
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు కంగనా. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతి గురించి విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు కంగనా. తాజాగా ఈ ‘క్వీన్’ భామ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలియా భట్ ఓ సగటు హీరోయిన్ అని.. ఆమెతో తనకు పోటీ ఏంటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి 2019లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో ఉత్తమ హీరోయిన్ ఎవరనే అంశం గురించి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో కంగనా మణికర్ణిక సినిమాతో పోటీపడగా.. అలియా భట్ గల్లీ బాయ్ సినిమాతో కంగనాకు పోటీగా నిలిచారు.
అయితే ఈ ఓటింగ్‌లో కంగనానే ఉత్తమ హీరోయిన్‌గా గెలిచినట్లు సదరు మీడియా ప్రకటించింది. ఈ విషయాన్ని కంగనా దగ్గర ప్రస్తావించగా... ‘నాకు పోటీగా అలియా ఉందనే విషయం తల్చుకుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. గల్లీ బాయ్ చిత్రంలో ఆమె నటన సగటు హీరోయిన్ యాక్టింగ్‌లానే ఉంది. మిగతా సినిమాల్లో ఎలా నటించిందో ఈ చిత్రంలోనూ అలానే యాక్ట్ చేసింది. కానీ మణికర్ణిక చిత్రంలో నేను మహిళా సాధికారితను తెలిపేలా.. మంచి నటన కనబరిచాను. అలాంటిది నాతో అలియా పోటీపడటం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీడియా ఇలాంటి సినీ స్టార్ల పిల్లలను ప్రోత్సాహించడం మానుకుంటే మంచిది. లేదంటే మన పరిశ్రమ ప్రమాణాలు ఎన్నటికి మెరుగవ్వవు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment