చెన్నై : కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కరోనాపై అవగాహన కలిగించడమే కాకుండా.. పలు అంశాలపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా లైవ్‌లోకి వచ్చారు. హీరో విజయ్ సేతుపతితో కలిసి ఆయన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు సినిమాలు, రాజకీయాలతోపాటుగా పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే విజయ్ అడిగిన పలు ప్రశ్నలకు కమల్ తనదైన శైలిలో జవాబిచ్చారు. అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను కూడా వెల్లడించారు.
ఈ సందర్భంగా విజయ్ నటనపై కమల్ ప్రశంసలు కురిపించారు. ‘నటుడిగా నేను నిన్ను చాలా ఇష్టపడతాను. కమర్షియల్ హంగుల వైపు వెళ్లకుండా మీరు స్క్రిప్టును నమ్ముకుంటారు. సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది.. కానీ స్క్రిప్టును నమ్ముకుని మీరు చేసే ప్రయాణం ఎప్పటికీ వృథా కాదు’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. నటించే ప్రతి పాత్రకు సంబంధించి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారని కమల్‌ను విజయ్ ప్రశ్నించారు. దీనిపై కమల్ స్పందిస్తూ.. ‘నాకు దర్శకుడు కె బాలచందర్, మలయాళం సినిమా నటన గురించి నేర్పించాయి. మలయాళం ప్రజలు తమ అభిమాన నటులను విభిన్న పాత్రల్లో ప్రయోగం చేయడాన్ని ఇష్టపడతారు. కానీ తమిళనాడులో నటులను కొన్ని రకాల పాత్రల్లో చూడటానికి మాత్రమే ఇష్టపడతారు. చాలా కాలం తర్వాత నటనలో ప్రయోగాలు చేయాలనే కోరిక నీలో చూస్తున్నాను’ అని కమల్ చెప్పారు. అలాగే దిగ్గజ నటుడు, దివంగత సీఎం ఎంజీఆర్‌తో చెప్పిన కొన్ని మాటలను గుర్తుచేశారు. ఆయన అడుగు జాడల్లో నడవవద్దని ఎంజీఆర్ తనను కోరినట్టు కమల్ చెప్పారు. ఎంజీఆర్, శివాజీ, దిలీప్ కుమార్ లాంటివారు భవిష్యత్తు తరం కోసం మంచి వేదికను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.(చదవండి : కరోనాపై కమల్ హాసన్ సాంగ్)
దాదాపు 90 నిమిషాలపాటు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. తమిళ సినిమాకు చెందిన ఇద్దరు సూపర్‌స్టార్‌లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొనడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా, ఇదివరకే కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసేలా.. అరివుమ్ అన్భుమ్ పేరుతో కమల్ ఒక పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను రాయడమే కాకుండా ఆయనే పాడారు కూడా. ఇక ఈ పాటకు జిబ్రాన్ సంగీతం అందించగా కమల్‌తోపాటుగా శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ గొంతు కలిపారు.(చదవండి : విజయ్ సేతుపతి పాత్రలో బాబీ సింహా)
Comments
Please login to add a commentAdd a comment