మెహరీన్
‘‘ఎఫ్ 2’ సినిమాలో నేను చేసిన హనీ పాత్ర, ‘హనీ ఈజ్ ది బెస్ట్’ మేనరిజమ్ చాలా పాపులర్ అయ్యాయి. స్వతహాగా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాను’’ అన్నారు మెహరీన్. కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త్త నిర్మించారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు.
► దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ కథ చెప్పగానే అద్భుతం అనిపించింది. అన్ని ఎమోషన్స్‌ను చూపించా ల్సిన పాత్ర. ఇలాంటి రోల్ ఇదివరకెప్పుడూ చేయలేదు. నా పాత్ర పేరు నందు. ఫస్టాఫ్‌లో బబ్లీగా ఉంటుంది. సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటా. నేను షార్ట్ ఫిలింస్ నిర్మి స్తుంటా. నా షార్ట్ ఫిల్మ్‌లో కల్యాణ్ రామ్‌గారు హీరోగా చేస్తారు.
► కేవలం కుటుంబ భావోద్వేగాలు మాత్రమే కాదు ప్రేమ, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. పండగకి వస్తున్న పండలాంటి సినిమా. కథ విని, ఈ పాత్ర నేను చేయగలనా? అని దర్శకుడిని అడిగాను. ‘చేయగలవనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను.
► ఇది గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు దర్శకుడు. మాతృక చూస్తే ఆ పాత్ర తాలూకు ప్రభావం నా మీద పడుతుందని చూడలేదు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మూడు పేజీల డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. కష్టపడి నేర్చుకుని సింగిల్ టేక్‌లో పూర్తి చేశాను. ఈ సినిమా టైటిల్ కల్యాణ్‌రామ్‌గారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. నిజాయితీగా ఉంటారు.
► సినిమా హిట్, ఫ్లాప్ మన చేతుల్లో ఉండదు. కథను నమ్మి సినిమా చేయడానికి అంగీకరిస్తాం. మంచి సినిమా అందించాలనుకుంటాం. ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్.
► సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ నాకు అమ్మతో సమానం. ప్రస్తుతానికి బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు. నా తమ్ముడు (గురు ఫతేహ్ ) బాలీవుడ్‌లో కరణ్ జోహార్ బేనర్ ద్వారా లాంచ్ అవుతున్నాడు.
► ఈ జనవరి నాకు ట్రిపుల్ ధమాకా. ‘ఎంత మంచివాడవురా!’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. తమిళంలో ధనుష్‌తో చేసిన ‘పటాస్’ 16న విడుదలవుతుంది. జనవరి 31న ‘అశ్వథ్థామ’ విడుదలవుతుంది.
► ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేయడం నా బలం. పాత్రకు పూర్తిగా కనెక్ట్ అయి నటించడానికి ప్రయత్నిస్తాను. అందుకే గ్లిజరిన్ కూడా అవసరం లేకుండా ఎమోషనల్ సన్నివేశాలు చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment