భయం... సంతోషం...నాన్నతో రెండూ!
‘‘నాన్నతో కలసి నటించడం మధురమైన అనుభూతి. అదే సమయంలో నేను చాలా భయపడ్డా’’ అన్నారు శ్రుతీ హాసన్. తండ్రీకూతుళ్లు కమల్ హాసన్, శ్రుతీ హాసన్ కలసి నటిస్తున్న మొదటి చిత్రం ‘శభాష్ నాయుడు’. శ్రుతి భయానికి కారణం ఏంటో తెలుసా? ఈ చిత్రానికి కమలే దర్శక–నిర్మాత. అందువల్ల వ్యక్తిగతంగా చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారట! శ్రుతీ హాసన్ మాట్లాడుతూ –‘‘దర్శకుడిగా నాన్న చాలా స్ట్రిక్ట్. ప్రతి ఒక్కరికీ ఎలా నటించాలో స్పష్టంగా చెబుతారు. ఆయన చెప్పినట్లు చేయకుంటే ముఖం మీదే చెప్పేస్తారు.
దాంతో నేను భయపడ్డా. కానీ, నా వర్క్ పట్ల నాన్న హ్యాపీగా ఉన్నారు. నటిగా ఇప్పటివరకూ నాకు వచ్చిన అత్యుత్తమ ప్రశంస ఏంటంటే... నాన్న హ్యాపీగా ఉన్నానని చెప్పడమే’’ అన్నారు. ఈ చిత్రంలో కూడా కమల్, శ్రుతి తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ‘దశావతారం’లోని ‘రా’ ఆఫీసర్ బలరామ్ నాయుడు పాత్రనే కమల్ ఇందులోనూ చేస్తున్నారు.