సాక్షి, కర్ణాటక : గుండెపోటుతో ఆదివారం కన్నుమూసిన కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా (39) అంత్యక్రియలు కనకపుర రోడ్డులోని నెలగోళి గ్రామంలోని ఫారంహౌస్‌లో ముగిశాయి. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరిపారు. ఆదివారం రాత్రి నుంచి నగరంలోని బసవనగుడిలోని చిరంజీవి సర్జా నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. పెద్దసంఖ్యలో బంధువులు, రాజకీయ నాయకులు, అభిమానులు అంతిమ దర్శనం చేసుకున్నారు. పురోహితులు సంస్కార పూజలను పూర్తి చేసి, మధ్యాహ్నం రెండు గంటలకు పూలతో అలంకరించిన వాహనంలో కనకపుర రోడ్డులోని సొంత ఫాంహౌస్ బృందావనకు తీసుకెళ్లారు. అభిమానులు అధిక సంఖ్యలో వస్తారని భావించి రామనగర జిల్లా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొదట మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ తమ్ముడు ధృవ సర్జా బృందావనంలోనే అన్న స్మృతి ఉండాలని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అశ్రు నివాళులు మధ్య పార్థివ దేహాన్ని ఖననం చేశారు.
అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు
వెక్కివెక్కి ఏడ్చిన అర్జున్
చిరంజీవి సర్జా మామ, బహుభాషా నటుడు అర్జున్ కుటుంబం ఆదివారం రాత్రి చెన్నై నుంచి కారులో రాత్రి 11:30 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. నేను మీ మామ వచ్చాను, లేవరా అని బిగ్గరగా విలపించడం చూసి అందరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా పార్థవశరీరం దర్శించటానికి ప్రముఖులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
ఆత్మీయునికి దూరమయ్యాం
యశవంతపుర: కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మృతి పట్ల శాండల్‌వుడ్ ముఖ్యలు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సర్జా సతీమణి మేఘనారాజ్‌ను, కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం డీకేశి మీడియాతో మాట్లాడుతూ మనిషిగా పుట్టాక మరణం అనివార్యమన్నారు. చావు ఎవరి చేతిలో లేదు. యముడు మనపై ఎలాంటి కరుణ చూపడు అనటానికీ చిరంజీవి సర్జా మరణం సాక్షి. చిన్న వయస్సులోని ఒక నటుడు దూరం కావటం సినిమా రంగానికీ తీవ్ర నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని పేర్కొన్నారు.
నాకు గాడ్ ఫాదర్ : చందనశెట్టి
తను బెంగళూరుకు వచ్చిన మొదటలో చిరంజీవి సర్జా ఆశ్రయం కల్పించిన్నట్లు బిగ్‌బాస్ విజేత, గాయకుడు చందనశెట్టి తెలిపారు. చిరంజీవి సర్జా మరణవార్త విని షాక్‌కు గురైన్నట్లు చెప్పారు. అర్జున్, చిరంజీవి సర్జాలు వారి ఇంటిలోనే పెట్టుకొని సంవత్సరం పాటు తనకు ఆశ్రయం కలి్పంచిన్నట్లు చెప్పారు. చిరంజీవి సర్జా నటించిన వరదనాయక్ సినిమాలో పాటలు పాడే చాన్స్ ఇచ్చాడని తెలిపారు.
మిత్రున్ని కోల్పోయా : రాధికా పండిత్
ఒక మంచి స్నేహితుడిని దూరమైనాడని నటి రాధికా పండిత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్ చేస్తూ చిరంజీవి సర్జా మరణవార్తను నమ్మలేకపోతున్నా. మేఘనా, ధృవ కుటుంబానికీ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు కల్పించాలని అని కోరుకున్నారు.
సర్జా కుటుంబానికి జూన్ నెల విషాదం
చిరంజీవి సర్జా ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చిరంజీవి సర్జా అన్న కిశోర్ సర్జా 2009 జూన్ 27న గుండెపోటుతో 50 ఏళ్లు వయస్సులో మృతి చెందారు. దీనితో జూన్ నెల సర్జా కుటుంబానికి కలిసి రావటం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గ్రామస్థులు కన్నీరు
చిరంజీవి సర్జా కుటుంబానికి రామనగరకు సమీపంలో నెలగుళి వద్ద నాలుగు ఎకరాల తోట ఉంది. అప్పుడప్పుడు అక్కడకు వెళ్లేవారు. గ్రామస్థులను చూసి ఆయన కారు నిలిపి ఆప్యాయంగా మాట్లాడేవారు. చిరంజీవి సర్జా మరణ వార్తతో గ్రామస్తులు కన్నీరుకార్చారు. సర్జా పెళ్లి సందర్భంగా తోటలో గ్రామస్తులకు విందునిచ్చారని గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment