
మలేసియా విలన్లతో... కపాలి
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏం చేసినా సంచల నమే. విశేషం ఏమిటంటే, మొన్నటి దాకా ‘కపాలి’లో రజనీకాంత్ పెరిగిన గడ్డంతో కనిపించిన ఫోటోలే బయటకొచ్చాయి. తాజాగా, రజనీకాంత్ నున్నగా గడ్డం గీసు కొని, అందమైన మీసకట్టుతో గ్లామర్‌గా అనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఒకపక్క శంకర్ దర్శకత్వంలో ‘రోబో 2.0’ సినిమా ప్రారంభమైనా, మరోపక్క ‘కపాలి’ చిత్రంతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు.
యువ తమిళ దర్శకుడు పి. రంజిత్ దర్శకత్వంలో, అగ్ర నిర్మాత ‘కలైపులి’ ఎస్. థాను ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా ఫోటోల్లో రజనీకాంత్ మలేసియాకు చెందిన యాక్టర్ నార్మన్ హకీమ్‌తో కలసి ఉన్నారు. సంగతేమి టయ్యా అంటే... నార్మన్ ఈ చిత్రంలో ఒక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి, ప్రసిద్ధ చైనీస్ యాక్టర్ జెట్లీ ‘కపాలి’లో విలన్‌గా నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, చివరకు అవన్నీ వట్టి గాలివార్తలని తేలింది. మలేసియన్ నటుడు రోస్యమ్ నోర్, తైవాన్‌కు చెందిన యాక్టర్ విన్‌స్టన్ ఛావోలు ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలు ధరిస్తున్నారు.
మొత్తానికి, ‘కపాలి’ సెట్స్‌లోని రజనీ తాజా గెటప్ స్టిల్స్ సినీ ప్రియుల్లో చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాదికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ‘మహాదేవ’ అని టైటిల్ అనుకుంటున్నట్లు భోగట్టా. బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఈ చిత్రంలో కథానాయిక. అలాగే, ‘అట్టకత్తి’ దినేశ్, కలై అరసన్, జాన్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ‘బాషా’ తరువాత మళ్ళీ చాలారోజులకు రజనీ కాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాల కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!