టైటిల్ : దేవ్
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్
సంగీతం : హారిస్ జయరాజ్
దర్శకత్వం : రజత్ రవిశంకర్
నిర్మాత : ఎస్ లక్ష్మణ్ కుమార్, బి. మధు
కోలీవుడ్ హీరో అయినా తెలుగులో కూడా కార్తికి మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా తెలుగులో తన సినిమాను ప్రమోట్ చేయటం విషయంలో కార్తి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాడు. అందుకే కార్తి ప్రతీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. అదే బాటలో తాజాగా దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తి. చినబాబు సినిమాలో ఊరమాస్ లుక్‌లో కనిపించిన కార్తి, ఈ సారి స్టైలిష్ లుక్‌లో దేవ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రజత్ రవిశంకర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.
కథ :
దేవ్ రామలింగం (కార్తి)కి సాహసాలు చేయటం అంటే ఇష్టం. ఎప్పటికైనా ఎవరెస్ట్‌ను ఎక్కాలని కలలు కంటుంటాడు. ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఏదో ఒక సాహసం చేస్తూనే ఉంటాడు. అంతేకాదు తనతో పాటు చిన్ననాటి స్నేహితులు విఘ్నేష్, నిషాలను కూడా ప్రతీ చోటికి వెంట తీసుకెళుతుంటాడు. దేవ్ చేసే సాహసాలకు బ్రేక్ వేయాలంటే తనని ప్రేమలో పడేయాలని భావించిన విఘ్నేష్, నిషా ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ చూసి ఓ అమ్మాయి సెలెక్ట్ చేసి ప్రేమించమని దేవ్‌కు సలహా ఇస్తారు. అలా ఫేస్‌బుక్ చూస్తుండగా కనిపించిన మేఘ్న పద్మావతి(రకుల్ ప్రీత్ సింగ్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు దేవ్. మేఘ్న, పాతికేళ్ల వయసులోనే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి. తన తల్లి జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా మగాళ్ల మీద ద్వేశం పెంచుకొని డబ్బు సంపాదించటమే జీవిత లక్ష్యంగా నిర్ణయించుకుంటుంది. ప్రతీది తన వైపు నుంచి, స్వార్థంతో ఆలోచించే మేఘ్నను, జీవితంలో చేసే ప్రతీ పనిలోనే అడ్వంచర్ ఉండాలని భావించే దేవ్ ఎలా ప్రేమలో పడేశాడు.? వారి ఇద్దరి ప్రయాణంలో ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
దేవ్ పాత్రలో కార్తి నటన బాగుంది. తనదైన నేచురల్ పర్ఫామెన్స్‌తో పాటు స్టైలిష్ లుక్‌లోనూ ఆకట్టుకున్నాడు. డ్యాన్స్‌లు, యాక్షన్స్ సీన్స్‌లో మరింతగా మెప్పించాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. మేఘ్న పాత్రలో రకుల్ ఆకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాల్లో రకుల్ నటన కాస్త అతిగా అనిపిస్తుంది. లుక్స్ పరంగా మాత్రం రకుల్‌కు మంచి మార్కులు పడతాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటులు ఉన్న వాళ్లకు పర్ఫామెన్స్‌కు పెద్దగా అవకాశం లేదు. కేవలం ఒకటి రెండు సీన్స్‌కు మాత్రమే పరిమితమయ్యారు. వారి పాత్రలకు వేరే వారితో చెప్పించటంతో ఆ పాత్రలు మరింతగా తేలిపోయాయి. హీరో ఫ్రెండ్స్‌గా కనిపించిన విఘ్నేష్, అమృతలు అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేసినా వారి పాత్రలు కూడా ఆకట్టుకునే స్థాయిలో లేవు.
విశ్లేషణ :
దేవ్ కథలో రొమాన్స్, అడ్వంచర్, ఫ్రెండ్‌షిప్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా తయారు చేసుకున్న దర్శకుడు.. ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో తడబడ్డాడు. ముఖ్యంగా దేవ్ కోసం రజత్ ఎంచుకున్న కథనం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా లేదు. క్యారెక్టరైజేషన్స్ ఆసక్తికరంగా లేకపోవటంతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు.. కథ, పాత్రల స్వభావాల మీద కన్నా లుక్స్, రిచ్‌నెస్, లొకేషన్స్ మీదే ఎక్కువగా దృష్టిపెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ డ్రాబ్యాక్ మ్యూజిక్. హారిస్ జయరాజ్ అందించిన పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా నిరాశపరుస్తుంది. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్. ప్రతీ ఫ్రేమ్‌ను తెర మీద అందంగా, రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
లొకేషన్స్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే
సంగీతం
క్యారెక్టరైజేషన్స్
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment