
నన్నెవరూ అడగలేదు
వివాహమైన తరువాత కూడా హీరోయిన్‌గా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో మీనా ఒకరు. ఒక బిడ్డకు తల్లి అయిన ఈ బహుభాషా నటి రీ ఎంట్రీలోనూ హీరోయిన్‌గా విజ యాలబాటలో పయనించడం విశేషం. మలయాళంలో మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన చిత్రం దృశ్యం. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఇతర భాషల ప్రముఖ హీరోల దృష్టిని తన వైపు తిప్పుకోవడం విశేషం. దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడంలో రవిచంద్రన్‌లు చేస్తున్నారు.
ఇక తమిళంలో పద్మభూషణ్ కమలహాసన్ చేయడానికి ముందుకు రావడం మరో విశేషం. మలయాళంలో మీనా నటించిన పాత్రను తమిళంలోనూ ఆమె పోషించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను మీనా ఖండించారు. దీని గురించి ఆమె స్పందిస్తూ దృశ్యం తమిళ రీమేక్‌లో నటించమని ఇంతవరకు తననెవరూ అడగలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుతం తాను ఏ భాషలోనూ నూతన చిత్రాన్ని ఒప్పుకోలేదని మీనా తెలిపారు.