Entha Manchivaadavuraa Review, in Telugu, Rating {2.5/5} | ‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ | Kalyan Ram - Sakshi
Sakshi News home page

‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ

Published Wed, Jan 15 2020 1:02 PM | Last Updated on Thu, Jan 16 2020 12:03 PM

Kalyan Ram Entha Manchi Vadavura Movie Review And Rating - Sakshi

టైటిల్‌: ఎంత మంచివాడవురా!
జానర్‌: లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: కళ్యాణ్‌ రామ్‌, మెహరీన్‌, ప్రవీణ్‌, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, విజయ్‌కుమార్‌, నరేశ్‌, సుదర్శన్‌ వెన్నెల కిశోర్‌, రాజీవ్‌ కనకాల
సంగీతం: గోపీ సుందర్‌
దర్శకత్వం: సతీష్‌ వేగేశ్న
నిర్మాతలు: ఉమేష్‌ గుప్త, సుభాష్‌ గుప్త

నందమూరి కళ్యాణ్‌రామ్‌-మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. ‘శతమానం భవతి’తో నేషనల్‌ అవార్డు అందుకున్న సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే, నా నువ్వే, 118 లాంటి వరుస పరాజయాలతో వెనకపడ్డ ఈ నందమూరి హీరో ఈ చిత్రంతో హిట్‌ కొట్టాలని భావిస్తుండగా.. ‘శతమానం భవతి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో అదే ఫీల్‌ను కంటిన్యూ చేయలేకపోయారు సతీష్‌. దీంతో హీరోగా కళ్యాణ్‌ రామ్‌కు.. దర్శకుడిగా సతీష్‌ వెగేశ్నకు ఈ చిత్రం ఎంతో ప్రెస్టేజ్‌గా మారింది. ఇక సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎంత మంచివాడవురా!’ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంది? కళ్యాణ్‌రామ్‌ విషయంలో ఎన్టీఆర్‌ కన్న కల ఎంత మేర విజయం సాధించింది? సంక్రాంతి బరిలో​కి దిగిన నందమూరి ఇంటి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో’ చిత్రాలకు గట్టి పోటీనిస్తుందా? అనేది సినిమా సమీక్షలో చూద్దాం.  

కథ:
బాలు(కళ్యాణ్‌ రామ్‌)కు బంధాలు, బంధుత్వాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బర్త్‌డే కానుకగా చుట్టాలందిరినీ పిలిచి పండగ టైప్‌లో ఎంజాయ్‌ చేయాలని తన తండ్రిని బాలు కోరుతాడు.  ఎందుకంటే చుట్టాలంటే తనకు ఇష్టమని పేర్కొంటాడు. అయితే సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడుతుంది. ఓ రోడ్డు ప్రమాదంలో బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఈ సమయంలో నా అనుకున్న బంధువులు బాలు చేతిలో జాలిగా ఏమైనా కొనుకొమ్మని డబ్బులు పెడతారే తప్ప చేయందించి తామున్నామనే భరోసా ఇవ్వరు. ఈ తరుణంలో నందిని (మెహరీన్‌)కి బాలుతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. 

అయితే బాలు తన స్నేహితుల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడతారు. అయితే ఈ విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఆ కారణం తెలుసుకొని వారికి అసలు విషయం చెప్పి వారి దగ్గర ఓ ప్రపోజల్‌ పెడతాడు. అక్కడి నుంచి అసలు కథ, ఎమోషన్స్‌ మొదలవుతాయి. అయితే ఈ కథలోకి మిగతా తారాగణం ఎందుకు ఎంటరవుతుంది? ఇంతకీ ఆచార్య, రిషి, సూర్య, శివ, బాలు అందరూ ఒక్కటేనా లేక వేరువేరా? స్నేహితుల దగ్గర బాలు పెట్టిన ప్రపోజల్‌ ఏంటి? అది సత్ఫలితాన్ని ఇచ్చిందా? లేక ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అనేదే అసలు సినిమా కథ

https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

నటీనటులు: 
కళ్యాణ్‌ రామ్‌ తన పంథా మార్చుకుని చేసిన సినిమా ‘ఎంత మంచివాడవురా!’. కెరీర్‌ ప్రారంభంలో ఒకే రకమైన చిత్రాలు చేసిన ఈ నందమూరి హీరో ఈ మధ్య కాలంలో విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో కుటుంబ కథానాయకుడిగా పక్కా ఆప్ట్‌ అయ్యాడు. అన్ని రకాల హావభావాలను ప్రదర్శించాడు. నటన పరంగా కళ్యాణ్‌ రామ్‌ అన్ని వేరియేషన్స్‌ చూపించాడు. కామెడీతో పాటు ముఖ్యంగా ఎమోషన్స్‌ పండించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇక కళ్యాణ్‌ రామ్‌ తర్వాత ఈ సినిమాలో మరొకరి గురించి చెప్పుకోవాలంటే హీరోయిన్‌ మెహరీన్‌. 

సినిమా అద్యంతం కళ్యాణ్‌ రామ్‌తోనే ఉండే ఈ అందాల బొమ్మకు మంచి సీన్సే పడ్డాయి. అల్లరి, కామెడీ, హీరోపై తనకుండే ప్రేమను ఇలా అన్ని రకాల భావాలను అవలీలగా పండించింది. అంతేకాకుండా హీరో కోసం పరితపించే అమ్మాయిగా ఆకట్టుకుంది. నటిగా ఈ చిత్రంతో మెహరీన్ మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి. చాలా కాలం తర్వాత విలన్‌గా కనిపించిన రాజీవ్‌ కనకాల తనదైన పెర్మార్మెన్స్‌ కనబర్చాడు. ఇక మిగతా తారాగణం విషయానికి వస్తే సుహాసిని, శరత్‌ బాబు, తనికెళ్ల భరిణి, నరేశ్‌ వీరంతా సీనియర్స్‌ కావడంతో వారి పాత్రలను చాలా సులువుగా చేసేశారు. వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, భద్రం, ప్రవీణ్‌లు తమ కామెడీతో ఆకట్టుకున్నారు.  


విశ్లేషణ: 
‘నా తండ్రిని విశాలమైన ఇంట్లో ఉంచాను.. ఆయన తిరగడానికి కారును కొనిచ్చా.. అమ్మ లేకపోవడంతో తినడానికి ఇబ్బందులు పడకూడదని వంట మనిషిని పెట్టాను. ఇంతంకంటే ఓ తండ్రిని ఆనందంగా ఉంచడానికి ఏం చేస్తారు’ ప్రస్తుత జనరేషన్‌లో ఓ సగటు కొడుకు లేక కూతురు అనుకోవడం కామన్‌. అయితే వాటితో తమ తల్లిదండ్రులు ఆనందపడట్లేదు కేవలం సుఖపడుతున్నారనే విషయాన్ని ఈ చిత్రంతో తెలియజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఆధునిక నాగరికతకు అలవాటు పడుతున్న ప్రస్తుత యువత బంధాలు, బంధుత్వాలతో కూడిన ఎమోషన్స్‌కు కనెక్ట్‌ కాలేకపోతున్నారు. బిజీ లైఫ్‌లో కాస్త విరామం దొరికితే రిలాక్స్‌ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప కొత్త బంధాలను కలుపుకుపోవడానికి యత్నించడం లేదు. ఇలా కొన్ని పాయింట్లతో కథను అల్లుకుని నందమూరి కళ్యాణ్‌ రామ్‌ వంటి స్టార్‌ హీరోతో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్‌ గట్స్‌కు హ్యాట్సాఫ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే తమ హీరో నుంచి నందమూరి ఫ్యాన్స్‌ ఎక్కువగా మాస్‌ ఎలిమెంట్స్‌నే కోరుకుంటారు. ఇలాంటి కుటుంబకథా చిత్రాన్ని ఒప్పుకోరు. అయితే కథ నచ్చడం, కొత్తగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో కళ్యాణ్‌రామ్‌ కూడా ఈ సినిమాకు సై అన్నారు.     

‘శతమానం భవతి, శ్రీనివాస్‌ కళ్యాణం’ వంటి చిత్రలతో కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా ముద్రపడిపోయారు సతీష్‌ వేగేశ్న. అయితే ఓ గుజరాతీ చిత్రంకు సంబంధించిన మూల కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు, నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించారు.  ఈ  సినిమా కథ సగంకు పైగా ఫ్లాష్‌ బ్యాక్‌లోనే నడుస్తుంది. రిలేషన్‌షిప్స్‌, ఫ్రెండ్స్‌, హీరోయిన్‌ వన్‌సైడ్‌ లవ్‌, కామెడీ, పాటలు, కోర్టు సీన్స్‌, ఒకటి రెండు ఫైట్లతో తొలి అర్థభాగం పర్వాలేదనిపిస్తుంది. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌ ఎమోషన్‌ సప్లయిర్‌’ అనే కొత్త కాన్సెప్ట్‌ అందరినీ ఆలోచించే విధంగా ఉంటుంది. 

ఇక ఫస్టాఫ్‌లో భాగంగా వేసిన ముడులను రెండో అర్ధభాగంలో ఒక్కొక్కటి విప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అంతేకాకుండా సెకండాఫ్‌ను మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిశోర్‌ కామెడీ, సుహాసిని, శరత్‌ బాబుల ఎంట్రీ తర్వాత సినిమా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. కృష్ణవంశీ సినిమా మాదిరి ప్రతీ ఫ్రేమ్‌లో భారీ తారగణంతో సందడిసందడిగా ఉంటుంది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్లు చాలా రొటీన్‌గా ఉంటాయి. అయితే ఒకే ఫీల్‌తో సినిమా అంత సాగడం. కాన్సెప్ట్‌ కొత్తగా ఉన్నగా.. పూర్తి కథగా, సినిమాను అందంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్‌ ఎందుకో తడబడ్డట్లు అనిపిస్తుంది.

ఇక కళ్యాణ్‌రామ్‌తో తనికెళ్ల భరణి, విజయ్‌ కుమార్‌, సుహాసిని, శరత్‌బాబులతో వచ్చే ఎమోషన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌ను హీరో కూల్‌ చేయడానికి ప్రయత్నించే సమయంలో వచ్చే నాగిని సాంగ్‌ నవ్వులు తెప్పిస్తుంది. యూట్యూబ్‌ థంబ్‌నేల్స్‌ కోసం సుదర్శన్‌ పడే కష్టాలు హాయిగా ఉంటాయి. సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్‌ ఎంటరయ్యాక తన దైన స్టైల్లో కామెడీ పండించాడు.

‘బంధాన్ని కోరుకునేది మీరు, అనుబంధాన్ని పంచేది మేము, భయం ఒకడు పెడితే రాదు, ధైర్యం ఒకడిస్తే పోదు, ఆడ పిల్లల కోరికలు ఉల్లి పొరలు వంటివి, దేవుడికంటే గొప్పగా స్క్రీన్‌ప్లే గొప్పగా రాయలేరు, ఎమోషన్‌ అవసరమైన వారికి రిలేషన్‌ షిప్‌ ఇస్తాడంట, లైఫ్‌ పార్ట్‌నర్‌ ఇంటి నుంచి రావాలి కాని వదిలేసి కాదు, ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వారి సంతోషం కోసం అబద్దం ఆడిన తప్పులేదు, వాకిట్లో అన్నీ అమ్ముతున్నారు.. రిలేషన్‌షిప్‌ కూడానా’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. 

ఇక సాంకేతికత విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మున్నార్‌, హీరోహీరోయిన్లను చాలా అందంగా చూపించారు. అయితే మ్యూజిక్‌ చాలా మైనస్‌ అయింది. గోపీ సుందర్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొత్తగా అనిపించదు. అంతేకాకుండా థియేటర్‌ నుంచి బయటకి వచ్చాక పాటలు కూడా గుర్తుండవు. యాక్షన్‌ సీన్స్‌ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే డైరెక్టర్‌ తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అయితే ఎమోషన్స్‌, ఫీల్స్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయితే ‘ఎంత మంచి సినిమా!’ అవడం ఖాయం. 
https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif 

ప్లస్‌ పాయింట్స్‌:
కళ్యాణ్‌ రామ్‌ నటన
సెకండాఫ్‌లో వచ్చే కామెడీ
కాన్సెప్ట్‌ కొత్తగా ఉండటం
మాటలు
ఎమోషన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌:
మ్యూజిక్‌
సాగదీత సీన్లు
క్లైమాక్‌

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement