మంచి సినిమా చేశామనే అనుభూతి కలిగింది | Kalyan Ram Speech At Entha Manchivaadavuraa Thanks Meet | Sakshi
Sakshi News home page

మంచి సినిమా చేశామనే అనుభూతి కలిగింది

Published Fri, Jan 17 2020 12:08 AM | Last Updated on Fri, Jan 17 2020 12:08 AM

Kalyan Ram Speech At Entha Manchivaadavuraa Thanks Meet - Sakshi

నరేశ్, శివలెంక కృష్ణప్రసాద్, కల్యాణ్‌రామ్, సతీష్‌ వేగేశ్న, తనికెళ్ల భరణి

కల్యాణ్‌రామ్‌ హీరోగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహరీన్‌ కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాస్‌ గుప్తా నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ–‘‘ఇతరుల బాధలు తనవి అనుకుని వారితో అనుబంధాన్ని పంచుకునే పాత్రలో నటించాను.

ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా చేశాననే అనుభూతి కలుగుతోంది. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రంలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. నేను మర్చిపోలేని చిత్రాన్ని ఇచ్చారు సతీష్‌. ఈ చిత్రంలో నా నటన, డైలాగ్‌ డెలివరీ, స్టైల్‌ బాగున్నాయని మా కుటుంబ సభ్యులు మెచ్చుకున్నారు. ఇప్పటివరకు నా కెరీర్‌లో ఇదే ఉత్తమ చిత్రమని ప్రశంసించారు’’ అని అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో ఓ మంచి సినిమా తీస్తానని నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్‌. కుటుంబ ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది.

ఈ సినిమా ఫలితం కోసం నిద్రపోకుండా ఎదురు చూశాం.మొదట్లో ఫెయిల్‌ అన్నారు. ఆ తర్వాత పాస్‌ అయ్యామని చెప్పారు. ఫస్ట్‌ షో తర్వాత సెకండ్‌ క్లాస్‌లో పాసయ్యామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కల్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది’’ అని అన్నారు సతీష్‌ వేగేశ్న. ‘‘ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా తీశాం. మా నమ్మకం నిజమైంది. మౌత్‌టాక్‌తో వసూళ్లు పెరుగుతున్నాయి. చక్కటి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్‌. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నరేష్, తనికెళ్లభరణి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement