Entha Manchivaadavuraa Movie
-
మంచి సినిమా చేశామనే అనుభూతి కలిగింది
కల్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహరీన్ కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాస్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ–‘‘ఇతరుల బాధలు తనవి అనుకుని వారితో అనుబంధాన్ని పంచుకునే పాత్రలో నటించాను. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా చేశాననే అనుభూతి కలుగుతోంది. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రంలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. నేను మర్చిపోలేని చిత్రాన్ని ఇచ్చారు సతీష్. ఈ చిత్రంలో నా నటన, డైలాగ్ డెలివరీ, స్టైల్ బాగున్నాయని మా కుటుంబ సభ్యులు మెచ్చుకున్నారు. ఇప్పటివరకు నా కెరీర్లో ఇదే ఉత్తమ చిత్రమని ప్రశంసించారు’’ అని అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో ఓ మంచి సినిమా తీస్తానని నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్. కుటుంబ ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా ఫలితం కోసం నిద్రపోకుండా ఎదురు చూశాం.మొదట్లో ఫెయిల్ అన్నారు. ఆ తర్వాత పాస్ అయ్యామని చెప్పారు. ఫస్ట్ షో తర్వాత సెకండ్ క్లాస్‌లో పాసయ్యామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కల్యాణ్‌రామ్‌గారి కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది’’ అని అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా తీశాం. మా నమ్మకం నిజమైంది. మౌత్‌టాక్‌తో వసూళ్లు పెరుగుతున్నాయి. చక్కటి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ఈ కార్యక్రమంలో సీనియర్ నరేష్, తనికెళ్లభరణి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ
టైటిల్: ఎంత మంచివాడవురా! జానర్: లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: కళ్యాణ్ రామ్, మెహరీన్, ప్రవీణ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, విజయ్‌కుమార్, నరేశ్, సుదర్శన్ వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల సంగీతం: గోపీ సుందర్ దర్శకత్వం: సతీష్ వేగేశ్న నిర్మాతలు: ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నందమూరి కళ్యాణ్‌రామ్-మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. ‘శతమానం భవతి’తో నేషనల్ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే, నా నువ్వే, 118 లాంటి వరుస పరాజయాలతో వెనకపడ్డ ఈ నందమూరి హీరో ఈ చిత్రంతో హిట్ కొట్టాలని భావిస్తుండగా.. ‘శతమానం భవతి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో అదే ఫీల్‌ను కంటిన్యూ చేయలేకపోయారు సతీష్. దీంతో హీరోగా కళ్యాణ్ రామ్‌కు.. దర్శకుడిగా సతీష్ వెగేశ్నకు ఈ చిత్రం ఎంతో ప్రెస్టేజ్‌గా మారింది. ఇక సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎంత మంచివాడవురా!’ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంది? కళ్యాణ్‌రామ్ విషయంలో ఎన్టీఆర్ కన్న కల ఎంత మేర విజయం సాధించింది? సంక్రాంతి బరిలోకి దిగిన నందమూరి ఇంటి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో’ చిత్రాలకు గట్టి పోటీనిస్తుందా? అనేది సినిమా సమీక్షలో చూద్దాం. కథ: బాలు(కళ్యాణ్ రామ్)కు బంధాలు, బంధుత్వాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బర్త్‌డే కానుకగా చుట్టాలందిరినీ పిలిచి పండగ టైప్‌లో ఎంజాయ్ చేయాలని తన తండ్రిని బాలు కోరుతాడు. ఎందుకంటే చుట్టాలంటే తనకు ఇష్టమని పేర్కొంటాడు. అయితే సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడుతుంది. ఓ రోడ్డు ప్రమాదంలో బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఈ సమయంలో నా అనుకున్న బంధువులు బాలు చేతిలో జాలిగా ఏమైనా కొనుకొమ్మని డబ్బులు పెడతారే తప్ప చేయందించి తామున్నామనే భరోసా ఇవ్వరు. ఈ తరుణంలో నందిని (మెహరీన్)కి బాలుతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. అయితే బాలు తన స్నేహితుల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడతారు. అయితే ఈ విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఆ కారణం తెలుసుకొని వారికి అసలు విషయం చెప్పి వారి దగ్గర ఓ ప్రపోజల్ పెడతాడు. అక్కడి నుంచి అసలు కథ, ఎమోషన్స్ మొదలవుతాయి. అయితే ఈ కథలోకి మిగతా తారాగణం ఎందుకు ఎంటరవుతుంది? ఇంతకీ ఆచార్య, రిషి, సూర్య, శివ, బాలు అందరూ ఒక్కటేనా లేక వేరువేరా? స్నేహితుల దగ్గర బాలు పెట్టిన ప్రపోజల్ ఏంటి? అది సత్ఫలితాన్ని ఇచ్చిందా? లేక ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అనేదే అసలు సినిమా కథ నటీనటులు: కళ్యాణ్ రామ్ తన పంథా మార్చుకుని చేసిన సినిమా ‘ఎంత మంచివాడవురా!’. కెరీర్ ప్రారంభంలో ఒకే రకమైన చిత్రాలు చేసిన ఈ నందమూరి హీరో ఈ మధ్య కాలంలో విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో కుటుంబ కథానాయకుడిగా పక్కా ఆప్ట్ అయ్యాడు. అన్ని రకాల హావభావాలను ప్రదర్శించాడు. నటన పరంగా కళ్యాణ్ రామ్ అన్ని వేరియేషన్స్ చూపించాడు. కామెడీతో పాటు ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక కళ్యాణ్ రామ్ తర్వాత ఈ సినిమాలో మరొకరి గురించి చెప్పుకోవాలంటే హీరోయిన్ మెహరీన్. సినిమా అద్యంతం కళ్యాణ్ రామ్‌తోనే ఉండే ఈ అందాల బొమ్మకు మంచి సీన్సే పడ్డాయి. అల్లరి, కామెడీ, హీరోపై తనకుండే ప్రేమను ఇలా అన్ని రకాల భావాలను అవలీలగా పండించింది. అంతేకాకుండా హీరో కోసం పరితపించే అమ్మాయిగా ఆకట్టుకుంది. నటిగా ఈ చిత్రంతో మెహరీన్ మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి. చాలా కాలం తర్వాత విలన్‌గా కనిపించిన రాజీవ్ కనకాల తనదైన పెర్మార్మెన్స్ కనబర్చాడు. ఇక మిగతా తారాగణం విషయానికి వస్తే సుహాసిని, శరత్ బాబు, తనికెళ్ల భరిణి, నరేశ్ వీరంతా సీనియర్స్ కావడంతో వారి పాత్రలను చాలా సులువుగా చేసేశారు. వెన్నెల కిశోర్, సుదర్శన్, భద్రం, ప్రవీణ్‌లు తమ కామెడీతో ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ‘నా తండ్రిని విశాలమైన ఇంట్లో ఉంచాను.. ఆయన తిరగడానికి కారును కొనిచ్చా.. అమ్మ లేకపోవడంతో తినడానికి ఇబ్బందులు పడకూడదని వంట మనిషిని పెట్టాను. ఇంతంకంటే ఓ తండ్రిని ఆనందంగా ఉంచడానికి ఏం చేస్తారు’ ప్రస్తుత జనరేషన్లో ఓ సగటు కొడుకు లేక కూతురు అనుకోవడం కామన్. అయితే వాటితో తమ తల్లిదండ్రులు ఆనందపడట్లేదు కేవలం సుఖపడుతున్నారనే విషయాన్ని ఈ చిత్రంతో తెలియజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఆధునిక నాగరికతకు అలవాటు పడుతున్న ప్రస్తుత యువత బంధాలు, బంధుత్వాలతో కూడిన ఎమోషన్స్‌కు కనెక్ట్ కాలేకపోతున్నారు. బిజీ లైఫ్‌లో కాస్త విరామం దొరికితే రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప కొత్త బంధాలను కలుపుకుపోవడానికి యత్నించడం లేదు. ఇలా కొన్ని పాయింట్లతో కథను అల్లుకుని నందమూరి కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ గట్స్‌కు హ్యాట్సాఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే తమ హీరో నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్నే కోరుకుంటారు. ఇలాంటి కుటుంబకథా చిత్రాన్ని ఒప్పుకోరు. అయితే కథ నచ్చడం, కొత్తగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో కళ్యాణ్‌రామ్ కూడా ఈ సినిమాకు సై అన్నారు. ‘శతమానం భవతి, శ్రీనివాస్ కళ్యాణం’ వంటి చిత్రలతో కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా ముద్రపడిపోయారు సతీష్ వేగేశ్న. అయితే ఓ గుజరాతీ చిత్రంకు సంబంధించిన మూల కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు, నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. ఈ సినిమా కథ సగంకు పైగా ఫ్లాష్ బ్యాక్‌లోనే నడుస్తుంది. రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్, హీరోయిన్ వన్‌సైడ్ లవ్, కామెడీ, పాటలు, కోర్టు సీన్స్, ఒకటి రెండు ఫైట్లతో తొలి అర్థభాగం పర్వాలేదనిపిస్తుంది. ‘ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్ సప్లయిర్’ అనే కొత్త కాన్సెప్ట్ అందరినీ ఆలోచించే విధంగా ఉంటుంది. ఇక ఫస్టాఫ్‌లో భాగంగా వేసిన ముడులను రెండో అర్ధభాగంలో ఒక్కొక్కటి విప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అంతేకాకుండా సెకండాఫ్‌ను మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిశోర్ కామెడీ, సుహాసిని, శరత్ బాబుల ఎంట్రీ తర్వాత సినిమా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. కృష్ణవంశీ సినిమా మాదిరి ప్రతీ ఫ్రేమ్‌లో భారీ తారగణంతో సందడిసందడిగా ఉంటుంది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్లు చాలా రొటీన్‌గా ఉంటాయి. అయితే ఒకే ఫీల్‌తో సినిమా అంత సాగడం. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నగా.. పూర్తి కథగా, సినిమాను అందంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ ఎందుకో తడబడ్డట్లు అనిపిస్తుంది. ఇక కళ్యాణ్‌రామ్‌తో తనికెళ్ల భరణి, విజయ్ కుమార్, సుహాసిని, శరత్బాబులతో వచ్చే ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో హీరోయిన్ను హీరో కూల్ చేయడానికి ప్రయత్నించే సమయంలో వచ్చే నాగిని సాంగ్ నవ్వులు తెప్పిస్తుంది. యూట్యూబ్ థంబ్‌నేల్స్ కోసం సుదర్శన్ పడే కష్టాలు హాయిగా ఉంటాయి. సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ ఎంటరయ్యాక తన దైన స్టైల్లో కామెడీ పండించాడు. ‘బంధాన్ని కోరుకునేది మీరు, అనుబంధాన్ని పంచేది మేము, భయం ఒకడు పెడితే రాదు, ధైర్యం ఒకడిస్తే పోదు, ఆడ పిల్లల కోరికలు ఉల్లి పొరలు వంటివి, దేవుడికంటే గొప్పగా స్క్రీన్‌ప్లే గొప్పగా రాయలేరు, ఎమోషన్ అవసరమైన వారికి రిలేషన్ షిప్ ఇస్తాడంట, లైఫ్ పార్ట్నర్ ఇంటి నుంచి రావాలి కాని వదిలేసి కాదు, ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వారి సంతోషం కోసం అబద్దం ఆడిన తప్పులేదు, వాకిట్లో అన్నీ అమ్ముతున్నారు.. రిలేషన్షిప్ కూడానా’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక సాంకేతికత విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మున్నార్, హీరోహీరోయిన్లను చాలా అందంగా చూపించారు. అయితే మ్యూజిక్ చాలా మైనస్ అయింది. గోపీ సుందర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా అనిపించదు. అంతేకాకుండా థియేటర్ నుంచి బయటకి వచ్చాక పాటలు కూడా గుర్తుండవు. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే డైరెక్టర్ తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అయితే ఎమోషన్స్, ఫీల్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే ‘ఎంత మంచి సినిమా!’ అవడం ఖాయం. ప్లస్ పాయింట్స్: కళ్యాణ్ రామ్ నటన సెకండాఫ్‌లో వచ్చే కామెడీ కాన్సెప్ట్ కొత్తగా ఉండటం మాటలు ఎమోషన్ సీన్స్ మైనస్ పాయింట్స్: మ్యూజిక్ సాగదీత సీన్లు క్లైమాక్ - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
ఇమేజ్ కోసం ఆలోచించను
‘‘సంక్రాంతి పండగంటే రైతుల పండగే కాదు.. మా సినిమావాళ్లకు కూడా పండగే. పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూస్తారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు... ► ‘ఎంత మంచివాడవురా..’ అనే పాట తాతయ్య (ఎన్టీఆర్) ‘నమ్మినబంటు’ చిత్రంలోనిది. డైరెక్టర్‌గారు ఈ సినిమాకి తొలుత ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ అనుకున్నారు.. కానీ, ఆయన సినిమాల టైటిల్ తెలుగుదనంతో ఉండటమే కరెక్ట్ అనిపించి, కథను బట్టే ఈ టైటిల్‌ని పెట్టాం. ► వేర్వేరు మనస్తత్వాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడు? వారిని ఎలా మార్చాడు? అనేది కథ. ఇతరులకు ఇవ్వటం అనే పాయింట్‌ను చూపించాం. మనుషులంతా మంచోళ్లే.. వారు చేసే తప్పును తెలియచెప్పాలన్నదే మా సినిమా. ► నేనెప్పుడూ ఇమేజ్ కోసం ఆలోచించలేదు. కథ నచ్చితే సినిమాలు చేస్తూ వచ్చాను. రిపీట్ కథ, క్యారెక్టర్ లేకుండా చూసుకుంటాను. ప్రేక్ష కులకు ఏదైనా కొత్తగా చూపించాలనుకుంటాను. క్యారెక్టర్, కథ కొత్తగా ఉంటే మనం కూడా కొత్తగా ఆలోచిస్తాం. సతీష్‌గారి ‘శతమానం భవతి’ సినిమా చూసిన నా భార్య.. ‘మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను.. మీరెందుకు కమర్షియల్ సినిమాలు చేస్తారు? ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా?’’ అన్నారు.. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అన్నాను.. ‘ఎంత మంచివాడవురా’ తో కుదిరింది. ► మేం ఉమ్మడి కుటుంబం నుండి వచ్చాం. ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్లిపోతుంటే చిన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. మా ఇంట్లో ఎలా ఉంటానో ఈ పాత్రని కూడా అలా చేశాను. నా రియల్ లైఫ్‌గా దగ్గరగా ఉంటుంది. తారక్‌కి నాకు మధ్య మా సినిమాల గురించి చిన్న చర్చ జరుగుతుంటుంది. ఈ సినిమా చేస్తున్నానని చెప్పగానే తను సంతోషపడ్డాడు. పూరి జగన్నాథ్‌గారు, అనిల్ రావిపూడితో పనిచేసినప్పుడు ఎంత కంఫర్ట్ ఫీలయ్యానో సతీష్‌గారితో పని చేసేటప్పుడు కూడా అలాగే ఫీలయ్యాను. -
ఈ నెల నాకు ట్రిపుల్ ధమాకా
‘‘ఎఫ్ 2’ సినిమాలో నేను చేసిన హనీ పాత్ర, ‘హనీ ఈజ్ ది బెస్ట్’ మేనరిజమ్ చాలా పాపులర్ అయ్యాయి. స్వతహాగా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాను’’ అన్నారు మెహరీన్. కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త్త నిర్మించారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు. ► దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ కథ చెప్పగానే అద్భుతం అనిపించింది. అన్ని ఎమోషన్స్‌ను చూపించా ల్సిన పాత్ర. ఇలాంటి రోల్ ఇదివరకెప్పుడూ చేయలేదు. నా పాత్ర పేరు నందు. ఫస్టాఫ్‌లో బబ్లీగా ఉంటుంది. సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటా. నేను షార్ట్ ఫిలింస్ నిర్మి స్తుంటా. నా షార్ట్ ఫిల్మ్‌లో కల్యాణ్ రామ్‌గారు హీరోగా చేస్తారు. ► కేవలం కుటుంబ భావోద్వేగాలు మాత్రమే కాదు ప్రేమ, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. పండగకి వస్తున్న పండలాంటి సినిమా. కథ విని, ఈ పాత్ర నేను చేయగలనా? అని దర్శకుడిని అడిగాను. ‘చేయగలవనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. ► ఇది గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు దర్శకుడు. మాతృక చూస్తే ఆ పాత్ర తాలూకు ప్రభావం నా మీద పడుతుందని చూడలేదు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మూడు పేజీల డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. కష్టపడి నేర్చుకుని సింగిల్ టేక్‌లో పూర్తి చేశాను. ఈ సినిమా టైటిల్ కల్యాణ్‌రామ్‌గారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. నిజాయితీగా ఉంటారు. ► సినిమా హిట్, ఫ్లాప్ మన చేతుల్లో ఉండదు. కథను నమ్మి సినిమా చేయడానికి అంగీకరిస్తాం. మంచి సినిమా అందించాలనుకుంటాం. ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్. ► సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ నాకు అమ్మతో సమానం. ప్రస్తుతానికి బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు. నా తమ్ముడు (గురు ఫతేహ్ ) బాలీవుడ్లో కరణ్ జోహార్ బేనర్ ద్వారా లాంచ్ అవుతున్నాడు. ► ఈ జనవరి నాకు ట్రిపుల్ ధమాకా. ‘ఎంత మంచివాడవురా!’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. తమిళంలో ధనుష్‌తో చేసిన ‘పటాస్’ 16న విడుదలవుతుంది. జనవరి 31న ‘అశ్వథ్థామ’ విడుదలవుతుంది. ► ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేయడం నా బలం. పాత్రకు పూర్తిగా కనెక్ట్ అయి నటించడానికి ప్రయత్నిస్తాను. అందుకే గ్లిజరిన్ కూడా అవసరం లేకుండా ఎమోషనల్ సన్నివేశాలు చేస్తాను. -
ఎంత మంచివాడవురా!
-
యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ట్రైలర్
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతంగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉందని.. చిత్రయూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. బుధవారం రాత్రి విడుదలైన ‘ఎంత మంచివాడవురా!’. ట్రైలర్‌కు ఇప్పటివరకు 19లక్షలకుపైగా వ్యూస్ రెండు మిలియన్స్ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్‌రామ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ట్రైలర్ ‘తాతయ్య దగ్గర శివ, ఊళ్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు’అంటూ మొదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. రిలేషన్షిప్, ఎమోషన్ అనే పాయింట్‌కు మాస్, లవ్, కామెడీని చేర్చి అందమైన చిత్రంగా దర్శకుడు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా సతీష్ వేగేశ్న చిత్రమంటేనే ఆకట్టుకునే డైలాగ్‌లకు కొదువుండదు. ఈ ట్రైలర్లకూడా పలు డైలాగ్‌లు పేలాయి. ‘పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ’, ‘అడిగి ఐలవ్యూ చెప్పించుకోకూడదు’, ‘యస్.. నాకు హీరోలంటే పిచ్చి’, ఎదురించేవాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం’, ‘ఎవరైనా ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా, భయమైనా’అంటూ వచ్చే డైలాగ్‌లు పిచ్చెక్కిస్తున్నాయి. తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. -
‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ వేడుక
-
నా కల నిజమవుతోంది
‘కల్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. కమర్షియల్, థ్రిల్లర్, మాస్ సినిమాలు చేశారు. నాకు ఎప్పటి నుంచో ఓ వెలితి ఉండేది. ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో అన్నని చూడాలని ఉండేది.. అది ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో ఈరోజు వేగేశ్న సతీష్‌గారి ద్వారా నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘శివలెంక కృష్ణప్రసాద్‌గారు మా కుటుంబానికి ఒక నిర్మాత కాదు.. బాబాయ్‌తో (బాలకృష్ణ) ఎన్నో సినిమాలు తీసిన ఆయన మా కుటుంబంలో ఓ సభ్యుడు. అలాంటి కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తగారి నిర్మాణంలో ఓ మంచి సినిమా మీ ముందుకొస్తోంది. గోపీసుందర్‌గారు మంచి సంగీతం అందించారు. ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. మంచి మనసుతో మంచి చిత్రాన్ని ఆదరించేటటువంటి గొప్ప గుణం మీ అందరిలో ఉంది.. మన తెలుగు ప్రేక్షక దేవుళ్లలో ఉంది. మీరందరూ గొప్ప హృదయంతో, గొప్ప మనసుతో వీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సహాయ, సహకారాలు అందజేస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటన్నా. మీరందరూ మంచి ఆనందం, కోలాహలంతో ఉన్నారు.. ఇదే ఆనందం మీ ఇంటి వరకూ వెళ్లి పంచుకోండి.. ఇక్కడున్న మీ అందరి ప్రాణం మీ తల్లిదండ్రులకి, మీ అన్నాచెల్లెళ్లకి, ముందుగా మీ కుటుంబ సభ్యులకి, దాని తర్వాత నాకు, కల్యాణ్ అన్నకు, మా కుటుంబానికి ఎంతో అవసరం.. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలి. ఈ పండుగ వాతావరణంలో విడుదలవుతున్న ‘దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో..’ తో పాటు మా ‘ఎంత మంచివాడవురా’ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి, తెలుగు చిత్రసీమ ముందుకు వెళ్లేలా దోహద పడాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాణంలోకి అడుగుపెడుతున్న ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తగార్లను ఇండస్ట్రీకి స్వాగతం పలుకుతున్నాను. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. నేడు రజనీకాంత్‌గారి ‘దర్బార్’ విడుదలవుతోంది. 11న మహేశ్‌బాబుగారు, మా అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తుంది. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’ ఈ నెల 12న విడుదలవుతుంది. అందరి సినిమాలూ బాగా ఆడాలని, మా సినిమా ఇంకా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ఉమేష్ గుప్త మాట్లాడుతూ– ‘‘ఎంత మంచివాడవురా’ సినిమా నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది. బాగా కష్టపడే టీమ్‌తో మా మొదటి సినిమాని తీసినందుకు సంతోషంగా ఉంది. కల్యాణ్‌రామ్ చాలా బాగా నటించారు. జాతీయ అవార్డు గ్రహీత వేగేశ్న సతీష్‌గారితో మా తొలి చిత్రం చేయడం అదృష్టం. 30ఏళ్లుగా మాకు సహకారం అందిస్తూ, ప్రోత్సహిస్తున్న చిత్ర పరిశ్రమవారికి ధన్యవాదాలు’’ అన్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘నందమూరి కుటుంబం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. సీనియర్ ఎన్టీఆర్‌గారి నుంచి ఈ క్రమశిక్షణ అలాగే వస్తోంది. ఈ పండుగ రోజున ‘ఎంత మంచివాడవురా’ సినిమా వస్తోంది.. మనందరం ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి పోటీలో నందమూరి సినిమా కూడా నిలబడింది. ఉమేష్ గుప్తగారు నాకు ఇరవై ఏళ్లుగా మిత్రులు. ‘పటాస్, 118’ తర్వాత కల్యాణ్‌రామ్‌గారి ఈ సినిమా మా ఆధ్వర్యంలో విడుదలవుతోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కల్యాణ్‌గారికి ఆల్ ది బెస్ట్. మా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ సంక్రాంతికి వస్తున్నాడు.. తనకు ఆల్ ది బెస్ట్. అందరం కలిసి సంక్రాంతికి కుమ్మేద్దాం’’ అన్నారు. వేగేశ్న సతీష్ మాట్లాడుతూ– ‘‘నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, రచయితగా జన్మనిచ్చిన ముప్పలనేని శివగారికి, నన్ను దర్శకునిగా చేసిన ఈవీవీ సత్యనారాయణ, ‘అల్లరి’ నరేశ్గార్లకు, ‘శతమానం భవతి’ సినిమా ద్వారా పునర్జన్మనిచ్చిన ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్గార్లకు థ్యాంక్స్.. వారందరూ లేకుంటే ఈ రోజు నేను ఈ వేదికపైన లేను. మీరందరూ ఇప్పుడు ఈ ఎన్టీఆర్‌గారికి అభిమానులు.. మా నాన్నగారు 1963లోనే సీనియర్ ఎన్టీఆర్‌గారికి అభిమానులు.. ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షులు కూడా. ఇద్దరి ఎన్టీఆర్‌లతో నేను ఫొటో దిగాను. నందమూరి హీరోతో నేను సినిమా చేసినందుకు మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవారు.. ఆయన లేనందుకు బాధగా ఉంది. ఎన్టీఆర్ మాస్ చేస్తే ‘సింహాద్రి’.. క్లాస్ చేస్తే ‘బృందావనం’.. క్లాసూ, మాసూ మిక్స్ చేస్తే ఒక ‘జనతా గ్యారేజ్, అరవింద సమేత’. కల్యాణ్‌రామ్‌గారు మాస్ చేస్తే ‘అతనొక్కడే’.. క్లాస్ చేస్తే ‘118’.. క్లాసూ, మాసూ మిక్స్ చేస్తే మా ‘ఎంత మంచివాడవురా’. ఇంతమంచి అభిమానులను సంపాదించుకున్న మా నందమూరి వాళ్లు ధన్యులు. ఈ సినిమాని 72రోజుల్లో పూర్తి చేయడానికి కారణం నా సాంకేతిక నిపుణులు. సినిమా చాలా బాగొచ్చింది.. ఈ సంక్రాంతికి హిట్ కొడుతున్నాం.. సినిమా గురించి సక్సెస్‌మీట్‌లో మాట్లాడతా’’ అన్నారు. మెహరీన్ మాట్లాడుతూ– ‘‘నేను నటించిన ‘ఎఫ్ 2’ విడుదలైన తర్వాత మరో మంచి సినిమా చేయాలని ఐదు నెలలు ఎదురుచూశాను. సతీష్‌గారు ఈ కథ చెప్పినప్పుడే ఇలాంటి పాత్ర చేసే అవకాశం నాకు మళ్లీ మళ్లీ రాదనిపించింది. భావోద్వేగాలు, అనురాగాలు, ఆలోచన పరిపక్వత ఉన్న నందులాంటి పాత్ర ఈ సినిమాలో నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణలో నేను పాల్గొన్నట్లు లేదు.. మా కుటుంబంతో కలిసి పండగ చేసుకున్నట్లు ఉంది. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనే భావన కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు సుభాష్ గుప్త, మహేశ్ కోనేరు, నటులు శరత్‌బాబు, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రవీణ్, ప్రభు, భద్రం, రచ్చ రవి, హీరోయిన్ నటాష దోషి, సంగీత దర్శకుడు గోపీ సుందర్, ‘ఆదిత్య’ మ్యూజిక్ ఆదిత్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అడిగి ఐ లవ్యూ చెప్పించుకోకూడదు’
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, పాటలు, టీజర్‌తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘తాతయ్య దగ్గర శివ, ఊళ్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు’అంటూ మొదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. రిలేషన్షిప్, ఎమోషన్ అనే పాయింట్‌కు మాస్, లవ్, కామెడీని చేర్చి అందమైన చిత్రంగా దర్శకుడు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా సతీష్ వేగేశ్న చిత్రమంటేనే ఆకట్టుకునే డైలాగ్‌లకు కొదువుండదు. ఈ ట్రైలర్లకూడా పలు డైలాగ్‌లు పేలాయి. ‘పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ’, ‘అడిగి ఐలవ్యూ చెప్పించుకోకూడదు’, ‘యస్.. నాకు హీరోలంటే పిచ్చి’, ఎదురించేవాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం’, ‘ఎవరైనా ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా, భయమైనా’అంటూ వచ్చే డైలాగ్‌లు పిచ్చెక్కిస్తున్నాయి. తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. -
మంచివాడు
కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
సాక్షి, హైదరాబాద్: కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘క్లీన్ యూ’ సర్టిఫికేట్ లభించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సకుటుంబసపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మరింత ప్రమోషన్ కల్పించేందుకు బుధవారం (8వతేదీన) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో ఉన్న సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో ప్రమోషన్లో దూసుకుపోతూ ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గెస్ట్‌గా ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బాగా కలిసివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తుస్తున్నారు. కళ్యాణ్ రామ్, మెహరీన్‌తోపాటు, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.