
తమిళసినిమా : నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందించిన చిత్రం నడిగైయార్ తిలగం. దుల్కర్‌సల్మాన్, సమంత, అర్జున్‌రెడ్డి ఫేమ్ విజయ్‌దేవరకొండ, శాలిని పాండే, నాగ్‌చైతన్య, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం శక్రవారం తెరపైకి వచ్చింది. సావిత్రి ప్రారంభ దశను మహానటిగా వెలిగిన దశను, వ్యక్తిగత అంశాలను సమతుల్యంగా ఏ ముఖ్య విషయాన్ని మిస్ కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత దృశ్యకావ్యంగా చిత్రాన్ని మలిచారు.
చిత్ర షూటింగ్ దశలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌నా? అంటూ ఆక్షేపణ చేసిన వారు ఇప్పుడు ఆహా ఏం అభినయం అంటూ ప్రశంసిస్తున్నారు. విశ్వనటుడు కమలహాసన్ కూడా నటి కీర్తీసురేశ్‌ను శుక్రవారం ప్రత్యేకంగా తన ఇంటికి పిలిపించి మరీ అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నటి కీర్తీసురేశ్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ కమలహాసన్ ప్రశంసలు లభించడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఇలా కీర్తీసురేశ్‌ను అభినందించిన వారిలో సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, దర్శకుడు ఎస్‌ఎస్.రాజమౌళి ప్రముఖులెందరో ఉన్నారు. ఇంతకు ముందు కీర్తీపై వ్యంగాస్త్రాలు సంధించిన నెటిజన్లు ఇప్పుడు ఆమె నటనను కీర్తిస్తుండడం విశేషం. చిత్రం నిర్మాణంలో ఉండగా సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్ నటించడానికి సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీనియర్ నటి జమున వంటి వారి వ్యాఖ్యలకు కీర్తీసురేశ్ చిత్రం చూడకుండా విమర్శించడమా అంటూ గట్టిగానే బదులిచ్చారు. అప్పుడే ఆమెలోని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. అలా కీర్తీసురేశ్ గెలిచారు. మహానటి సావిత్రి మాదిరిగానే ఆమె జీవిత చరిత్ర వెండితెరపై చిరస్మరణీయమైంది.
Comments
Please login to add a commentAdd a comment