పద్మభూషణుడైన సకలకళావల్లభుడు
పద్మభూషణుడైన సకలకళావల్లభుడు
Published Sun, Jan 26 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
పురస్కారాలు అందుకోవడం తొలి నుంచే అలవాటైంది కమల్‌హాసన్‌కి. అయిదేళ్ల వయసులోనే మొదటి సినిమా ‘కలత్తూర్‌కన్నమ్మ’ (1959) ద్వారా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారాయన. అప్పట్నుంచి బిరుదులు, పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలోకి చేరుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, ప్రైవేటు పురస్కారాలైతే... అసలు లెక్కే లేదు. పాతికేళ్ల క్రితమే కమల్ ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్నారు. అయితే... ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారం ఈ మహానటుణ్ణి వరించింది. 55ఏళ్ల నటప్రస్థానాన్నీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాను చేసిన అద్వితీయ పాత్రలని, కళలకు తాను చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’కి కమల్‌ని కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఇది దక్షిణాది సినీ పరిశ్రమనే కాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమల్ అభిమానులందరినీ ఆనందపరిచే విషయం.
తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కమల్‌హాసన్‌ని తమిళ చిత్రపరిశ్రమ తొలినాళ్లల్లో బాగానే ప్రోత్సహించింది. బాలనటునిగా ఆరు చిత్రాల్లో నటించారాయన. ఆరేళ్ల వయసులోనే ‘పార్తాల్ పసి తీరుమ్’(1960) చిత్రం పుణ్యమా అని మహానటుడు శివాజీగణేశన్‌తో అభినయించే క్రెడిట్ కొట్టేశారు. ‘ఆ సినిమాలో శివాజీసార్ నన్ను ఎత్తుకున్నారు. ముద్దాడారు’ అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు కమల్. బాలనటునిగా తెరపై తేలిగ్గానే కనిపించినా, సినీపరిశ్రమలో ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి కమల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఓ వయసొచ్చాక... కొన్నాళ్ల పాటు పలువురు డాన్స్ మాస్టర్స్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. అక్కినేని, కృష్ణంరాజు లాంటి ప్రముఖులకు డాన్స్ మూమెంట్స్ కూడా నేర్పారు. ఆ తర్వాత అలా కనిపించి, ఇలా మాయమయ్యే పాత్రలు చాలానే చేశారు. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘అరంగేట్రం’(1974) కమల్‌కి తొలి బ్రేక్‌గా నిలిస్తే... బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘అపూర్వరాగంగళ్’(1975) ఆయన్ను స్టార్‌ని చేసింది.
తెలుగు ప్రేక్షకులకు కమల్‌ని పరిచయం చేసింది కూడా బాలచందరే. ‘అంతులేని కథ’ తెలుగుతెరపై కమల్ కనిపించిన తొలి సినిమా. ‘మరోచరిత్ర’(1978)తో ఆయన తెలుగునాట కూడా స్టార్‌గా అవతరించారు. ఇక అప్పట్నుంచి నటనకు భాషతో నిమిత్తం లేదు అని నిరూపిస్తూ... హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి మహానటుడిగా అవతరించారు కమల్. తెలుగులో డెరైక్ట్‌గా కమల్ నటించిన అంతులేని కథ, మరోచరిత్ర, ఇది కథ కాదు, అందమైన అనుభవం, సొమ్మొకడిదీ సోకొకడిది, ఆకలిరాజ్యం, సాగరసంగమం, స్వాతిముత్యం, ఒకరాధా ఇద్దరు కృష్ణులు, శుభసంకల్పం, ఇంద్రుడు-చంద్రుడు చిత్రాలు ఆయన్ను తెలుగు నటుణ్ణి చేసేశాయి. తెలుగులో డెరైక్ట్‌గా ఇన్ని విజయాలు అందుకున్న పరభాషా నటుడు మరొకరు లేరు.
ఎర్రగులాబీలు, అమావాస్య చంద్రుడు, ఖైదీవేట, నాయకుడు, విచిత్రసోదరులు, మైకేల్ మదనకామరాజు, చాణక్య, సతీలీలావతి, గుణ, భామనే.. సత్యభామనే, మహానది, సత్యమే శివం, దశావతారం, విశ్వరూపం.. ఇలా ఎన్నో అనువాదాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు కమల్. ఇక ‘పుష్పక విమానం’ సంగతి సరేసరి. ఆయన తమిళ నటుడంటే మింగుడు పడనంతగా ప్రేమను పెంచుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ పనిలో ఉన్నారాయన. ఈ సందర్భంలో ఆ మహానటుడికి ‘పద్మభూషణ్’ రావడం పట్ల.. భాషతో ప్రమేయం లేకుండా సినీ అభిమాని అయిన ప్రతి ఒక్కరూ హర్షం వెలిబుచ్చుతున్నారు.
Advertisement