Sabhash Naidu
-
ముమ్మరంగా మరుదనాయకం
విశ్వనటుడు చేయని పాత్ర, చేయలేని పాత్ర అంటూ ఉండదు. అయినా ఒక్కో నటుడికి ఒక్కో డ్రీమ్ పాత్ర ఉన్నట్లు కమలహాసన్ కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే మరుదనాయకం. ఒక చరిత్ర వీరుని కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని కమలహాసన్1997 అక్టోబర్ 16వ తేదీన ఎంతో ఆర్భాటంగా మొదలెట్టారు. చిత్ర ప్రారంభోత్సవానికి రాణి ఎలిజబెత్‌ను చెన్నైకి రప్పించారు. మరుదనాయకం 30 నిమిషాల సన్నివేశాలను అద్భుతంగా కమల్ చిత్రీకరించారు. అప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లు దాటుతుందన్న అంచనాతో షూటింగ్ ఆగిపోయింది. అయితే మరుదనాయకం చిత్రం డ్రాప్ అయినట్లు కమలహాసన్ ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికైనా ఆ చిత్రాన్ని చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉన్న విశ్వనటుడు అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ మధ్య విదేశీ మిత్ర బృందం మరుదనాయకం చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చినట్లు కమలహాసనే స్వయంగా వెల్లడించారు. తాజాగా రజనీకాంత్ హీరోగా సుమారు రూ.400 కోట్లతో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థ మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చినట్లు కమల్ వెల్లడించారు.ఈ విషయమై కమల్ ఆ సంస్థ అధినేత సుభాష్‌కరణ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తం మీద 19 ఏళ్ల తరువాత మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు తెలుస్తోంది. కమల్ తాజా చిత్రం శభాష్‌నాయుడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రానికి లైకా సంస్థ భాగస్వామ్యం వహిస్తుందన్నది గమనార్హం. -
భయం... సంతోషం...నాన్నతో రెండూ!
‘‘నాన్నతో కలసి నటించడం మధురమైన అనుభూతి. అదే సమయంలో నేను చాలా భయపడ్డా’’ అన్నారు శ్రుతీ హాసన్. తండ్రీకూతుళ్లు కమల్ హాసన్, శ్రుతీ హాసన్ కలసి నటిస్తున్న మొదటి చిత్రం ‘శభాష్ నాయుడు’. శ్రుతి భయానికి కారణం ఏంటో తెలుసా? ఈ చిత్రానికి కమలే దర్శక–నిర్మాత. అందువల్ల వ్యక్తిగతంగా చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారట! శ్రుతీ హాసన్ మాట్లాడుతూ –‘‘దర్శకుడిగా నాన్న చాలా స్ట్రిక్ట్. ప్రతి ఒక్కరికీ ఎలా నటించాలో స్పష్టంగా చెబుతారు. ఆయన చెప్పినట్లు చేయకుంటే ముఖం మీదే చెప్పేస్తారు. దాంతో నేను భయపడ్డా. కానీ, నా వర్క్ పట్ల నాన్న హ్యాపీగా ఉన్నారు. నటిగా ఇప్పటివరకూ నాకు వచ్చిన అత్యుత్తమ ప్రశంస ఏంటంటే... నాన్న హ్యాపీగా ఉన్నానని చెప్పడమే’’ అన్నారు. ఈ చిత్రంలో కూడా కమల్, శ్రుతి తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ‘దశావతారం’లోని ‘రా’ ఆఫీసర్ బలరామ్ నాయుడు పాత్రనే కమల్ ఇందులోనూ చేస్తున్నారు. -
ఇప్పుడు నేనేమీ చెప్పాలనుకోవడం లేదు!
నటుడు కమల్‌హాసన్‌తో పదమూడేళ్ల సహజీవనాన్ని ముగిస్తూ మంగళవారం గౌతమి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇద్దరు వ్యక్తులు కలసి జీవించడానికి పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉంటే చాలు’’ అని పలు సందర్భాల్లో కమల్, గౌతమి పేర్కొన్నారు. మరి ఇప్పుడు వాళ్ల మధ్య ఏ విషయంలో అవగాహన కొరవడి ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. ఈ చర్చల్లో కీలకంగా శ్రుతీహాసన్ పేరు వినిపిస్తోంది. ఒకరి నిర్ణయాలతో నాకు సంబంధం లేదు: శ్రుతి పెద్ద కూతురు శ్రుతీహాసన్‌తో కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ షూటింగ్లో గౌతమి, శ్రుతీ మధ్య కాస్ట్యూమ్స్ పరంగా జరిగిన వాదన, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలే తాజా పరిణామానికి కారణం అయ్యుంటాయన్నది కొందరి ఊహ. కానీ, గౌతమికీ, తనకూ మధ్య పొరపొచ్ఛాలు లేవని ఆ సమయంలో శ్రుతి వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు తండ్రి నుంచి గౌతమి విడిపోవడానికి తాను కారణం అనే వార్త ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఎవరి వ్యక్తిగత విషయాల గురించి, నిర్ణయాల గురించి తనకు సంబంధం లేదని శ్రుతి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపైన గౌరవం ఉందన్నారు. తాను ప్రేమించేది వారినేనన్నారు. శ్రుతి హాసన్ పేరిట ఆమె మీడియా పర్సన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరణ తెలిపారు. ఆ సంగతలా ఉంచితే... కమల్ పేరిట వార్తల వివాదం కమల్, తానూ విడిపోతున్న విషయాన్ని గౌతమి ప్రకటించిన నేపథ్యంలో కమల్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది తాజా చర్చ. ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రిక విలేఖరి కమల్ని సంప్రదించగా, కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత కమల్ పెదవి విప్పినట్లు కొన్ని పత్రికల్లో, సైట్స్‌లో వచ్చింది. ‘‘ఇప్పుడు నా ఫీలింగ్స్‌కి ప్రాధాన్యం లేదు. గౌతమి, సుబ్బు సౌకర్యవంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లకు మంచి జరగాలని ఆశిస్తున్నా. ఎప్పుడు కావాలన్నా వాళ్ల కోసం నేనున్నానన్నది వాళ్లు తెలుసుకోవాలి. శ్రుతి, అక్షర, సుబ్బలక్ష్మి (గౌతమి కూతురు)- ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఈ ప్రపంచంలో నేను లక్కీయస్ట్ ఫాదర్ అనుకుంటున్నా’’ అని కమల్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. అలా చేయడం అనాగరికం అంటున్న కమల్ అయితే, బుధవారం సాయంత్రం కమల్ తాను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదన్నట్లు ట్విట్టర్లో ఓ ప్రకటన చేశారు. ‘‘ఇలాంటి సమయంలో నా పేరు మీద ఎవరో ఏదో ప్రకటిస్తున్నారు. అలా ఆడుకోవడం వివేక వంతం కాదు. దాన్ని అనాగరికం అంటారు. ఇప్పుడు నేనేదీ ప్రకటించాలనుకోవడం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొ న్నారు. అలా పత్రికల్లో తన పేర వస్తున్న వార్తలు తప్పని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కాసేపటికి ఆయన పక్షాన మీడియా పర్సన్ మరింత వివరంగా ప్రకటన చేశారు. గౌతమి తన నుంచి విడిపోవాలన్న నిర్ణయం ఆమె వ్యక్తిగత విషయమనీ, తనెక్కడ ఉన్నా బాగుండాలని కోరు కుంటున్నాననీ, గౌతమి ఎప్పుడైనా సాయం కోరుకుంటే అది అందించడానికి సిద్ధమనీ తాను అన్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కమల్ ఖండించారు. అసత్య ప్రచారం మంచిది కాదన్నారు. గౌతమి గురించి తానెలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, గౌతమి ప్రకటన, దానిపై వార్తలు, శ్రుతి, కమల్ల ప్రకటనలతో ఈ వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు నలుగురి నోళ్ళలో నానుతోంది. -
కమల్ సినిమాకు వరుస కష్టాలు
లోకనాయకుడు కమల్ హాసన్‌కు సినిమా కష్టాలు తప్పటం లేదు. గతంలో కమల్ సినిమా రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తేవి.. కానీ ఇప్పుడు షూటింగ్ సమయంలోనే ఈ యూనివర్సల్ స్టార్ ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో శభాష్ నాయుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు కమల్. బ్రహ్మానందం, శృతి హాసన్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మళయాల స్టార్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా రాజీవ్ తప్పుకోవటంతో కమల్ దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నాడు. విజయవంతంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన కమల్, తన ఆఫీస్‌లో గాయపడటంతో సినిమా షూటింగ్‌కు మరోసారి బ్రేక్ పడింది. కమల్ కొలుకుంటున్న సమయంలోనే ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్న జేమ్స్ జోసెఫ్ భార్య మరణించటంతో ఆయన కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. తాజాగా చిత్ర సినిమాటోగ్రాఫర్ కూడా తప్పుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ దర్శకత్వ బాధత్యలు తీసుకున్న తరువాత కెమరామేన్ జయకృష్ణ పనితీరు నచ్చకపోవటంతో ఆయన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నాడట. ఇలా వరుస కష్టాలు కమల్ సినిమాను వేదిస్తున్నాయి. మరి వీటన్నింటినీ దాటి శభాష్ నాయుడు ఎప్పుడు థియేటర్లకు చేరతాడో చూడాలి. -
టింగ్... టింగ్... ఎగ్జైటింగ్!
ఇప్పటివరకూ కథానాయికగా శ్రుతీహాసన్ దగ్గర దగ్గర పాతిక సినిమాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తై ఇప్పుడు చేస్తున్న ‘శభాష్ నాయుడు’ మరో ఎత్తు అనేంతగా ఆమె ఆనందపడి పోతున్నారు. దానికి కారణం తొలిసారి తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్-శ్రుతి తమ రియల్ లైఫ్ పాత్రలు పోషిస్తున్నారు. అంటే.. తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ‘దశావతారం’లో ఓ పాత్ర అయిన బలరామ్ నాయుడి పాత్రతో ఈ చిత్రం సాగుతుంది. టైటిల్ రోల్‌ను కమల్ చేస్తుండగా, బలరామ్ నాయుడి అసిస్టెంట్ పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు. ఇందులో కమల్ భార్య పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్ చేశారు. ఈ షూటింగ్లో పాల్గొనడానికి శ్రుతి అక్కడకు వెళ్లారు. ‘‘మా నాన్నగారితో యాక్ట్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని శ్రుతి పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఎగ్జైట్ అవుతున్న తీరు చూస్తుంటే... ‘సుప్రీమ్’ చిత్రంలో ‘జింగ్... జింగ్.. అమేజింగ్’ అనే డైలాగ్‌ని కాస్త మార్చి ‘టింగ్... టింగ్.. ఎగ్జయిటింగ్’ అనాలేమో. -
లాస్‌ఏంజల్స్‌కు శభాష్ నాయుడు చిత్ర యూనిట్
కొత్తదనం కోసమో, లేక కథల డిమాండ్ వల్లనో మన చిత్ర నిర్మాతలు విదేశాలలో చిత్రీకరణకు బయలు దేరుతున్నారు.అయితే ఇందులో సాధక బాధకాలు ఎన్నో. ప్రఖ్యాత నటుడు,నిర్మాత లాంటి వారికి కూడా ఆటంకాలు తప్పడం లేదంటే చూడండి. విశ్వనాయకుడు తాజాగా తమిళం, తెలుగు, హిందీ భాషలో శభాష్ నాయుడు అనే చిత్రంలో నటిస్తూ లైకా సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చెన్నైలో చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం అమెరికాలోని లాస్ఏంజల్స్ చేరుకుంది. అయితే ఇందుకు ఆ యూనిట్ పలు అవరోధాలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విషయాన్ని కమలహాసన్ ఒక లేఖ ద్వారా పేర్కొంటూ శభాష్‌నాయుడు చిత్ర బృందం సురక్షితంగా లాస్ఏంజల్స్ చేరుకుందన్నారు.అయితే ఇందుకు ఆదిలోనే పలు ఆటంకాలను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు.అలాంటి సవాళ్లను అధిగమించి అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు.ప్రతి చిత్ర నిర్మాణ సంస్థకు ఇలాంటి సమస్యలు ఎదురవ్వడం సర్వసాధారణ విషయంగా భావించాల్సి ఉంటుందన్నారు.ముఖ్యంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఎత్తున,బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్న శభాష్ నాయుడు లాంటి చిత్రాల నిర్మాణాలకు ఇలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయన్నారు. చెన్నైలోని అమెరికా కాన్సలెంట్ సహకారం మరువలేనిదన్నారు.వారు విదేశాలలో చిత్ర నిర్మాణం చేపడుతున్న తమ ప్రతి చిత్రానికి ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు.ఇదే విధంగా దక్షిణాదికి చెందిన ప్రతి చిత్ర నిర్మాణ సంస్థకు వారు ఎంతో సహాయ సహకారాన్ని అందుస్తున్నారని అన్నారు.ఇకపోతే ప్రతిభావంతులైన నటీనటులు,సాంకేతిక వర్గంతో శభాష్ నాయుడు చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కమలహాసన్ పేర్కొన్నారు.కాగా ఇందులో కమలహాసన్ ఆయన కూతురు శ్రుతిహసన్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.దీనికి సంగీతజ్ఞాని ఇళయరాజా స్వరాలు క డుతున్నారు.