ఇప్పుడు నేనేమీ చెప్పాలనుకోవడం లేదు!
నటుడు కమల్‌హాసన్‌తో పదమూడేళ్ల సహజీవనాన్ని ముగిస్తూ మంగళవారం గౌతమి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇద్దరు వ్యక్తులు కలసి జీవించడానికి పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉంటే చాలు’’ అని పలు సందర్భాల్లో కమల్, గౌతమి పేర్కొన్నారు. మరి ఇప్పుడు వాళ్ల మధ్య ఏ విషయంలో అవగాహన కొరవడి ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. ఈ చర్చల్లో కీలకంగా శ్రుతీహాసన్ పేరు వినిపిస్తోంది.
ఒకరి నిర్ణయాలతో నాకు సంబంధం లేదు: శ్రుతి
పెద్ద కూతురు శ్రుతీహాసన్‌తో కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌లో గౌతమి, శ్రుతీ మధ్య కాస్ట్యూమ్స్ పరంగా జరిగిన వాదన, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలే తాజా పరిణామానికి కారణం అయ్యుంటాయన్నది కొందరి ఊహ. కానీ, గౌతమికీ, తనకూ మధ్య పొరపొచ్ఛాలు లేవని ఆ సమయంలో శ్రుతి వివరణ కూడా ఇచ్చారు.
ఇప్పుడు తండ్రి నుంచి గౌతమి విడిపోవడానికి తాను కారణం అనే వార్త ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఎవరి వ్యక్తిగత విషయాల గురించి, నిర్ణయాల గురించి తనకు సంబంధం లేదని శ్రుతి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపైన గౌరవం ఉందన్నారు. తాను ప్రేమించేది వారినేనన్నారు. శ్రుతి హాసన్ పేరిట ఆమె మీడియా పర్సన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరణ తెలిపారు. ఆ సంగతలా ఉంచితే...
కమల్ పేరిట వార్తల వివాదం
కమల్, తానూ విడిపోతున్న విషయాన్ని గౌతమి ప్రకటించిన నేపథ్యంలో కమల్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది తాజా చర్చ. ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రిక విలేఖరి కమల్‌ని సంప్రదించగా, కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత కమల్ పెదవి విప్పినట్లు కొన్ని పత్రికల్లో, సైట్స్‌లో వచ్చింది. ‘‘ఇప్పుడు నా ఫీలింగ్స్‌కి ప్రాధాన్యం లేదు. గౌతమి, సుబ్బు సౌకర్యవంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా.
వాళ్లకు మంచి జరగాలని ఆశిస్తున్నా. ఎప్పుడు కావాలన్నా వాళ్ల కోసం నేనున్నానన్నది వాళ్లు తెలుసుకోవాలి. శ్రుతి, అక్షర, సుబ్బలక్ష్మి (గౌతమి కూతురు)- ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఈ ప్రపంచంలో నేను లక్కీయస్ట్ ఫాదర్ అనుకుంటున్నా’’ అని కమల్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి.
అలా చేయడం అనాగరికం అంటున్న కమల్
అయితే, బుధవారం సాయంత్రం కమల్ తాను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదన్నట్లు ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేశారు. ‘‘ఇలాంటి సమయంలో నా పేరు మీద ఎవరో ఏదో ప్రకటిస్తున్నారు. అలా ఆడుకోవడం వివేక వంతం కాదు. దాన్ని అనాగరికం అంటారు. ఇప్పుడు నేనేదీ ప్రకటించాలనుకోవడం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొ న్నారు. అలా పత్రికల్లో తన పేర వస్తున్న వార్తలు తప్పని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కాసేపటికి ఆయన పక్షాన మీడియా పర్సన్ మరింత వివరంగా ప్రకటన చేశారు.
గౌతమి తన నుంచి విడిపోవాలన్న నిర్ణయం ఆమె వ్యక్తిగత విషయమనీ, తనెక్కడ ఉన్నా బాగుండాలని కోరు కుంటున్నాననీ, గౌతమి ఎప్పుడైనా సాయం కోరుకుంటే అది అందించడానికి సిద్ధమనీ తాను అన్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కమల్ ఖండించారు. అసత్య ప్రచారం మంచిది కాదన్నారు. గౌతమి గురించి తానెలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, గౌతమి ప్రకటన, దానిపై వార్తలు, శ్రుతి, కమల్‌ల ప్రకటనలతో ఈ వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు నలుగురి నోళ్ళలో నానుతోంది.