
హీరోయిన్‌గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చిత్రపరిశ్రమలో పని చేసింది గౌతమి. కానీ తన జీవితాన్ని మాత్రం సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది. తెలుగు, తమిళంలో స్టార్స్‌తో కలిసి నటించిన ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట్లో బిజినెస్‌మెన్ సందీప్ భాటియాను పెళ్లాడిన ఈమెకు కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది. పాప పుట్టిన ఏడాదే అతడికి విడాకులిచ్చేసింది.

13 ఏళ్ల ప్రేమ
తర్వాతి కాలంటో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేశారు. కాలం కన్ను కుట్టిందో ఏమో కానీ 2016లో విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నీ బలం నువ్వే.. బాధేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడటమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో దారి అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక అంశం ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటుంది. దానికి అట్రాక్ట్ అవుతారు.

ఆ పాయింట్ దాటొద్దు
కానీ నిజమైన బలం వేరెవరూ కాదు.. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. ఒక రిలేషన్‌షిప్ వర్కవుట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రిలేషన్ అయినా సరే.. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఇద్దరు సమానంగా అక్కడికి చేరుకోవాలి. కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలాదూరం వచ్చినట్లు ఫీలవుతారు. ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి అదొక అలవాటుగా మారిపోతుంది.

లైఫ్ లెస్సన్
అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు. కావాలంటే నువ్వే వచ్చేయ్ అంటారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాఠం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. లవ్, కమిట్‌మెంట్ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి చెప్పుకొచ్చింది. కాగా ఈమె కమల్‌తో కలిసి అపూర్వసహోదరగళ్, దేవర్ మగన్, పాపనాశం వంటి చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment