు కృతీ ప్రస్తుతం ఐదు చిత్రాలకు సైన్ చేశారు. ప్రభాస్ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’, వరుణ్ ధావన్ హారర్ ఫిల్మ్ ‘బేడియా’, అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బచ్చన్ పాండే చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు కృతీ సనన్.
ఈ చిత్రా లే కాకుండా... రాజ్‌కుమార్ రావ్‌తో ‘హమ్ దో హమారే దో’, టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఫిల్మ్ ‘గణ్‌పత్’ చిత్రాల్లో కృతీసననే హీరోయిన్. మరోవైపు కృతీ నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మిమి’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. మైథాలజీ, యాక్షన్, రొమాన్స్, హారర్.. ఇలా ఒకేసారి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేసే అవకాశం రావడం అంటే గొప్ప విషయం. ఈ అవకాశాలను ఛాలెంజ్‌గా తీసుకుని, నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు కృతీ సనన్.
ట్రిపుల్ రోల్ దీపికా
హెడ్డింగ్ చదివి, ఫోటో చూసి దీపికా పదుకోన్ మూడు పాత్రలతో ఓ సినిమా వస్తుందనుకుంటే పొరపాటే. ఇంతకీ విషయం ఏంటంటే... అతిథిగా, నిర్మాతగా, హీరోయిన్‌గా దీపికా పదుకోన్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న చిత్రం, షారుక్ ఖాన్ ‘పఠాన్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’, దర్శకుడు శకున్ బాత్రా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపిస్తారు దీపిక.
ఇక తన భర్త, నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘83, సర్కస్’ చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. క్రికెట్‌లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్పు సాధించిన 1983 సంఘటనల ఆధారంగా రూపొందిన ‘83’ చిత్రానికి దీపిక ఓ నిర్మాత. అలాగే దీపక నిర్మాతగా మహాభారతంలోని ద్రౌపది పాత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుందని, ఇందులో ద్రౌపదిగా దీపికానే కనిపిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment