ముమ్మరంగా మరుదనాయకం
విశ్వనటుడు చేయని పాత్ర, చేయలేని పాత్ర అంటూ ఉండదు. అయినా ఒక్కో నటుడికి ఒక్కో డ్రీమ్ పాత్ర ఉన్నట్లు కమలహాసన్ కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే మరుదనాయకం. ఒక చరిత్ర వీరుని కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని కమలహాసన్1997 అక్టోబర్ 16వ తేదీన ఎంతో ఆర్భాటంగా మొదలెట్టారు. చిత్ర ప్రారంభోత్సవానికి రాణి ఎలిజబెత్‌ను చెన్నైకి రప్పించారు. మరుదనాయకం 30 నిమిషాల సన్నివేశాలను అద్భుతంగా కమల్ చిత్రీకరించారు. అప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లు దాటుతుందన్న అంచనాతో షూటింగ్ ఆగిపోయింది. అయితే మరుదనాయకం చిత్రం డ్రాప్ అయినట్లు కమలహాసన్ ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికైనా ఆ చిత్రాన్ని చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉన్న విశ్వనటుడు అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ మధ్య విదేశీ మిత్ర బృందం మరుదనాయకం చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చినట్లు కమలహాసనే స్వయంగా వెల్లడించారు.
తాజాగా రజనీకాంత్ హీరోగా సుమారు రూ.400 కోట్లతో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థ మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చినట్లు కమల్ వెల్లడించారు.ఈ విషయమై కమల్ ఆ సంస్థ అధినేత సుభాష్‌కరణ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తం మీద 19 ఏళ్ల తరువాత మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు తెలుస్తోంది. కమల్ తాజా చిత్రం శభాష్‌నాయుడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రానికి లైకా సంస్థ భాగస్వామ్యం వహిస్తుందన్నది గమనార్హం.